
సాక్షి, నల్లగొండ: ఇటీవల అరెస్ట్ అయిన జర్నలిస్టు రఘు మంగళవారం నల్లగొండ జిల్లా జైలునుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వేనంబర్‌లో గల భూమి విషయంలో ఫిబ్రవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో గిరిజన భరోసా యాత్రలో జరిగిన వివాదంలో అక్కడి పోలీసులు జర్నలిస్టు రఘును ఈ నెల 3న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
అతనికి సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదలకాగా, కాంగ్రెస్, బీజేపీ నాయకులు జైలు వద్ద స్వాగతం పలికారు. అక్రమంగా తనను అరెస్టు చేశారని, కనీసం నా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదని రఘు ఆరోపించారు.