సీపీఎస్ విధానం వద్దు..
సీపీఎస్ విధానం వద్దు..
Published Wed, Aug 10 2016 6:27 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
గుంటూరు ఎడ్యుకేషన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం (సీపీఎస్)ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి సుదర్శనం రత్తయ్య డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా రత్తయ్య మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన అనంతరం జీవితం చివరి అంకంలో పెన్షన్ పొందే అవకాశం లేకపోవడం దారుణమన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు రాజ్యాంగ బద్ధమైనవని గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని, దేశ వ్యాప్తంగా 12 లక్షలకు పైగా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినకుండా తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌పీఎస్, సీపీఎస్ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు జి. ప్రతాప్ మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, ఆందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్‌పీఎస్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీపీఎస్ చట్టాలను ఉప సంహరించుకోవాలని ఉద్యోగుల మనోసై్థర్యాన్ని కాపాడాలని అన్నారు.
Advertisement