ఢిల్లీ యాత్రలు అంతా ఉత్తుత్తి హడావిడే!
Published Thu, Aug 8 2013 2:32 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
రాష్ట్ర సమైక్యాన్ని కాపాడేందుకు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నామని గత కొంతకాలంగా కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు ఢిల్లీలో చేస్తున్న హడావుడి అంతా నాటకమేనని తెలుస్తోంది. విభజనపై సీమాంధ్రప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం నుంచి తప్పించుకొనేందుకే కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్న వాదన ప్రజల్లో నాటుకుపోయిన నేపథ్యంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.
ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలోకి పాల్గొంటుండటంతో పాటు కాంగ్రెస్ నేతలపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించేందుకు కూడా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వెనుకడుగు వేస్తున్నారు. రాష్ట్ర సమైక్యంగా ఉంచేందుకు అధిష్టానాన్ని ఒప్పించడానికి తామేదో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకోవడానికి అటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను, అధినేత్రి సోనియాగాంధీని వరుసపెట్టి కలుసుకోవడమే కాకుండా ఢిల్లీలో ప్రత్యేక భేటీలు నిర్వహించడం వంటివన్నీ ఉత్తుత్తి హడావిడేనని ఢిల్లీ వెళ్లొచ్చిన నేతలు చెబుతున్నారు.
‘నిజానికి నిర్ణయం జరిగిపోయింది... ఇప్పుడు హైకమాండ్ ముందు మేం చేసేదేమీ లేదు.. మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజల్లో చెప్పుకోవడానికి నాయకులంతా తాపత్రయపడుతున్నారు’ అని ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఒక ఎంపీ వివరించారు. ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ కూడా రాష్ట్ర నాయకులు కోరితే వేసిందే తప్ప ఆ కమిటీ ద్వారా అధిష్టానం నిర్ణయాన్ని మార్చే అవకాశం లేదని, ఆ విషయం కూడా నాయకులందరికీ తెలుసని ఆయన చెప్పారు. ఢిల్లీలో మంగళవారం సోనియాగాంధీతో భేటీ అయిన రాయలసీమ నేతలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులు బుధవారం నగరానికి చేరుకున్నారు.
వాస్తవానికి అయిదు పదినిముషాలకు మించి ఎవరికీ సమయం ఇవ్వని సోనియా గాంధీ తమతో దాదాపు 25 నిముషాల సేపు మాట్లాడారని వారు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకొని రాయల తెలంగాణ అంశం గురించి నేతలు ప్రస్తావించగా సోనియా నుంచి ఒకింత సానుకూలత వచ్చినట్లు చెబుతున్నారు. ఏమైనా ఉంటే కమిటీ ముందు చెప్పాలని, దీని తరువాత మంత్రుల కమిటీ కూడా ఉంటుంది కనుక అక్కడ కూడా ఈ అంశాలను లేవనెత్తితే పరిశీలిస్తారని సూచించినట్లు తెలిసింది.
Advertisement
Advertisement