సంప్రదాయ వేషధారణలు.. వినూత్న వాయిద్యాలు.. ప్రదర్శనలు.. శవయాత్రలు.. వ్యంగ్య ఫ్లెక్సీలు.. దిష్టిబొమ్మల దహనాలు.. జిల్లాలో ఎటుచూసినా సమైక్య నిరసనలే. పట్టుమని పదేళ్లు కూడా లేని చిన్నారులు మేము సైతం అంటూ పోరుబాటలో కలిసి నడుస్తున్నారు. రేపోమాపో రాలిపోయే వృద్ధులు సైతం ఒంటిపై సమైక్యాంధ్ర చిత్రాలతో భాగస్వాములవుతున్నారు. ఎటొచ్చి కొందరు నాయకులే అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
సాక్షి, కర్నూలు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ నిరసనలు హోరెత్తుతున్నాయి. బుధవారం ఎనిమిదో రోజు కూడా ఆందోళనలు మిన్నంటాయి. కుల, కార్మిక, కర్షక సంఘాలతో పాటు ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. న్యాయవాదులు.. విద్యార్థులు తమదైన శైలిలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడగా.. ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించారు.
కర్నూలుకు చెందిన పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో దాదాపు 500 మంది సభ్యులు జాతీయ రహదారిపై యోగాసనాలను ప్రదర్శించి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. అనంతరం రోడ్డుపైనే అల్పాహారం స్వీకరించారు. విద్యాశాఖ ఉద్యోగులు సమైక్యాంధ్రను కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీని రూపొందించి ప్రదర్శించడం ప్రజలను ఆకట్టుకుంది. ఆత్మకూరులో విద్యార్థులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద నిరసన ప్రదర్శన చేపట్టి సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో దాదాపు 1000 మంది ముస్లింలు తహశీల్దార్ కార్యాలయం మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకుని రాకపోకలను స్తంభింపజేశారు.
సోనియా మనసు మారాలని కోరుతూ నడి రోడ్డుపైనే ప్రార్థనలు నిర్వహించారు. చాగలమర్రిలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టి జాతీయ ర హదారిని దిగ్బంధించారు. కొత్తపల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనాథరెడ్డితో పాటు జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు రాస్తారోకో, ధర్నాలు నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెలుగోడు పట్టణంలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నాలు నిర్వహించారు. పత్తికొండలో జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింలు, వ్యాపారులు పట్టణంలోని ఆర్‌అర్‌బీ అతిథిగృహం నుంచి ప్రదర్శనగా నాలుగు స్తంభాల మంటపం వద్దకు చేరుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తుగ్గలిలో జేఏసీ ఆధ్వర్యంలో రిలేనిహారదీక్షలు చేపట్టారు. తెర్నేకల్లులో హైస్కూల్ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మండల కేంద్రమైన దేవనకొండలో ఏపీ ట్రాన్స్‌కో అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణంలో బంద్ చేయించారు. కరివేములలో గ్రామస్తులు వంటావార్పు నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్ వద్ద రిలేనిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఏపీ ఎన్‌జీవోస్, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. 72 గంటల సమ్మెలో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు మూడో రోజు పెన్‌డౌన్ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
డోన్ పట్టణంలోనూ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదోనిలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఏకపక్ష నిర్ణయంపై జేఏసీ నేతలు మండిపడ్డారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డులో 400 మంది సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఇక మిల్టన్ విద్యా సంస్థల అధినేత సగరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్లను ఊడ్చి వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. కేసీఆర్ ఖబడ్దార్ అంటూ నినదించారు.
సమైక్యం
Published Thu, Aug 8 2013 4:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement