సాక్షి, నెట్‌వర్క్ : సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ జేఏసీ 72 గంటల సమ్మె పిలుపుతో సీమాంధ్రలోని పలు జిల్లాల్లో అంధకారం నెలకొంది. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం అర్ధరాత్రి నుంచే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వర్షంతో మోటార్లు నీటమునిగి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన కర్నూలు జిల్లాలోని ఆర్టీపీపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో మరమ్మతు పనులు జరగలేదు. దీంతో గురువారం కూడా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 1490 మంది ఉద్యోగుల్లో 90 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు.
వారిలో కూడా సీఈ, ఎస్‌ఈ అధికారులే అధికంగా ఉన్నారు. విధులకు హాజరవుతున్న ఉద్యోగులను జేఏసీ నాయకులు గేట్ బయటనే అడ్డుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కనిపించలేదు. గురువారం మధ్యాహ్నం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేందుకు కొందరు ఉద్యోగులు విఫలయత్నం చేశారు. కరెంట్ ఉత్పాదనకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను పవర్‌హౌస్ వద్ద నియమించడంతో ప్రభావం అంతగా కన్పించలేదు. విజయవాడ ఎన్టీటీపీఎస్‌లో ఎక్కువమంది సమ్మెలోకి వెళ్లడంతో విద్యుత్ ఉత్పాదనపై ప్రభావం చూపింది. గురువారం ఉదయం 6 గంటలకే థర్మల్ కేంద్రం మూడు గేట్లను మూసేశారు. విద్యుత్ జేఏసీ నాయకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం డిస్కమ్ జేఏసీ చైర్మన్ అశోక్, కన్వీనర్ డీఈ మునిశంకరయ్య ఆధ్వర్యంలో తిరుపతిలోని డిస్కమ్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 72 గంటల సమ్మెలో భాగంగా జిల్లాలోని డిస్కమ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిశ్రమలలో ఉత్పత్తి నిలిచిపోయింది.
ఎన్టీటీపీఎస్ జేఏసీలో చీలిక!
ఎన్టీటీపీఎస్‌లో 72 గంటలపాటు సమ్మెలోకి దిగిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. గురువాం రాత్రి కొందరు ఉద్యోగులు డ్యూటీకి హాజరయ్యారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు వారితో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో గేట్ల వద్ద పోలీసు బలగాను, ఎన్టీటీపీఎస్ భద్రతా సిబ్బందిని నియమించి లోపలకు వచ్చే ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. జేఏసీలో ఎలాంటి చీలిక రాలేదని జెన్‌కో జేఏసీ చైర్మన్
టి. శ్యాంసుధాకర్ స్పష్టంచేశారు.
విద్యుత్ సమ్మె షాక్
Published Fri, Sep 13 2013 4:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement