power JAC strike
-
చర్చలు మళ్లీ విఫలం.. రోజువారీ సమీక్షల బహిష్కరణకు పిలుపు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ, ఇతర డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీలతో, విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీ‹శ్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. 6శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు క్రితం సారి జరిగిన చర్చల్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ప్రతిపాదించగా, ఉభయ జేఏసీలు తిరస్కరించాయి. మరోశాతం పెంచి 7శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, దీనికి అంగీకరించి 17 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని తాజాగా జరిపిన చర్చల్లో విద్యుత్‌శాఖ మంత్రి ప్రతిపాదించగా, ఇందుకూ జేఏసీలు తిరస్కరించాయి. దీంతో విద్యుత్ జేఏసీలతో ఏడో దఫా చర్చలు సైతం విఫలమయ్యాయి. 17నుంచి సమ్మె పిలుపులో మార్పు లేదు: గతంలో జరిగిన చర్చల్లో 30శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకి పట్టుబట్టామని, తాజాగా కనీసం 25శాతం ఫిట్‌మెంట్‌తోనైనా అమలు చేయాలని కోరామని పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు సాయిబాబు వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా ఈ నెల 17 నుంచి సమ్మె ప్రారంభిస్తామని, ఈ విషయంలో ఎలాంటి మార్పులేదని ప్రకటించారు. సోమవారం నుంచి జిల్లాల్లో సమ్మె సన్నాహక సమావేశాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో రోజువారీగా నిర్వహించే సమీక్ష సమావేశాలను సోమవారం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చర్చల్లో యాజమాన్యాల తరఫున ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు పి.రత్నాకర్ రావు, శ్రీధర్, బీసీ రెడ్డి పాల్గొన్నారు. -
విద్యుత్ సమ్మె షాక్
సాక్షి, నెట్వర్క్ : సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ జేఏసీ 72 గంటల సమ్మె పిలుపుతో సీమాంధ్రలోని పలు జిల్లాల్లో అంధకారం నెలకొంది. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం అర్ధరాత్రి నుంచే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వర్షంతో మోటార్లు నీటమునిగి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన కర్నూలు జిల్లాలోని ఆర్టీపీపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో మరమ్మతు పనులు జరగలేదు. దీంతో గురువారం కూడా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 1490 మంది ఉద్యోగుల్లో 90 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. వారిలో కూడా సీఈ, ఎస్ఈ అధికారులే అధికంగా ఉన్నారు. విధులకు హాజరవుతున్న ఉద్యోగులను జేఏసీ నాయకులు గేట్ బయటనే అడ్డుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కనిపించలేదు. గురువారం మధ్యాహ్నం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేందుకు కొందరు ఉద్యోగులు విఫలయత్నం చేశారు. కరెంట్ ఉత్పాదనకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను పవర్‌హౌస్ వద్ద నియమించడంతో ప్రభావం అంతగా కన్పించలేదు. విజయవాడ ఎన్టీటీపీఎస్లో ఎక్కువమంది సమ్మెలోకి వెళ్లడంతో విద్యుత్ ఉత్పాదనపై ప్రభావం చూపింది. గురువారం ఉదయం 6 గంటలకే థర్మల్ కేంద్రం మూడు గేట్లను మూసేశారు. విద్యుత్ జేఏసీ నాయకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం డిస్కమ్ జేఏసీ చైర్మన్ అశోక్, కన్వీనర్ డీఈ మునిశంకరయ్య ఆధ్వర్యంలో తిరుపతిలోని డిస్కమ్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 72 గంటల సమ్మెలో భాగంగా జిల్లాలోని డిస్కమ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిశ్రమలలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్టీటీపీఎస్ జేఏసీలో చీలిక! ఎన్టీటీపీఎస్లో 72 గంటలపాటు సమ్మెలోకి దిగిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. గురువాం రాత్రి కొందరు ఉద్యోగులు డ్యూటీకి హాజరయ్యారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు వారితో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో గేట్ల వద్ద పోలీసు బలగాను, ఎన్టీటీపీఎస్ భద్రతా సిబ్బందిని నియమించి లోపలకు వచ్చే ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. జేఏసీలో ఎలాంటి చీలిక రాలేదని జెన్కో జేఏసీ చైర్మన్ టి. శ్యాంసుధాకర్ స్పష్టంచేశారు.