సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఆమోదించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్‌లోనే ఉండడంతో ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. కాగా ఇవాళ ఉదయమే స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అనంతరం గన్‌పార్క్ సందర్శించిన ఈటల తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. కాగా ఈటెల రాజేందర్ జూన్ 14న బీజేపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది.
ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్ ఛుగ్ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అవ్వటంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆ స్థానానికి సంబంధించి శనివారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment