మొయినాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రులు అడ్డుకుంటున్నారనే మనస్తాపంతో ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం మండలంలోని కనకమామిడిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్టె మిషన్ రాజు(25) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రాజుకు భార్య మంజుల, కొడుకు, కూతురు ఉన్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్నాడు.
హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించిన సమైక్య సభ దృశ్యాలను టీవీలో చూశాడు. వారు తెలంగాణను అడ్డుకోవడం కోసం చేస్తున్న వ్యాఖ్యలు విని మనస్తాపానికి గురయ్యాడు. ఇంటి నుంచి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి గడ్డి మందు తాగాడు. అతను వెళ్లిన కొద్ది సమయానికి భార్య మంజుల భోజనం తీసుకుని వ్యవసాయ పొలానికి వెళ్లింది. అప్పటికే గడ్డిమందు తాగి నురగులు కక్కుతున్న భర్త రాజును చూసి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించింది. గ్రామస్తులు రాజును స్థానికంగా ఉన్న భాస్కర ఆస్పత్రికి తరలించారు. తాగిన మందును కక్కించడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజును పరామర్శించిన టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు
తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్నారనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజును టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. వీరిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యువత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి కేబుల్‌రాజు, మండల అధ్యక్షుడు రమేష్, గణేష్ తదితరులున్నారు
తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్నార ని.. యువకుడి ఆత్మహత్యాయత్నం
Published Sun, Sep 8 2013 6:12 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement