ధర్మాన సహా ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా
సీఎంకు లేఖల సమర్పణ
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ రాజీనామా పత్రాలను ఆయనకు అందజేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామా చేశామని స్పష్టంచేశారు. తాము కూడా ప్రజల వెంటే నడుస్తామని ప్రకటించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని, అలా కాని పక్షంలో తమ రాజీనామా పత్రాలను శాసనసభాపతికి పంపించాలని వారు సీఎంను కోరారు.
దర్మానతో పాటు జుట్టు జగన్నాయకులు, కొర్ల భారతి, మీసాల నీలకంఠంనాయుడు, బొడ్డేపల్లి సత్యవతి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ విశ్వప్రసాద్ కూడా మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ధర్మాన తదితరులు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్ష మేరకు నడచుకుంటామని ముఖ్యమంత్రికి స్పష్టం చేశామన్నారు. రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలపై సీఎం కిరణ్ లేవనెత్తిన సందేహాలు వాస్తవమేనని, ఆయన వాదనను తాము సమర్థిస్తున్నామని చెప్పారు. విభజన అంశంపై అసెంబ్లీలో కానీ లేదా ఏ వేదికపైనైనా చర్చ జరిగితే సమైక్యాంధ్రప్రదేశ్ వాదనను గట్టిగా వినిపిస్తామని చెప్పారు.