అడుగడుగునా అడ్డగింత
సాక్షి నెట్‌వర్క్ : సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. సంఘీభావం పేరుతో దీక్షా శిబిరాల వద్దకు వచ్చిన నేతలను ఉద్యమకారులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాజకీయాలు చేయొద్దు..రాజీనామాలు చేసి రండి అంటూ ఘెరావ్ చేశారు. కొద్దిమంది నాయకులు చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరగగా.. మరికొందరు మాత్రం ఉద్యోగులను మీరూ రాజీనామా చేయండి మేం చేస్తామంటూ ప్రగల్బాలు పలికారు. దీంతో మరింత కోపోద్రిక్తులైన ఆందోళనకారులు వారిని అక్కడి నుంచి తరిమికొట్టేంత పనిచేశారు.
లగడపాటితో లడాయి..
సమైక్యాంధ్ర పేరుతో చీటికిమాటికీ మీడియా సమావేశాలు పెడుతూ తానే మొదటి సమైక్య చాంపియన్ అని గొప్పలు చెప్పుకునే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ఉద్యమకారుల నుంచి లడాయి తప్పలేదు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలిపేందుకు శనివారం యూనివర్సిటీకి వచ్చిన ఆయన్ను సమైక్యాంధ్ర విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నాయకులు యూనివర్సిటీ గేట్ వద్దే అడ్డుకున్నారు. లగడపాటి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన విద్యార్థులకు ఎంతగా నచ్చజెప్పాలని చూసినా వారు విన్పించుకోలేదు.
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మీకు ముందే తెలుసుకదా.. ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరాహారదీక్షా శిబిరం వద్దా అదే పరిస్థితి ఎదురైంది. లగడపాటి వెళ్లిపోవాలని కొందరు విద్యార్థులు దీక్షా శిబిరం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక చేసేది లేక ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగారు. తాము మనసు చంపుకుని ఆ పార్టీలో ఉంటున్నామంటూ చెప్పుకొచ్చారు.
ఉద్యమకారుల ‘విశ్వరూప’ం
తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లిలో రిలేదీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రాష్ర్టమంత్రి పినిపే విశ్వరూప్‌ను సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనుయాయులకు, సమైక్యవాదులకు మధ్య తోపులాట జరిగింది. పి.గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవిని మామిడికుదురు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఘెరావ్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటారు’ అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ చేసి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమ్మెల్యేను రెండుసార్లు అడ్డుకున్న జేఏసీ ప్రతినిధులు ‘ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే రాజీనామా’ చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దానిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జీవీఎంసీ నుంచి సౌత్‌జైలు రోడ్డు వద్దకు చేరుకున్న ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సమైక్య ర్యాలీకి అదే మార్గంలో వెళుతున్న రాజ్యసభ సభ్యుడు మద్దతు తెలిపేందుకు కారు దిగారు. దీంతో కొంతమంది యువకులు ఆయనను అడ్డుకున్నారు. రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, డోన్ ఎమ్మెల్యే కేఈ కష్ణమూర్తిని జేఏసీ నాయకులు అడ్డుకున్నారు.
సమైక్యవాదులతో జే‘ఢీ’
గుంటూరు జిల్లా తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు హాజరైన కేంద్రమంత్రి జేడీ శీలంను సమైక్యవాదులు అడ్డుకున్నారు. పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఆయన మంత్రుల రాజీనామా కోరే అధికారులెందుకు రాజీనామా చేయడం లేదని ఎదురు ప్రశ్నించడంతో వాదులాట జరిగింది. కేబినెట్‌లో ఉండి సమైక్యవాదుల ప్రతినిధిగా ఆందోళనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని చెప్పినా సంతప్తి చెందని సమైక్యవాదులు ఆయనను ఘెరావ్ చేశారు.