సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యవాద పోరులో జిల్లా కాంగ్రెస్ నేతలు సొంత ఎజెండాతో చేస్తున్న రాజకీయం చర్చనీయాంశమవుతోంది. ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని లబ్ధి పొందే దిశగా జిల్లాలోని రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ ప్రకటన వస్తే తొలి రాజీనామా తనదేనని చెప్పిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రకటించినప్పటికీ... తర్వాత పరిణామాల్లో ఆయన కర్నూలు వైపు కన్నెత్తి చూడలేదు. అదే సమయంలో రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి జిల్లా కేంద్రానికి వచ్చి ర్యాలీ నిర్వహించారు. మరో అడుగు ముందుకేసిన టీజీ ఒకరోజు నిరాహారదీక్ష జరిపి రాయలసీమకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే మకాం వేసిన కోట్ల మాత్రం.. సమైక్యాంధ్ర, లేదంటే మూడు రాష్ట్రాలు చేయాలని... అదీ కాదంటే కర్నూలును తెలంగాణలో కలపాలనే డిమాండ్‌తో లాబీయింగ్ ప్రారంభించారు. దీంతో మంగళవారం చోటుచేసుకున్న పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. జిల్లాకు చెందిన నంద్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి, మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రాంరెడ్డి, మురళీకృష్ణ, లబ్బి వెంకటస్వామి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబులతో కలిసి కోట్ల.. సోనియాగాంధీని కలవడం జిల్లా కాంగ్రెస్‌లోని విభేదాలను బయటపెట్టింది.
సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ తీసుకున్న కోట్ల.. టీజీ వెంకటేశ్‌తో పాటు ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డిని తీసుకెళ్లకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందని తెలుస్తోంది.
టీజీని ఒంటరిని చేయడంలో భాగమేనా?: తెలంగాణ ప్రకటన వెలువడక ముందు వరకు రాయల తెలంగాణ నినాదమే కోట్ల వర్గీయులది. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాయలసీమకు ముఖ్యంగా కర్నూలుకు జరిగే అన్యాయంపై నివేదికలు తెప్పించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూ సమైక్యాంధ్రప్రదేశ్‌గా కొనసాగించని పక్షంలో కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కూడా డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి.
దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తాను సమైక్య నినాదానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అయితే లోపాయికారిగా కేంద్ర మంత్రి హోదాలో తనవంతు ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. అందులో భాగంగానే మంగళవారం సోనియాగాంధీని, కేంద్ర మంత్రులను కలిశారు. అదే సమయంలో కర్నూలులో ఉన్న టీజీ వెంకటేశ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ‘రాష్ట్రాన్ని విభజిస్తే చరిత్ర సోనియాగాంధీని క్షమించదు. రాష్ట్ర విభజనలో అన్ని పార్టీలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాత్ర కూడా ఉంది’అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోనియాను కలిసినప్పుడు కోట్ల, ఆయన వర్గీయులు టీజీ వ్యవహారశైలిపై ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. కర్నూలులో సమైక్యవాదులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారని, చివరికి పార్టీ నేతలను కూడా తప్పుపడుతూ తన రాజకీయ స్వార్థం చూసుకుంటున్నారని సోనియాకు వివరించారు. ఢిల్లీలో, హైదరాబాద్‌లో రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యమంలో కలిసి రావడం లేదని ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఆమెకు ఫిర్యాదు చేశారని ఓ నేత తెలిపారు. టీజీపై చర్యలకు కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.
పార్టీలో టీజీకి సహాయ నిరాకరణ
జిల్లాలో గత కొంత కాలంగా కోట్ల, టీజీ వర్గాల మధ్య విభేదాలున్నా... డీసీసీ నేతలు, మరికొందరు నాయకులు కేంద్ర, రాష్ట్ర మంత్రులిద్దరితో సంబంధాలు కొనసాగించేవారు. డీసీసీ అధ్యక్షుడు రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు ఈ కేటగిరీలో ఉండేవారు. కాగా ఇటీవలి కాలంలో కోట్ల వీరిద్దరికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో టీజీకి సహాయ నిరాకరణ చేస్తూ, పూర్తిగా కోట్ల వర్గీయులుగా మారినట్లు డీసీసీ వర్గాలు చెబుతున్నాయి. రెంటికీ చెడిన రేవడిగా టీజీని మార్చే వ్యూహంలో భాగంగానే కోట్ల వర్గీయులు ‘సమైక్య రాజకీయం’ సాగిస్తున్నట్లు గత కొద్దిరోజుల పరిణామాలను బట్టి తెలుస్తోంది.
‘ఆధిపత్య’ ఉద్యమం
Published Thu, Aug 8 2013 4:44 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement