సాక్షి నెట్‌వర్క్: హోరువానలోనూ సమైక్యాంధ్రకోసం ఉద్యమ జోరు తగ్గడం లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉద్యమిస్తామంటూ సీమాంధ్రులు నిరూపిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం 72వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించగా, కనిగిరిలో ర్యాలీ తీశారు. నెల్లూరులో ఎన్‌జీఓ నేతలు కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష భగ్నానికి నిరసనగా కడపలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కడపలోని పారా మెడికల్, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో 650 మంది ఆర్టీసీ కార్మికులకు రూ. 6లక్షల విలువైన నూనె, బియ్యం, కందిబేడలను పంపిణీ చేశారు.
రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దాతలు 350 బస్తాల బియ్యాన్ని ఆర్టీసీ కార్మికులకు అందజేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలను వివరిస్తూ లఘు నాటిక ప్రదర్శించారు. విశాఖ జిల్లా పాతగాజువాకలో ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య దీక్షకు దిగగా, న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం వైఎస్సార్ కూడలిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డిని అక్కడి ఉద్యోగ జేఏసీ నేతలు గురువారం కలిసి సమైక్యానికి సహకరించమంటూ కాళ్లుపట్టుకుని కోరారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) నుంచి గురువారం అనంతపురం వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సమైక్య సభలో అసువులు బాసిన వీఆర్వో
భీమవరం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గురువారం నిర్వహించిన గోదావరి గర్జన సభలో వీఆర్వో అసువులు బాశారు. భీమవరం మండలం రాయలం వీఆర్వో వేగేశ్న ప్రసాదరాజు (57) గురువారం వేకువజాము నుంచి గర్జన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వేదిక వద్దే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. సహోద్యోగులు ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రసాదరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి అశోక్‌బాబు సంతాపం తెలిపారు.
సమైక్య హోరు వానలోనూ అదేజోరు..
Published Fri, Oct 11 2013 1:30 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement