న్యాయవాదులకు చెక్కు అందజేస్తున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: న్యాయవాదులకు అండగా ఉండేందుకు ‘వైఎస్సార్ లా నేస్తం’ తీసుకొచ్చామని, పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు వృత్తి జీవితంలో పేదలకు సాయపడాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. పథకంలో కొద్ది మార్పులు చేసి ఆర్నెల్లకు ఒకసారి, ఏడాదికి 2 దఫాలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘వైఎస్సార్ లా నేస్తం’ ద్వారా దాదాపు 4,248 మంది లాయర్లను ప్రతి నెలా ఆదుకున్నామని వెల్లడించారు.
రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతోపాటు కోవిడ్ సమయంలో దాదాపు రూ.25 కోట్ల మేర లాయర్లకు ప్రయోజనం చేకూర్చినట్లు వివరించారు. పేదవాడి పట్ల న్యాయవాదులు అంకితభావం చూపాలని కోరారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్రవాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ.1,00,55,000 మేర ఆర్థికసాయాన్ని సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. సీఎం ఏమన్నారంటే..
వృత్తిలో ఊతమిచ్చేందుకు...
దేవుడి దయతో గత మూడు సంవత్సరాలుగా మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. న్యాయవాదులకు ప్రభుత్వం తోడుగా ఉందన్న సంకేతాన్ని గట్టిగా చెప్పేందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నా. న్యాయవాది వృత్తిని ఎంచుకున్నవారు మన రాజ్యాంగాన్ని, చట్టాలను క్షుణ్నంగా చదువుకుని న్యాయవాదులుగా స్ధిరపడే క్రమంలో తొలి మూడేళ్లు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో పాదయాత్ర సందర్భంగా చాలాసార్లు నా దృష్టికి తెచ్చారు.
వారంతా సొంత కాళ్ల మీద నిలబడే ఒక గొప్ప పథకం ఇది. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమం న్యాయవాదులుగా స్థిరపడేందుకు దోహదం చేస్తుంది. ప్రభుత్వం వారికి తోడుగా నిలవడం వల్ల డబ్బులు లేని పేదవాడికి సాయం చేయగలుగుతారనే విశ్వాసం ఉంది. ప్రభుత్వం తమకు తోడుగా నిలిచినట్లుగానే, తాము కూడా పేదలకు సాయపడాలనే తలంపు వారి మనసులో మెదలాలన్నదే మా ఆరాటం.
చదువు పూర్తి చేసుకుని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన తరువాత తొలి మూడేళ్లు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తోడుగా ఉందనే భరోసా ఇవ్వడం కోసం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చాం. ఇది వారికి వృత్తిలో ఊతమివ్వడంతో పాటు స్ధిరపడేందుకు దోహదం చేస్తుంది.
మూడున్నరేళ్లలో 4,248 మందికి లబ్ధి..
ఈ పథకం ద్వారా మూడున్నరేళ్లలో దాదాపు 4,248 మంది లాయర్లను ప్రతి నెలా ఆదుకున్నాం. రూ.35.40 కోట్లు సహాయంగా అందించాం. ఈరోజు 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు పథకంలో కొనసాగుతున్నారు. వీరికి ఇవాళ దాదాపు రూ.కోటికి పైగా జమ చేస్తున్నాం. ఒకేసారి పెద్ద అమౌంట్ ఇస్తే వారి అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పథకంలో కొద్ది మార్పులు చేసి ఆర్నెల్లకు ఒకసారి, ఏడాదికి 2 సార్లు అందచేస్తున్నాం.
రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్...
న్యాయవాదుల సంక్షేమం కోసం మరో గొప్ప అడుగు వేసి రూ.100 కోట్లతో లాయర్ల కార్పస్ ఫండ్ నెలకొల్పాం. కోవిడ్ సమయంలో కార్పస్ ఫండ్ ద్వారా దాదాపు రూ.25 కోట్ల మేర మంచి చేయగలిగాం. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటూ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం లా సెక్రటరీకి నేరుగా దరఖాస్తుతో పాటు ఆన్‌లైన్‌లో లా సెక్రటరీ మెయిల్ ఐడీకి కూడా దరఖాస్తు చేయవచ్చు. sec&law@ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక లా నేస్తం పథకానికి సంబంధించి కూడా పారదర్శకంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ysrlawnestham.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం.. సైనికుడి చేతిలో ఉన్న తుపాకీ లాంటిదని, హంతకుడి చేతిలో ఉండే బాకు లాంటిది కాదని చెబుతుంటారు.
నేను మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు దాన్ని గుర్తుంచుకుని అదే అంకిత భావాన్ని పేదవాడి పట్ల చూపాలని కోరుతున్నా. ఈ కార్యక్రమంలో లా సెక్రటరీ జి.సత్యప్రభాకరరావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రగిరి విష్ణువర్ధన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసం పెరిగింది
బెజవాడ బార్ అసోసియేషన్‌లో ఏడాది నుంచి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. మంచి క్రిమినల్ లాయర్ అవ్వాలన్నది నా లక్ష్యం. మాది మధ్యతరగతి కుటుంబం కావడంతోకోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతావు? మంచి జీతం వచ్చే ఉద్యోగంలో చేరమని తల్లిదండ్రులు చెబుతుంటారు.
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వైఎస్సార్ లా నేస్తం పథకం ఎంతో ఉపయోగపడింది. దీంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. తల్లిదండ్రులపై ఆధారపడకుండా నేను నిలదొక్కుకునేందుకు ఈ పథకమే కారణం. పాదయాత్ర హామీని సీఎం జగన్ నెరవేర్చడంతో చాలా సంతోషంగా ఉన్నాం,ద్యాంక్యూ సార్.
–అమూల్య, లా నేస్తం లబ్ధిదారు, జూనియర్ న్యాయవాది, ఎన్‌టీఆర్ జిల్లా
ఉన్నత చదువులకు ఉపకారం..
జూనియర్ అడ్వకేట్‌గా పని చేస్తున్నా. అమ్మ టైలరింగ్ చేస్తుండగా నాన్న ప్రైవేట్ ఉద్యోగి. 2021 నుంచి లా నేస్తం తీసుకుంటున్నా. ఈ డబ్బులు జ్యూడీషియల్ ఎగ్జామ్స్ ఫీజు కోసం, మెటీరియల్ తీసుకోవడానికి ఉపయోగపడుతోంది. ఉన్నత చదువులకు మీరు ఇస్తున్న సపోర్ట్ ఎంతో బాగుంది. విద్యార్థులకు మంచి పథకాలు ప్రవేశపెట్టారు.
విదేశాల్లో చదువుకునేందుకు కూడా సాయం చేస్తున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని పేద విద్యార్ధులకు ఉచితంగా సాయం చేయాలనుకుంటున్నా. రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు మీవల్ల ప్రయోజనం పొందుతున్నాయి. పెన్షన్, రేషన్ ఇంటి దగ్గరే ఇస్తున్నారు. మా అమ్మకు ఇంటి పట్టా వచ్చింది.
–సీహెచ్. వెన్నెల, జూనియర్ న్యాయవాది, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment