చిత్తూరు జిల్లాలో పీజీ విద్యార్థి ఆత్మహత్య
గుండెపోటుతో ఆరుగురి మృతి
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రాన్ని విభజిస్తారనే భయంతో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం సమైక్యాంధ్ర కోరుతూ చిత్తూరు జిల్లాలో పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ఆత్మహత్యాయత్నం చేశారు. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం పెరిందేశం దళితవాడకు చెందిన జే.పోతురాజు (22) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పదిరోజులుగా స్వగ్రామంలో ఉండే సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట చిరునగర్‌కు చెందిన ఆటో ఎలక్ట్రిషియన్ గడ్డం రామారావు (58), పశ్చిమగోదావరి నరసాపురం మండలం చామకూరిపాలెంకు చెందిన చామకూరి కోటేశ్వరరావు (40), మొగల్తూరు మండలం కాటంవారితోటకు చెందిన కాటం పండుబాబు (48), కొయ్యలగూడెం మండలం పరింపూడి గ్రామానికి చెందిన చౌటుపల్లి నాగేశ్వరరావు(54), కొవ్వూరులోని మూడు డాబాల వీధిలో నివాసం ఉంటున్న తెలుగు ఉపాధ్యాయుడు గండికోట వెంకట గౌరీ శంకర్ (52), నిడదవోలు మండలం కోరుమామిడి వెంకటేశ్వరరావు(42) రాష్ర్టం విడిపోతుందేమోనని మనస్తాపంతో గుండెపోటుకు గురై మృతిచెందారు.
విభ‘జనాందోళన’ చూస్తూ హఠాన్మరణం
కొడుకు మృతి వార్త విని ఆగిన తండ్రి గుండె
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జరుగుతున్న ఆందోళనలను టీవీలో వీక్షిస్తూ విజయవాడ భవానీపురం కరకట్ట సమీపంలో నివసించే జాలా సురేష్ (39) హఠాన్మరణం చెందాడు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే ఈయన ఆదివారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ నిర్వహించిన ర్యాలీలో చురుకుగా పాల్గొన్నాడు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సోమవారం నాటి ఆందోళన కార్యక్రమాలపై చర్చించేందుకు ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ టీవీలో వార్తలను చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఈ వార్త తెలిసిన వెంటనే సురేష్ తండ్రి జాలా వెంకటేశ్వరరావు అలియాస్ ఏసోబు (70) అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
విభజన భయంతో.. ఆగని మరణాలు
Published Mon, Aug 12 2013 12:50 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement