అవమానాలే బహుమానాలు | The Shame Is The Reward For Employees In Babu government | Sakshi
Sakshi News home page

అవమానాలే బహుమానాలు

Published Sun, Mar 31 2019 7:01 AM | Last Updated on Sun, Mar 31 2019 9:32 AM

The Shame Is The Reward For Employees In Babu government - Sakshi

సాక్షి, అమరావతి :  ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి... ప్రయివేటు సంస్థలను ప్రోత్సహించడం, ఉద్యోగులను తొలగించడం అనేవి చంద్రబాబు విధానాలు. ఆది నుంచి ఆయన అనుసరించే పద్ధతులు ఇవే. 1999–2004 మధ్య  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు డెయిరీతోపాటు అనేక సహకార డెయిరీలను నష్టాల్లోకి నెట్టి మూయించేశారు.

సహకార చక్కెర కర్మాగారాల షట్టర్లు వేయించారు. ఆర్టీసీని కూడా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ప్రణాళిక వేసినా.. ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. అందుకే చంద్రబాబును ప్రపంచబ్యాంకు ఏజెంటు అని వామపక్ష మేథావులు అంటుంటారు. ఆల్విన్, ఏపీ స్కూటర్స్, రిపబ్లిక్‌ ఫోర్జ్‌ లాంటి 23 ప్రభుత్వ రంగ సంస్థలు చంద్రబాబు జమానాలోనే మూతపడ్డాయి. దాంతో ఈ సంస్థల్లో పనిచేస్తున్న 26వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

మరో 18 వేల మందిని గోల్డెన్‌ షేక్‌ హ్యాండ్‌ పేరుతో బలవంతంగా రాజీనామాలు చేయించి ఇళ్లకు పంపించారు. చంద్రబాబు హయాంలో గోల్డెన్‌ షేక్‌ హ్యాండ్, వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీం(వీఆర్‌ఎస్‌) పేర్లు ఏమైనా.. బలవంతంగా ఉద్యోగులను ఇళ్లకు పంపేవే.  గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని తెరపైకి తెచ్చారు.

లంచగొండులంటూ ముద్ర
‘వేళాపాళా లేకుండా చంద్రబాబు రోజూ వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలు, వాటికి నివేదికలు అంటూ.. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారనేది అత్యధిక మంది ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న ఆవేదన. ఈ పనులవల్ల రాత్రి 10–11 గంటల వరకూ పనిచేసినా.. చిన్న తప్పునకే వేధిస్తారు.

దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. ఇవన్నీ చాలవన్నట్లు అధికార పార్టీ నాయకుల నుంచి అడ్డగోలుగా తమ వారికే పనులు చేయాలంటూ.. ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. దీంతో ఒత్తిడి ఎక్కువై బీపీ, షుగర్‌ వ్యాధుల భారిన పడుతున్నాం’ అని చాలామంది ఉద్యోగులు తమ బాధ వెళ్లగక్కుతున్నారు. ఒకవైపు ఉద్యోగుల బదిలీలకు సీఎం కనుసన్నల్లోని మంత్రులు లక్షలకు లక్షలు లంచాలు తీసుకుంటూ.. ఉద్యోగులపై లంచగొండులనే ముద్ర వేస్తున్నారని’ ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

26 మంది ఉద్యోగులపై క్రిమినల్‌ కేసులు
సీపీఎస్‌ రద్దు చేయాలన్న డిమాండుతో విజయవాడలో ఉద్యోగులు నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు 02–10–2018న 26 మందిపై విజయవాడలో క్రిమినల్‌ కేసులు పెట్టించారు. సీపీఎస్‌ రద్దు చేయాలని నాలుగేళ్లుగా ఉద్యమం చేయిస్తున్నారనే కోపంతోనే సీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజినేయులును సస్పెండ్‌ చేశారు.

సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎవరు హామీ ఇస్తే వారికే రాష్ట్రంలోని సీపీఎస్‌ ఉద్యోగ కుటుంబాలు మద్దతు ఇస్తాయని ప్రకటించినందుకు కక్షకట్టి ఆయన్ను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. తమ అడుగులకు మడుగులొత్తే ఉద్యోగ సంఘాల నేతలకు సొంత పనులు చేసి పెడుతూ.. ప్రజా సంక్షేమం దృష్టితో  తప్పులను ఎత్తిచూపితే మాత్రం సహించలేక తీవ్రస్థాయిలో కక్షసాధింపు చర్యలకు దిగుతారు.    

ఐఆర్‌ బకాయిలు రూ.5200 కోట్లు ఎగవేత
‘దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఎప్పటికప్పుడు ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) పెండింగులో లేకుండా ఇచ్చేశారు. చంద్రబాబు పాలనలో దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు డీఏలను కూడా సకాలంలో అమలు చేయకుండా పెండింగులో పెడుతోంది.

2018 జనవరి ఒకటో తేదీ నుంచి ఒకటి, జులై ఒకటో తేదీ నుంచి మరొకటి, 2019 జనవరి 1 నుంచి ఇంకొకటి వెరసి ప్రభుత్వ ఉద్యోగులకు మూడు కరువు భత్యాలు(డీఏ)లు, పెన్షనర్లకు మూడు డీఆర్‌లు పెండింగులో ఉన్నాయి. పదో పీఆర్సీకి సంబంధించి 11 నెలల బకాయిలు రూ.5100 కోట్లు ఎగవేశారు. ఓవైపు ఖర్చులు పెరిగిపోతుంటే.. ఇలా పీఆర్సీ బకాయిలు ఎగవేసి, డీఏలు పెండింగులో పెడితే ఎలాగని ఉద్యోగులు నిలదీస్తున్నారు.  

ఉద్యోగులపై వేధింపులకు నిదర్శనాలెన్నో.. 

  • వేతనాలు పెంచాలనే డిమాండుతో 2015లో హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టిన అంగన్వాడీలపై లాఠీచార్జీ చేయించింది చంద్రబాబు ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం పెంచినందున అదే దామాషాలో తమకూ వేతనాలు పెంచాలని గతేడాది చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన అంగన్వాడీలపై లాఠీచార్జీ చేయించారు. ఎన్నికలు సమీపించిన సమయంలో ఓట్లకోసం వారి వేతనాలను స్వల్పంగా పెంచారు.  
  • అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సాగిస్తున్న ఇసుక దందాను అడ్డుకున్నందుకు మహిళా తహసీల్దారు వనజాక్షిపై దాడికి పాల్పడి ఘోరంగా అవమానించారు. మహిళ అని కూడా చూడకుండా వనజాక్షిపై అందరి ఎదుటే దౌర్జన్యం చేసిన చింతమనేని ప్రభాకర్‌పై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా తిరిగి పరిధి దాటారంటూ వనజాక్షికే బెదిరింపులు. ‘మా వాళ్లు ఏం చేస్తున్నా.. చూసీ చూడనట్లు ఉండాలి. మా వాళ్ల వ్యవహారాలను అడ్డుకోవడానికి వీల్లేదు. మీరు కార్యాలయంలో ఉండాలేగానీ ఫిర్యాదు రాగానే పరిగెత్తుకుంటూ అక్కడకు వెళ్లి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం ఏమిటి? జరిగిందేదో జరిగిపోయింది.. రాజీ కండి...’అని చంద్రబాబు హుకుం.  
  • 50ఏళ్ల వయసుకే ఉద్యోగులను ఇళ్లకు పంపాలన్న కుట్ర బయటపడిందని ఉద్యోగులపై వేటు. ముసాయిదా జీవోలను బట్టబయలు చేయడంతో అధికార రహస్యాలను బహిర్గతం చేశారంటూ.. ఏమాత్రం సంబంధంలేని సచివాలయ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ, పెన్షనర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డితోపాటు సచివాలయ ఉద్యోగి తిమ్మప్ప సస్పెన్షన్‌. ఏడాదిన్నర తర్వాత సస్పెన్షన్‌ తొలగింపు.  
  • కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) రద్దుచేసి.. పాత పెన్షన్‌ స్కీమ్‌ వర్తింపజేయాలని నిరాహార దీక్షలు చేసిన పాపానికి వారేదో దేశద్రోహ నేరానికి పాల్పడినట్లుగా 26 మందిపై క్రిమినల్‌ కేసులు. 
  • సీపీఎస్‌ రద్దు చేసినవారికే మద్దతు ఇస్తామని, సీపీఎస్‌ రద్దు చేయాల్సిందేనని డిమాండు చేసినందుకు సీపీఎస్‌ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు రామాంజినేయులు యాదవ్‌పై సస్పెన్షన్‌.  

వివిధ సందర్భాల్లో అధికారులపై చంద్రబాబు వ్యాఖ్యలు..  

  • ఏయ్‌... జేసీ నువ్వేం చేస్తున్నావ్‌. ఏం తమాషాగా ఉందా? ఇదేం అడ్మినిస్ట్రేషన్‌? ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఎవరినీ వదిలిపెట్టను
  • మీవల్లే ఫెయిలయ్యాం. అధికారులవల్లే మిషన్లలో వైఫల్యం. శాఖల మధ్య సమన్వయం లేదు. గిరిజన ప్రాంతాల్లో చైతన్యం లేదు.
  • తోక జాడిస్తే కత్తిరిస్తా. నేను తలచుకుంటే ఏమి చేస్తానో తెలుసా.. అసలు మిమ్మల్ని సచివాలయంలోకి రానిచ్చింది ఎవరు...
  •  పిచ్చిపిచ్చిగా ఉందా? తమాషాలు చేస్తున్నారా...? ప్రతి ఫైలులో ఇష్టానుసారంగా రాస్తారా? ఇలాగైతే పరిపాలన ఎలా చేయాలి? 
  • బడ్జెట్‌లో కేటాయింపుల్లేకుండా నిధులు మంజూరు చేయడం వీలుకాదని ఉన్న నిబంధనలు రాసిన ఆర్థిక శాఖ అధికారిపై సీఎం చిందులు... 
  • అధికారుల వల్లే నాకు చెడ్డపేరు. నాకు తెలియకుండా జీవో ఇచ్చారు... అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు –విశాఖపట్నం జిల్లాలో 1,212 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ నిలదీయడంతో.. తనకు తెలియకుండా జీవో ఇచ్చారంటూ అధికారులపై  నెపం మోపారు. వాస్తవంగా సీఎం ఆమోదంతోనే ఈ జీవోను అటవీశాఖ ఇచ్చింది.  

పోరాటానికి బహుమానం ఉద్యోగం నుంచి తొలగింపు
సీఎం చంద్రబాబు, ఆయన కోటరీ ఏమి చెప్పినా తలూపాల్సిందే. వారు తప్పు చేయమంటే చేయాల్సిందే. లేదంటే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. ఇందుకు నాతోపాటు ఏలూరులో జూనియర్‌ అసిస్టెంట్‌ గా పనిచేసి చనిపోయిన వెంకట్రావు ఉదంతాలే ప్రత్యక్ష  నిదర్శనాలు. నేను ప్రాణాలతో ఉన్నా. పాపం వెంకట్రావు ఉద్యోగం పోయిందనే మానసిక వేదనతో ప్రాణాలు కోల్పోయారు.  

ఏలూరులో(రెవెన్యూ) జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసే వెంకట్రావు అనారోగ్య కారణాలతో విధులకు హాజరుకాలేకపోయారు. సమస్యను చెప్పినా వినకుండా.. ఆయనను సర్వీసు నుంచి తప్పించారు. దీనివల్ల మానసిక వ్యథతో మరింతగా అనారోగ్యం పాలై వైద్యం కూడా చేయించుకోలేని దుస్థితిలో ప్రాణాలు కోల్పోయారు. 

దళితులకు చేసే న్యాయం ఇదా?
బాబు సర్కారు అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించినందుకే నన్ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ఏపీఆర్‌ఎస్‌ఏ) జిల్లా అధ్యక్షునిగా, అంతకు ముందు ఏపీఎన్‌జీవో జిల్లా అధ్యక్షునిగా నాకు ఉద్యోగుల్లో పట్టు ఉంది.

చంద్రబాబు సర్కారు సాగించిన ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ఉద్యమించినందుకు బాబు సామాజిక వర్గానికి చెందిన జిల్లా కలెక్టరు కాటమనేని భాస్కర్‌ నన్ను 10 –3–2017లో అన్యాయంగా సస్పెండ్‌ చేశారు. ఏలూరులో పౌరసరఫరాల విభాగం డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. కక్ష కట్టి లేని సాకులతో నన్ను సస్పెండ్‌ చేశారు. తర్వాత 10–01–2019న ఉద్యోగం నుంచి తొలగించారు. నేను దళిత క్రిస్టియన్‌ను. దళిత ఉద్యోగుల పట్ల చంద్రబాబు మార్కు ప్రేమ అంటే ఇదీ.  
–ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు సాగర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement