కూటమి ప్రభుత్వానికి జేఏసీ సూచనలు
సాక్షి, అమరావతి : మద్యం పాలసీని రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఏమిటని మహిళా సంఘాల ఐక్య వేదిక (జేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేదిక నేతలు సుంకర పద్మశ్రీ, డి. రమాదేవి, పి.దుర్గాభవాని, పి. పద్మ, ఎన్. విష్ణు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సర్కారుకు 11 సూచనలు చేశారు. ప్రభుత్వం అక్టోబరు నుంచి అమలులోకి తెచ్చే మద్యం పాలసీని కేబినెట్ ఆమోదంతో త్వరలో ప్రకటించనున్నట్లు.. లైసెన్సింగ్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులను ఇవ్వనున్నట్లు, లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానున్నట్లు వార్తలు వస్తున్నాయని వారు తెలిపారు.
అయితే, మద్యాన్ని నియంత్రించడం, నేరాలను అరికట్టడం, ప్రజల ఆరోగ్యం మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలపై హింసను అరికట్టడం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని చెప్పారు. అక్రమ అమ్మకాలు లేకుండా చేయడమా? లేక ఆదాయాన్ని పొందడమా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా టీడీపీ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా?.. మహిళలపై హింసకు కారణం కాదా?.. నేరాలు పెరగకుండా నిరోధిస్తుందా?.. అని వారు ప్రశ్నించారు.
అధ్యయనంలో ఏం తేల్చారు..
ఇక వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలపై అధ్యయనానికి వెళ్లిన బృందాలు తెలంగాణ విధానం బాగుందని రిపోర్టు ఇచ్చినట్లు మీడియాకు లీకేజీలిచ్చారని,.. కానీ, ఆ బృందాలు ఏం అధ్యయనం చేసి వచ్చాయో ఆ నివేదికను విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోవాలని, సాధారణ జనానికి నష్టంలేని విధానాన్ని రూపొందించాలని జేఏసీ నేతలు కోరారు. ఇక రాష్ట్రంలో వేళలతో నిమిత్తం లేకుండా మద్యం అక్రమ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదేన్నారు.
Comments
Please login to add a commentAdd a comment