(ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కాలేజీలకు గుర్తింపు ఆమోదించే ప్రక్రియను ఆలస్యం చేయడంతో ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడి నెలలు గడిచిపోతున్నా ఫార్మసీ కాలేజీలకు అనుమతులు ఆలస్యం కావడంతో ఆయా కాలేజీల్లోని సీట్ల భర్తీకి ఆటంకంగా మారింది. రెండు నెలలుగా విద్యార్థులు ప్రవేశాల కోసం నిరీక్షిస్తుండగా.. పీసీఐ అనుమతులు లేకపోవడంతో ఈఏపీ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా శాఖ ముందుకు వెళ్లలేకపోయాయి. దీనిపై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పలుమార్లు సంప్రదింపులు చేశారు.
గత నెలాఖరుకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేస్తామని.. అనంతరం కౌన్సెలింగ్ చేపట్టవచ్చని సూచించింది. గడువు దాటినా పూర్తి స్థాయిలో అనుమతులు ఇంకా రాలేదు. దీంతో ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా శాఖ ఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ను కేవలం ఇంజనీరింగ్ కోర్సులకే పరిమితం చేశాయి. మూడు విడతల్లో కౌన్సెలింగ్ చేపట్టి ఇంజనీరింగ్ కాలేజీలలోని 80 శాతం సీట్లు భర్తీ చేశారు.
ప్రత్యామ్నాయాల వైపు విద్యార్థుల చూపు
రాష్ట్రంలో బి.ఫార్మసీ కాలేజీలు 121 వరకు ఉన్నాయి. ఫార్మా–డి కోర్సులు నిర్వహించే కాలేజీలు 60 ఉన్నాయి. కన్వీనర్ కోటాలో బి.ఫార్మసీ కాలేజీలలో 4,386 సీట్లు, ఫార్మా–డిలో 682 సీట్లు ఉన్నాయి. సకాలంలో కౌన్సెలింగ్ చేపట్టిన రోజుల్లోనే ఈ కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యేవి కావు. పీసీఐ తీరు కారణంగా ఈసారి చాలా ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లిపోతున్నారని పలు కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వానికి నివేదిక
ఫార్మసీ కాలేజీలకు పీసీఐ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రాకపోవడంతో సాంకేతిక విద్యాశాఖ ఈ కోర్సు ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో కొన్నింటికి సరైన నిబంధనలు పాటించనందున పూర్తి సీట్లకు అనుమతివ్వలేదు. దీనిపై పలు కాలేజీలు పీసీఐని చాలెంజ్ చేశాయి. నిబంధనల ప్రకారం వసతులు, అధ్యాపకులు ఇతర అంశాలపై ఆధారాలు సమర్పణకు పీసీఐ కాలేజీలకు నెలాఖరు వరకు అవకాశం కల్పించింది.
ఈ తరుణంలో కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండటంతో అధికారులు పీసీఐని సంప్రదించగా.. కొన్ని షరతులతో సీట్ల భర్తీకి అనుమతించింది. గత ఏడాది ఇన్ టేక్ ప్రకారం కౌన్సెలింగ్ చేపట్టవచ్చని, అయితే అవి తమ చివరి అనుమతుల మేరకు కొనసాగుతాయని పీసీఐ పేర్కొందని అధికారులు ప్రభుత్వానికి వివరించారు. ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లేందుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం సాంకేతిక విద్యా శాఖ పేర్కొన్న మేరకు కాలేజీలకు ప్రభుత్వం అనుమతిస్తే ఒకటి రెండు రోజుల్లోనే కౌన్సెలింగ్ ను చేపట్టే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment