జోరు పెరిగిన సమైక్య ఉద్యమం
Published Tue, Sep 17 2013 2:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం జోరు పెరిగింది. సోమవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు, ర్యాలీలు, వినూత్న నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగాయి. మరోవైపు.. ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులకు ఉద్యమ సెగ త గిలింది. టెక్కలిలో ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటిని జేఏసీ నేతలు, సభ్యులు ముట్టడించి నినాదాలు చేశారు. అక్కడ జరుగుతున్న గృహ నిర్మాణ శాఖాధికారుల సమీక్షను అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ ఘటనలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు చింతాడ గణపతి చొక్కా చిరిగిపోయింది. దీంతో ఉద్యమకారులు ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. మందస బస్టాండ్‌లో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పీసీసీ ఉపాధ్యక్షురాలు మజ్జి శారదను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తాను సమైక్యవాదినేనని ఆమె స్పష్టం చేయటంతో గొడవ సద్దుమణిగింది. శ్రీకాకుళంలో బీజేపీ సమావేశాన్ని ఉద్యమకారులు అడ్డుకుని నేతలను నిలదీశారు.
శ్రీకాకుళంలో ఖజానా శాఖ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి మావనహారం చేపట్టారు. రిమ్స్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. సుందర సత్సంగం సభ్యులు వైఎస్‌ఆర్ కూడలిలో రుద్రాభిషేకం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలో కంచిలి మండల రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల కూర్చున్నారు. గృహనిర్మాణశాఖ ఉద్యోగుల రిలే దీక్షల్లో గార, కోటబొమ్మాళి మండలాల అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జెడ్‌పీ ఉద్యోగులు కుటుంబాలతో సహా గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఆందజేశారు. వైద్యులు, న్యాయవాదులు, నీటి పారుదల శాఖ ఉద్యోగులు ఆర్‌టీసీ కాంప్లెక్స్ నుండి వైఎస్‌ఆర్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. పురపాలక సంఘం, పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పాలిటెక్నిక్ అధ్యాపకుల రిలే దీక్షలు కొనసాగాయి.
పాలకొండలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక వద్ద అల్లూరి, టంగుటూరు ప్రకాశం పంతులు, షిర్డీసాయి వేషధారణలతో సమైక్యవాదులు ప్రదర్శన నిర్వహించారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు రిలే దీక్షలో పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిం చారు. ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక వద్ద తంపటాపల్లి, టీకేరాజపురం, అట్టలి, తుమరాడ, బుక్కూరు, బెజ్జి, పనుకువలస పాఠశాలల ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. సంగీత విభావరి నిర్వహించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులకు సంకెళ్లు వేసి సోనియాగాంధీ తన చుట్టూ తిప్పుకుంటున్నట్టు ప్రదర్శించారు. భామినిలో ప్రైవేటు పాఠశాలలను మూయిం చారు. సీతంపేట ఐటీడీఏలో ఏపీఓ నాగోరావు గిరిజన దర్బార్ నిర్వహిస్తుండగా సమైక్యవాదులు అడ్డుకున్నారు. వీరఘట్టం మండలం తెట్టంగి, నవగాంలో ఉపాధ్యాయులు జనచైతన్య యాత్రలు నిర్వహించారు.
టెక్కలిలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు విన్యాసాలను ప్రదర్శించారు. లింగాలవలస ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఆమదాలవలసలో జేఏసీ, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. మున్సిపల్ ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. చింతాడలో గ్రామస్తులు, రొట్టవలసలో విద్యార్థులు రోడ్డును దిగ్బంధించారు. పొందూరు, బూర్జ తదితర మండలాల్లో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి.
నరసన్నపేటలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల్లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలాకి మండలం డోల జంక్షన్ వద్ద ఉపాధ్యాయులు మానవహారం చేపట్టి రిలేదీక్షలో పాల్గొన్నారు, జలుమూరు, సారవకోటల్లో రిలే దీక్షలు కొనసాగాయి.
పలాసలో టీడీపీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ప్రెస్‌క్లబ్‌లు వేర్వేరుగా చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. మరదరాజపురంలో సమైక్యవాదులు జలదీక్ష చేపట్టారు. టెక్కలిపట్నం, వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటులో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. తప్పెటగుళ్ల ప్రదర్శనతో నిరసన తెలియజేశారు.
ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి మండలాల్లో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. పాతపట్నంలో ఉద్యోగులు మొక్కజొన్న పొత్తులు విక్రయించి నిరసన తెలిపారు.
ఎచ్చెర్లలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూని వర్సిటీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని దుకాణాలను మూయించారు.
Advertisement
Advertisement