న్యాయవాదులకు ‘వైఎస్సార్ లా నేస్తం’ చెక్కును అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జూనియర్ లాయర్లు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాక పేదల పట్ల ఇదే రీతిలో మమకారం చూపాలి. ప్రభుత్వం తరఫున ఒక అన్నగా, స్నేహితుడిగా మీ నుంచి నేను ఆశించేది అదే. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులకు అండగా నిలుస్తూ ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ లా నేస్తం’ లాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. యువ న్యాయవాదులు వృత్తిలో ప్రవేశించిన తొలి మూడేళ్ల పాటు ఆర్థికంగా ఊతమిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. నాలుగేళ్లుగా లా నేస్తం పథకాన్ని అమలు చేస్తూ ఇప్పటివరకు 5,781 మందికి మొత్తం రూ.41.52 కోట్లు అందించినట్లు చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరి – జూన్ వరకు మొదటి విడత వైఎస్సార్ లా నేస్తం సాయం కింద 2,677 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.ఐదు వేలు స్టైఫండ్ చొప్పున రూ.25,000 అందచేస్తూ మొత్తం రూ.6,12,65,000ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, లా సెక్రటరీ జి.ప్రభాకర్, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...
వృత్తిలో నిలదొక్కుకునేలా..
న్యాయవాదులు లా కోర్సు పూర్తి చేసిన మొదటి మూడేళ్లు ప్రాక్టీస్‌పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే చదువులు పూర్తై కోర్టుల్లో అడుగుపెడుతున్న తరుణంలో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా తోడుగా నిలిచి నెలకు రూ.5 వేలు చొప్పున ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నాం. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80 లక్షలు అందిస్తున్నాం. దీనివల్ల వృత్తిలో ఇబ్బంది పడకుండా నిలదొక్కుకుని ముందుకు వెళ్తారన్న ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం.
రూ.వంద కోట్లతో వెల్ఫేర్ ట్రస్ట్..
ఇలాంటి ఆలోచన, ఇలాంటి పథకం కేవలం మన రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా అడ్వొకేట్లకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. మెడిక్లెయిమ్, న్యాయవాదుల అవసరాలకు రుణాలు లాంటి వాటికి ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేశాం. ఈ రెండు కార్యక్రమాల ద్వారా అడ్వొకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉందనే సంకేతం వెళ్లింది.
ఇంకా బాగా ఉపయోగపడాలని..
ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నేను న్యాయవాదులను కోరేది ఒక్కటే. జూనియర్ న్యాయవాదులకు ఈ పథకం ద్వారా మంచి జరిగితే వారు వృత్తిలో స్థిరపడ్డాక ఇదే మమకారాన్ని పేదల పట్ల చూపిస్తారని విశ్వసిస్తున్నా. ఒక అన్నగా, స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదే. దేవుడి దయ వల్ల మంచి జరుగుతోంది. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా.
ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఆర్నెళ్లకు కలిపి ఒకేసారి మొత్తం రూ.30 వేలు అందిస్తే జూనియర్ న్యాయవాదులకు ఇంకా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో క్రితంసారి మార్పులు చేశాం. మళ్లీ డిసెంబరులో ఈ ఏడాది రెండో దఫాకి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. వీటన్నింటి వల్ల న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నా.
మీ స్ఫూర్తితో పేదలకు సాయం చేస్తా..
గుంటూరు బార్ అసోసియేషన్‌లో జూనియర్ అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. నిరుపేద కుటుంబానికి చెందిన నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా. మా బాబాయి కూలి పనులు చేస్తూ తన పిల్లలతో పాటు నన్ను చదివించారు. లా కోర్సు పూర్తవగానే గుంటూరులో ఎక్కడ ఉండాలో అర్ధం కాలేదు. స్పందనలో దరఖాస్తు చేసుకోగానే మహిళా ప్రాంగణంలో వసతి కల్పించారు. వైఎస్సార్ లా నేస్తం కింద నెలకు రూ.ఐదు వేలు చొప్పున రెండేళ్లుగా క్రమం తప్పకుండా అందుతోంది.
మా బాబాయి పిల్లలకు అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన వస్తోంది. పిన్నికి చేయూత అందుతోంది. మా కుటుంబ సభ్యులంతా మీ పథకాలను పొందుతున్నారు. అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఇలాంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీర్ఘకాలం ప్రజలకు సేవ అందించాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ స్ఫూర్తితో పేదలకు న్యాయం సాయం చేస్తానని మాట ఇస్తున్నా సార్.
– రత్నకుమారి, న్యాయవాది, గుంటూరు
ఎంతో ఉపయోగం..
జూనియర్ అడ్వొకేట్‌గా 2020లో బెజవాడ బార్ అసోసియేషన్‌లో ప్రాక్టీస్ ప్రారంభించా. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు సాయం చేస్తుండడంతో మాలాంటి ఎంతోమంది జూనియర్ అడ్వొకేట్స్ లబ్ధి పొందుతున్నారు. లా నేస్తం పథకానికి దరఖాస్తు చేయగానే వెరిఫికేషన్ చేసి మంజూరు చేశారు. మీరు అందిస్తున్న ఈ సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. అడ్వొకేట్స్ కమ్యూనిటీ నుంచి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది.
– అరవింద్, అడ్వొకేట్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment