
సాక్షి, అమరావతి: లా నేస్తం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం రూ.1,00,55,000లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం వైఎస్ జగన్ బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బుధవారం చెల్లించబోయే మొత్తంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు.
ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది.
కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్ ఫండ్ నుంచి రూ.25 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment