సమైక్యాంధ్ర కోసం ఓ పాత్రికేయుడు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరుగుతున్న ఆందోళనల సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన సాయి అనే పాత్రికేయుడు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న పలువురు నాయకులు చూసి, అతడిని అడ్డుకుని ఆత్మహత్యాయత్నాన్ని నిరోధించారు.
గత కొన్ని రోజులుగా సీమాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సమైక్యాంధ్ర కోసం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కాకినాడలో బుధవారం ఉదయం మెయిన్ రోడ్డులో ధర్నా చేశారు. ఆ తర్వాత కొంతసేపు మానవ హారం నిర్వహించారు. మసీదు సెంటర్లో కూడా ధర్నా చేయాలని ఆందోళనకారులు తలపెట్టారు. అంతా కలిసి మసీదు సెంటర్కు చేరుకున్నారు. అక్కడ ధర్నా ప్రారంభమైన కొద్దిసేపటికే స్థానిక దినపత్రికకు చెందిన విలేకరి సాయి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన వాహనంలో ఉన్న పెట్రోలును తీసుకుని, ఒంటిపై పోసుకున్నాడు. నిప్పు అంటించుకోబోతుండగా అక్కడే ఉన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వేణు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గమనించి అతడిని పట్టుకుని నిప్పు అంటించుకోకుండా ఆపారు.
రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటున్నారని, అది చూసి తట్టుకోలేకపోయానని ఆ తర్వాత సాయి చెప్పాడు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరులో రాష్ట్ర విభజనను తట్టుకోలేక రాజీవ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగిన కొద్ది సేపటికే పొరుగునున్న తూర్పుగోదావరి జిల్లాలో విలేకరి ఆత్మహత్యాయత్నం జరగడం గమనార్హం.