రాష్ట్రపతి పాలన విధించైనా తెలంగాణ
కిరణ్ మొండికేస్తే సీఎంని మార్చి అయినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు
టీజేఎఫ్ మీట్ ది ప్రెస్‌లో ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్
‘ప్లాన్ బీ’ని సిద్ధం చేసిన కేంద్ర హోంశాఖ
తెలంగాణ వారిపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు
అక్రమాస్తులు కాపాడుకునేందుకే సమైక్యవాదం
ఉద్యోగులకు, ఉద్యమకారులకు డబ్బులిచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ధిక్కరిస్తే ఆయనను మార్చైనా సరే, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఖాయమని లోక్‌సభలో డిప్యుటీ చీఫ్ విప్ మధుయాష్కీగౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘ప్లాన్ బీ’ని సిద్ధం చేసిందని వారు వివరించారు. కిరణ్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, జగన్ తెలంగాణను అడ్డుకోవడానికి తెరవెనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది సమైక్య ఉద్యమం కాదని, కొంతమంది అగ్రవర్ణాల వారి అధికార దాహంతో సాగుతున్నదని ఆరోపించారు. బుధవారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువరించిన 70 గంటల వరకు సీమాంధ్రలో ఉద్యమమే లేదని, ఆ తర్వాత కూడా అంతంత మాత్రంగానే సాగినా చివరకు సీఎం కిరణ్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి ఉద్యమకారులను రెచ్చగొట్టారని ఆరోపించారు.
తన తండ్రి అమర్‌నాథ్ రెడ్డి విగ్రహాలను కూల్చకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయించిన ముఖ్యమంత్రి.. రాజీవ్‌గాంధీ, ఇందిరల విగ్రహాలను కూల్చేస్తున్నా మౌనం వహించారని మండిపడ్డారు. సమైక్య ఉద్యమంలో హింస రేగుతున్నా కేసులు కూడా నమోదు చేయలేని దుస్థితిలో సీమాంధ్రలో పోలీసు శాఖ ఉందని, హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం కిరణ్, డీజీపీలు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల అధికారిని డీజీపీగా నియమించడంతోపాటు నాయకత్వ మార్పుపైనా పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు ప్రస్తుత లోక్‌సభ సమావేశాల్లో కాకపోయినా వచ్చే సమావేశాల్లో తప్పనిసరిగా వస్తుందని తెలిపారు. సమైక్య ఉద్యమంలో హైదరాబాద్ గురించే తప్ప మరో అంశమే లేదంటే అది కేవలం కొందరు పెట్టుబడిదారులు చేయిస్తున్నదేననే విషయం స్పష్టమవుతోందని చెప్పారు. టీడీపీ, బీజేపీ తెరవెనుక చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్నాయని, త్వరలోనే అవి రెండూ కలిసికట్టుగా తిరిగే పరిస్థితి కూడా ఉందన్నారు. సీమాంధ్రలో తెలంగాణ వారిపై దాడులు సరికాదని, ఇలాంటి దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తమ సహనాన్ని అసమర్థతగా భావించరాదని హెచ్చరించారు.
ఉద్యోగ సంఘాల నేతలకు, ఉద్యమకారులకు డబ్బులు ఇచ్చి సమ్మెలు, ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం ఆరా తీయిస్తోందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం నచ్చని కాంగ్రెస్ నేతలు పార్టీ నుంచి బయటకు పోవచ్చని ప్రభాకర్ పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం ఆంటోనీ కమిటీకి లే దని, సీమాంధ్రుల అపోహలు తీర్చడానికే ఆ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. రేణుకా చౌదరి సీమాంధ్రనేతేనని, ఆమెను తమ సమావేశాలకు పిలవడంపై అభ్యంతరం చెప్పి మరీ ఆపించామని చెప్పారు. తెలంగాణపై ప్రకటనే వచ్చిందని, ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రమాదం అంచులు దాటినట్లు కాదన్నారు. తెలంగాణ వచ్చాక రెండు ప్రాంతాల్లోనూ బడుగు బలహీన వర్గాల వారిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తామని, తాము మాత్రం రేసులో లేమని వివరించారు. ఈ సమావేశంలో టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ, నేతలు క్రాంతికుమార్, పీవీ శ్రీనివాస్, పల్లె రవికుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.