సర్టిఫికెట్ల తనిఖీకి పెరిగిన హాజరు
నేటి నుంచి విశాఖపట్నంలో కొత్త కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా నడుస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నాలుగో రోజు విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరిగింది. సీమాంధ్ర జిల్లాల్లో ఉద్య మం కారణంగా 37 కేంద్రాలకుగానూ 20 కేంద్రాల్లో సర్టిఫికెట్ తనిఖీ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే 17 కేంద్రాల్లో మాత్రం ఈ ప్రక్రియ సజావుగానే సాగుతోంది. ఈ 17 కేంద్రాల్లో గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 4,791 మంది విద్యార్థులు హాజరుకాగా.. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 4,702 మంది హాజరైనట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తెలిపారు. ఎంసెట్ సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియపై గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం. డోబ్రియాల్, సాంకేతిక విద్యా శాఖ సంయుక్త సంచాలకులు మూర్తి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం చైర్మన్ జయప్రకాశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఇప్పటివరకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కాలేదని చెప్పారు. శుక్రవారం నుంచి విశాఖలోని డాక్టర్ వి.ఎస్. కృష్ణ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభమవనుందని వెల్లడించారు. కాకినాడలో శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు.