సమైక్య ఉద్యమంపై 1024 కేసులు నమోదు
సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎవరిమీదా పోలీసులు కేసులు పెట్టడం లేదని, ఆ ఉద్యమానికి సర్కారు అండదండలు ఉన్నాయంటూ కొందరు తెలంగాణ వాదులు చేస్తున్న ఆరోపణలకు పోలీసులు సమాధానం ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటివరకు 1024 కేసులు నమోదయ్యాయని అదనపు డీజీపీ కౌముది బుధవారం విలేకరులకు తెలిపారు. ఇంతవరకు 221 మందిని అరెస్ట్ చేశామని, మరో 1000 మందిని ముందస్తుగా అరెస్ట్ చేశామని ఆయన వివరించారు.
జాతీయ నాయకుల విగ్రహాల ధ్వంసంపై 39 కేసులు నమోదయ్యాయని, వీటికి సంబంధించి ఇప్పటివరకు 94మందిని అరెస్ట్ చేశామని కౌముది తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా అన్ని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యామాన్ని శాంతియుతంగా చేసుకోవాలని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఆయన కోరారు.