ధర్నాలో పాల్గొన్న ప్యాక్స్ ఉద్యోగులు
ఖమ్మం వ్యవసాయం: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్యాక్స్ అసోసియేషన్(ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి ఉద్యోగుల సంఘం)జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ఎదుట జిల్లాలోని సహకార సంఘాల ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 2012 నుంచి పెండింగ్‌లో ఉన్న పే–రివిజన్‌ను అమలు చేయాలని, రూ.1640–4570గా ఉన్న మూల వేతనాలను 50 శాతానికి పెంచి, గ్రాట్యూటీ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు,పెన్షన్‌ను పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. డీసీసీ బ్యాంక్‌లో అర్హులైన సహకార సంఘాల ఉద్యోగులను తీసుకోవాలని కోరారు. ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి, డీసీసీబీ ఉపాధ్యక్షులు భాగం హేమంతరావు మాట్లాడుతూ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సహకార సంఘాల ఉద్యోగులకు మూడంచెల విధానం వర్తింప చేసి ఆదుకోవాలని కోరారు. డీసీసీబీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవని, చట్టాన్ని సవరించి చర్యలు తీసుకోవలసి ఉందని, ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర కమిటీ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఉద్యోగ సంఘం నేతలు సమస్యల వినతిపత్రాన్ని బ్యాంక్ సీఈఓ నాగచెన్నారావుకు అందజేశారు.