సీమాంధ్ర ఉద్యమ ప్రభంజనం
చేయి... చేయి కలిపి జన తరంగం ఉవ్వెత్తున ఎగసింది...
గొంతు గొంతు కలిసి ప్రళయ గర్జన ప్రతిధ్వనించింది...
చినుకు...చినుకు ప్రభంజనమై... సీమాంధ్ర అట్టుడుకుతోంది
విభజన ఊసే భరించలేని జనం వీధికెక్కి ఉద్యమిస్తున్నారు
సాక్షి నెట్‌వర్క్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనలా సాగుతోంది. నిన్నమొన్నటి వరకు ఎక్కువగా రాజకీయపక్షాలు, యువత నుంచే వ్యక్తమైన నిరసనలు ఇప్పుడు అన్నివర్గాల ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని శాఖల ఉద్యోగులు వేర్పాటుకు నిరసనగా ఉద్యమబాట పట్టారు. వరుసగా ఏడవ రోజైన మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయూలు మూతపడ్డాయి. ఆర్టీసీ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన పెన్‌డౌన్ రెండోరోజుకు చేరుకుంది. రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలతో అన్నిచోట్లా నిరసనజ్వాలలు మిన్నంటాయి. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై జనాగ్రహం కొనసాగుతోంది.
సోనియాగాంధీ, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, చిరంజీవిల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు అన్నిచోట్లా హోరెత్తాయి. మంత్రి పార్ధసారథీ ఇవిగో గాజులు ...వీటిని వేసుకొని ఇంట్లో కూర్చో అంటూ మహిళా ఉద్యోగులు విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఏలూరు మోతేవారి తోటలోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క్యాంప్ కార్యాలయూన్ని ఎన్జీవోలు ముట్టడించారు. నెల్లూరు నగరంలో నిరసనకారులు మూడు గాడిదలకు సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ బొమ్మలను కట్టి ఊరేగించారు. విజయనగరం జిల్లా కురుపాంలో కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ఇంటిని 30 మంది హిజ్రాలు ముట్టడించారు. విజయనగరంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటిని ఎన్జీవోలు ముట్టడించారు.
పోటెత్తిన పురోహితుల నిరసనలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వసంతమహల్ సెంటర్‌లో అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో చండీయాగం, పాలకొల్లులో రోడ్డుపై పురోహితులు హోమం నిర్వహించారు. తణుకు నరేంద్ర సెంటర్‌లో బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో శాంతి హామం నిర్వహించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విభజన ప్రక్రియ నిలిచిపోవాలని ఆకాంక్షించారు. రాజమండ్రిలో పురోహితులు, బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పుష్కరాల రేవు వద్ద శాంతిహోమం, గణపతి హోమం, మహిళా శక్తి సంఘాల సభ్యులు ర్యాలీ నిర్వహించారు.
బ్రాహ్మణసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు, శంకర్‌విలాస్ సెంటర్‌లో శాంతి హోమం చేశారు. హైదరాబాద్ నుంచి విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయులు బహిష్కరించారు. ఏలూరులో మెకానిక్‌లు, స్వర్ణకారులు ర్యాలీలు చేపట్టారు. నాగవంశం సంక్షేమ సంఘం, అర్చకుల సమాఖ్యల ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు అందాల రాకాసి చిత్రం షూటింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. కొవ్వూరులో సినీన టుడు మాగంటి మురళీ మోహన్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. నెల్లూరు నగరంలో వైఎస్సార్‌సీపీ నేతలు పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంతో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డుపై ట్రాక్టర్లు నిలిపి రాస్తారోకో నిర్వహించారు.
‘తూర్పు’ న స్తంభించిన వర్తక వాణిజ్యాలు
రాజమండ్రి, కాకినాడల్లో సుమారు రూ.55 నుంచి రూ.65 కోట్ల మేర బ్యాంకింగ్, వర్తక లావాదేవీలు స్తంభించాయి. 300పైగా ఏటీఎంలు, 100కు పైగా బ్యాంకు శాఖలు గత వారం రోజులుగా పనిచేయడం లేదు. అనంతపురం జిల్లా జేఎన్‌టీయూ(ఏ)లో పీజీ సెట్‌ను సమైక్యవాదులు అడ్డుకోవడంతో సెట్‌ను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం రైల్వేస్టేషన్‌లో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్నారు. పెద్దపప్పూరు మండలం అమళ్లదిన్నెకు చెందిన వ్యవసాయ కూలీ కుళ్లాయప్ప తాడిపత్రిలోని దీక్షా శిబిరానికి వచ్చి.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తాడిపత్రిలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో 11వ తేదీ వరకు స్వచ్చందంగా పాఠశాలల బంద్ చేపట్టాలని యాజమాన్యాలు నిర్ణయించాయి.
బెజవాడలో మరోవారం విద్యాసంస్థలు బంద్
విజయవాడలో మరో వారంరోజులపాటు కళాశాలలకు సెలవు ప్రకటించారు. కార్పొరేషన్ ఉద్యోగులు తమ 72 గంటల ఆందోళనలో భాగంగా రెండోరోజు కూడా విధులను బహిష్కరించారు. కేసీఆర్ ఇంట్లో బట్టలు ఉతకరాదని రజకులు బెజవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో పిలుపునిచ్చారు.
ఆర్టీసీ బస్సులకు నిప్పు
తిరుపతి, చిత్తూరులో ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టారు. మరో నాలుగు ప్రైవేటు బస్సులను ధ్వంసం చేశారు. మదనపల్లె మల్లికార్జున కూడలిలో నారాయణ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆరోగ్యం క్షీణించటంతో పోలీసులు ఆమరణ నిరాహారదీక్షను భగ్నం చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు.
పరకాల ప్రభాకర్ మంగళవారం తిరుపతి నుంచి బస్సుయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనూ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ రహదారిపై రెండుగంటల పాటు రాస్తారోకో చేపట్టారు. రిటైర్డ్ డీజీపీ హెచ్.జె.దొర కారును అడ్డుకున్నారు. పలాసలో తహశీల్దార్ కార్యాలయానికి సమైక్యవాదులు తాళం వేశారు.
కర్నూలులో జాతీయ రహదారుల దిగ్బంధం
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులో నంద్యాల-చెన్నై, బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారులను ఉద్యమకారులు దిగ్బంధించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పదివేల మందికి పైగా సమైక్యవాదులు జాతీయ రహదారిపై నినదించారు. దీంతో కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి.
12న విశాఖలో సింహగర్జన.. 18న బీచ్‌రోడ్డులో మిలియన్ మార్చ్
విభజనయత్నాలను నిరసిస్తూ ఈనెల 12న విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో లక్ష మందితో సింహగర్జన పేరిట భారీబహిరంగసభ నిర్వహించనున్నట్టు ఏయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ లగుడు గోవింద్ ప్రకటించారు. అదేవిధంగా 18న బీచ్‌రోడ్డులో లక్షమందితో మిలియన్ మార్చ్ కూడా నిర్వహిస్తామని ఆయన మంగళవారం విశాఖనగరంలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
వెంకన్నకూ ‘వేర్పాటు’ ఎఫెక్ట్
తిరుమల వెలవెల.. ఐదుగంటల్లోనే శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల : సీమాంధ్ర బంద్ ప్రభావంతో మంగళవారం తిరుమల కొండ ఖాళీ అయింది. కేవలం ఐదుగంటల్లోనే శ్రీవారి దర్శనం కలుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 5 గంటల్లోనే దర్శనం లభిస్తోంది. రూ.300 ప్రత్యేక దర్శనం కూడా గంటన్నరలోపే లభిస్తోంది. రద్దీ సాధారణ స్థాయి కంటే తగ్గడంతో ఆలయంలో లఘు దర్శనంలో (రాములవారి మేడ నుంచి) దగ్గరగా గర్భాలయ మూలమూర్తిని దర్శించుకునే అవకాశం కలిగింది. శ్రీవారి భక్తుల కోసం కేవలం తిరుమల, తిరుపతి మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. తిరుమల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు రద్దు చేశారు.
ఆర్టీపీపీలో ఆగిన నిర్మాణ పనులు
సాక్షి, ఎర్రగుంట్ల: సమ్య్యైంధ్ర ఉద్యమ ప్రభావం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ వపర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)పై పడింది. మం గళవారం జేఏసీ నాయకులు ఆరో యూనిట్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. 600 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో కాంట్రాక్టర్లు, కార్మికులు పనులు నిలిపివేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని మద్దతు ప్రకటించారు.
ఎక్కడి ఓడలు అక్కడే , కాకినాడ పోర్టులకు సమైక్య సెగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సమైక్యాంధ్ర సెగ కాకినాడలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో నడుస్తోన్న రెండు ఓడరేవులకు తాకింది. సమైక్యాంధ్ర ఉద్యమ లక్ష్యాన్ని ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రెండు పోర్టులను స్తంభింపచేయడంతో మంగళవారం కార్యకలాపాలు నిలిచిపోయాయి. యాంకరేజ్, డీప్ వాటర్ పోర్టుల నుంచి బియ్యం, సిమెంట్, మొక్కజొన్న, గ్రానైట్, బొగ్గు, ఎరువుల ఎగుమతి దిగుమతులు నిలిచిపోయాయి. సుమారు రూ.10 కోట్ల విలువైన లావాదేవీలు స్తంభించాయి. రెండు పోర్టులపై ప్రత్యక్షంగా లేదా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు 15 వేల మంది కార్మికులు విధులకు హాజరుకాలేదు. సముద్రంలో 26 నౌకలు నిలిచిపోయాయి. ఇండోనేషియా, ఆఫ్రికా, సోమాలియీ, వియత్నాం తదితర విదేశాలకు జరగాల్సిన ఎగుమతులు నిలిచిపోయాయి. రేవు ఆధారంగా పనిచేసే దాదాపు రెండువేలకు పైగా లారీల యజమానులు వాహనాలు నిలిపివేసి ఉద్యమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ బంద్‌కు సంఘీభావం తెలిపారు.
పామాయిల్ సరఫరా బంద్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పేదల తిండి అవసరాలను తీర్చే ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు సమైక్య ఉద్యమ సెగ తగిలింది. విదేశాల నుంచి సముద్ర మార్గంలో కాకినాడకు వచ్చే పామాయిల్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల సంస్థ గోదాములకు చేరవేయాల్సి ఉంటుంది. సీమాంధ్ర ప్రాంతంలో నడుస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమంతో రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి నుంచి ఇతర జిల్లాలకు పామాయిల్ సరఫరా కావడంలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆగస్టు నెలలో తెలంగాణ ప్రాంతంలోపాటు సీమాంధ్ర జిలాల్లోనూ రేషన్‌కార్డు దారులకు పామాయిల్ సరఫరా చేయలేమని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
ముక్కలైన గుండెలు
విభజనపై మనస్తాపంతో ఏడుగురి మృతి
సాక్షి నెట్‌వర్క్: సీమాంధ్రలో మృత్యుఘోష ఆగడం లేదు. రాష్ట్రం ముక్కలవుతుందని వార్తల నేపథ్యంలో మంగళవారం ఏడుగురు వ్యక్తులు గుండెపోటుతో మరణించారు. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామానికి చెందిన యుగంధర్ (55) సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. మంగళవారం గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఉద్యమంలో పాల్గొన్న అతను గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలొదిలాడు. విశాఖపట్నం జిల్లా మధురవాడ సమీపంలోని బక్కన్నపాలెంకు చెందిన తాతబ్బాయి (62) రాష్ర్ట విభజన ప్రకటనపై తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందాడు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన వర్ధనమ్మ (73) విభజన వార్తలపై తీవ్ర మనోవేదనకు గురై సోమవారం రాత్రి కూర్చున్నచోటే కుప్పకూలిపోయి ప్రాణాలొదిలింది. కర్నూలు జిల్లా కొలిమిగండ్ల మండలం కల్వటాలకు చెందిన పోస లక్ష్మీనారాయణరెడ్డి(46), ప్యాపిలి మండలం పీఆర్ పల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి(55), కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం యాదరాల్ల గ్రామానికి చెందిన గొల్లనారాయణ(55), వెల్దుర్తి పట్టణంలోని ముల్లవీధిలో మహబూబ్‌బాషా(50) రెండు రోజులుగా టీవీలో విభజన వార్తలు చూస్తూ తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించారు.
కేసీఆర్‌పై కేసు
వేర్పాటువాదాన్ని రెచ్చగొడుతున్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై న్యాయవాదులు గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టటడం.. కుట్రతో కూడిన ప్రకటనలు చేస్తున్నందుకు ఆయనపై ఐపీసీ 153ఎ, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.