రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎన్జీవోలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం ఆందోళన చేశారు. సచివాలయంలోని రెండు గేట్ల ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, హైదరాబాద్‌పై తామందరికీ హక్కు ఉందని ఉద్యోగులు తెలిపారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు వెళ్లిపోవాలంటూ కేసీఆర్ కావాలనే తమను రెచ్చగొట్టారని వారు ఆరోపించారు. ఉద్యోగులుగా హైదరాబాద్ నిర్మాణంలో తమకూ పాత్ర ఉందని, కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఉద్యమంలో పాల్గొంటారని వారు తెలిపారు.
రాష్ట్ర విభజన ఇప్పటికే నిర్ణయమైపోయిందని, అందువల్ల సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులంతా ఆయాప్రాంతాకు వెళ్లిపోవాల్సిందేనని ఇటీవల టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించడం, హరీశ్ రావు లాంటి నాయకులు కూడా ఆయనను సమర్థించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎన్జీవోలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. కార్యాలయాలకు తాళాలు వేయించడంతో ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయడంలేదు. బ్యాంకులతో సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ తాళాలు వేయిస్తున్నారు. దీంతో సీమాంధ్ర ప్రాంతంలో దాదాపుగా పాలన స్తంభించింది. వివిధ కోర్సులలో చేరేందుకు విద్యార్థులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉండగా, అవి పొందడం కూడా గగనం అవుతోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు, రేపు ప్రభుత్వ కార్యాలయాల బంద్ పాటిస్తున్నట్లు అక్కడి జేఏసీ ప్రకటించింది. చిత్తూరులో ఎమ్మెల్యే సీకే బాబు నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.