Pharmacy course
-
ఫార్మసీ అడ్మిషన్లపై సందిగ్ధం
సాక్షి, అమరావతి: ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కాలేజీలకు గుర్తింపు ఆమోదించే ప్రక్రియను ఆలస్యం చేయడంతో ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడి నెలలు గడిచిపోతున్నా ఫార్మసీ కాలేజీలకు అనుమతులు ఆలస్యం కావడంతో ఆయా కాలేజీల్లోని సీట్ల భర్తీకి ఆటంకంగా మారింది. రెండు నెలలుగా విద్యార్థులు ప్రవేశాల కోసం నిరీక్షిస్తుండగా.. పీసీఐ అనుమతులు లేకపోవడంతో ఈఏపీ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా శాఖ ముందుకు వెళ్లలేకపోయాయి. దీనిపై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పలుమార్లు సంప్రదింపులు చేశారు. గత నెలాఖరుకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేస్తామని.. అనంతరం కౌన్సెలింగ్ చేపట్టవచ్చని సూచించింది. గడువు దాటినా పూర్తి స్థాయిలో అనుమతులు ఇంకా రాలేదు. దీంతో ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా శాఖ ఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ను కేవలం ఇంజనీరింగ్ కోర్సులకే పరిమితం చేశాయి. మూడు విడతల్లో కౌన్సెలింగ్ చేపట్టి ఇంజనీరింగ్ కాలేజీలలోని 80 శాతం సీట్లు భర్తీ చేశారు. ప్రత్యామ్నాయాల వైపు విద్యార్థుల చూపు రాష్ట్రంలో బి.ఫార్మసీ కాలేజీలు 121 వరకు ఉన్నాయి. ఫార్మా–డి కోర్సులు నిర్వహించే కాలేజీలు 60 ఉన్నాయి. కన్వీనర్ కోటాలో బి.ఫార్మసీ కాలేజీలలో 4,386 సీట్లు, ఫార్మా–డిలో 682 సీట్లు ఉన్నాయి. సకాలంలో కౌన్సెలింగ్ చేపట్టిన రోజుల్లోనే ఈ కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యేవి కావు. పీసీఐ తీరు కారణంగా ఈసారి చాలా ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లిపోతున్నారని పలు కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వానికి నివేదిక ఫార్మసీ కాలేజీలకు పీసీఐ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రాకపోవడంతో సాంకేతిక విద్యాశాఖ ఈ కోర్సు ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో కొన్నింటికి సరైన నిబంధనలు పాటించనందున పూర్తి సీట్లకు అనుమతివ్వలేదు. దీనిపై పలు కాలేజీలు పీసీఐని చాలెంజ్ చేశాయి. నిబంధనల ప్రకారం వసతులు, అధ్యాపకులు ఇతర అంశాలపై ఆధారాలు సమర్పణకు పీసీఐ కాలేజీలకు నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. ఈ తరుణంలో కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండటంతో అధికారులు పీసీఐని సంప్రదించగా.. కొన్ని షరతులతో సీట్ల భర్తీకి అనుమతించింది. గత ఏడాది ఇన్ టేక్ ప్రకారం కౌన్సెలింగ్ చేపట్టవచ్చని, అయితే అవి తమ చివరి అనుమతుల మేరకు కొనసాగుతాయని పీసీఐ పేర్కొందని అధికారులు ప్రభుత్వానికి వివరించారు. ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లేందుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం సాంకేతిక విద్యా శాఖ పేర్కొన్న మేరకు కాలేజీలకు ప్రభుత్వం అనుమతిస్తే ఒకటి రెండు రోజుల్లోనే కౌన్సెలింగ్ ను చేపట్టే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ – 2020 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్య ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ శుక్రవారం బీఈ, బీటెక్, ఫార్మసీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు (ఎంపీసీ స్ట్రీమ్) ఈ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ ద్వారా ఈనెల 23 నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు. ► ఆన్లైన్ ఫీజు చెల్లించాక ప్రింటవుట్ తీసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో సాంకేతిక కారణాల వల్ల ఫెయిల్యూర్ అని వస్తే మరోసారి చెల్లించి ప్రింటవుట్ తీసుకోవాలి. తొలుత చెల్లించిన డబ్బులు వారి ఖాతాకు జమ అవుతాయి. ► ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అనంతరం ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్, లాగిన్ ఐడీ నంబర్ వివరాలు ఎస్సెమ్మెస్ ద్వారా అందుతాయి. ఇలా సమాచారం వస్తే సర్టిఫికెట్ల డేటా పరిశీలన పూర్తయినట్లు. అసమగ్రంగా ఉంటే హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయించాలనే సందేశం వస్తుంది. ► వెరిఫికేషన్ పూర్తయ్యాక లాగిన్ ఐడీ ద్వారా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని తదుపరి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ► ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలనకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేశారు. ► ఈనెల 23 నుంచి 27 వరకు ర్యాంకుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ► వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను తదుపరి ప్రకటిస్తారు. ► దివ్యాంగులు, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తారు. సీఏపీ (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్) అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లవచ్చు. -
ఎందుకిలా..?
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురంలో నూతనంగా ఫార్మసీ కళాశాలకు ప్రిన్సిపాల్‌ను నియమించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరగడంతో వివాదస్పదమవుతోంది. పాలక మండలి అనుమతి లేకుండానే ఏకంగా ప్రిన్సిపాల్‌ను నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిర్ణయాత్మకమైన పదవి కావడంతో నిబంధనలు అనుసరించకుండా భర్తీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. పొంతన లేని పీహెచ్డీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌కు తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ ఉండాలి. కానీ తాజాగా ఎంపిక చేసిన ప్రిన్సిపాల్‌కు బయోటెక్‌లో పీహెచ్డీ చేశారు. సాధారణంగా ఇంజినీరింగ్ , ఫార్మసీ అధ్యాపకులకే ఎంటెక్, ఎంఫార్మసీ కచ్చితంగా ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణులైనవారిని ఎంపిక చేస్తారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియామించే వ్యక్తికి కచ్చితంగా ఎంఫార్మసీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, పీహెచ్డీ ఫార్మసీ సబ్జెక్టు మీదే పూర్తీ చేసి ఉండాలి. కానీ ఎంఫార్మసీ రెండో శ్రేణిలో ఉత్తీర్ణులై, బయోటెక్‌లో పీహెచ్డీ పూర్తీ చేసిన వారిని ప్రిన్సిపాల్‌గా ఎంపిక చేశారు. ఏదైనా కీలక నియాయం చేసేటపుడు తప్పనిసరిగా పాలక మండలి అనుమతితోనే నియామక పత్రాన్ని అందచేయాలి. కనీసం పాలక మండలికి సమాచారం ఇవ్వకుండానే నేరుగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు. గడువు ముగియకుండానే పీహెచ్‌డీలు జేఎన్టీయూ (ఏ)లో నిబంధనలకు విరుద్ధంగా, అర్హత లేని వారిని ప్రిన్సిపాల్‌గా నియమించారు. మరోవైపు పీహెచ్డీ కోర్సు అంశంలోనూ అక్రమాలకు తెరలేపారు. సాధారణంగా ప్రీపీహెచ్‌డీ సెమినార్ మూడేళ్ల కనీస కాలవ్యవధి పూర్తయిన తరువాత నిర్వహించాలి. కానీ గడువుకు ముందే సెమినార్లు నిర్వహించుకోవడానికి అనుమతి మంజూరు చేశారు. కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించి ముగ్గురు పీహెచ్డీ అభ్యర్థులకు మూడేళ్ల కోర్సు కాల వ్యవధి పూర్తీ కాకుండానే అవకాశం కల్పించారు. కోర్సు మార్గదర్శకాలు, నియమ నిబంధనల ప్రకారం కచ్చితంగా నిర్ధేశించిన విధివిధానాలు పాటించాలి. నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపుకు గీటురాయి. ఈ క్రమంలో పీహెచ్డీ కోర్సు అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. గడువు ముగియకుండానే పీహెచ్డీ థీసీస్ సమర్పించడానికి అవకాశం కల్పించడంపై పరిశోధన విద్యార్థులు అందరూ తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు నివ్వెరపోతున్నారు. పరిశీలిస్తాం గడువుకు ముందే ప్రీపీహెచ్‌డీ సెమినార్, సబ్మిషన్కు అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అలా జరిగి ఉంటే వాటిని పరిశీలిస్తాము. గతంలో జరిగిన అంశాలు కాబట్టి సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తాం. –ఏ. ఆనందరావు, నూతన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ -
నేటి నుంచి ఎంబీఏ, ఎంసీఏ వెబ్ ఆప్షన్లు
10న మార్పులు.. 12న సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేయడంతో ఆయా కోర్సుల్లో ప్రవేశాలను చేపట్టేందుకు ప్రవేశాల కమిటీలు చ ర్యలు చేపట్టాయి. ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ తదితర కోర్సుల్లో వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించాయి. కాలేజీల వారీగా సీట్లు, ఫీజుల వివరాలను సంబంధిత వెబ్సైట్లలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులని స్పష్టం చేశాయి. ఇక ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారమే వెబ్ ఆప్షన్లు ప్రారంభించగా... న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను వారంలో ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 వరకు ఐసెట్ వెబ్ ఆప్షన్లు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. 10వ తేదీన ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని.. 12వ తేదీ రాత్రి 8 గంటల తరువాత సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కేటాయింపు వివరాలను ్టటజీఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఒకటో ర్యాంకు నుంచి 30 వేల ర్యాంకు వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు మంగళవారమే వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు లాగిన్ ఐడీలను పంపించామని.. మిగతా వారికి బుధవారం పంపిస్తామని వెల్లడించారు. ఇక 284 ఎంబీఏ కాలేజీల్లో 21,898 సీట్లు.. 38 ఎంసీఏ కాలేజీల్లో 1,909 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 12 వరకు పీజీఈసెట్... ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు మంగళవారమే ప్రారంభమైనట్లు పీజీఈసెట్ కో-కన్వీనర్ రమేశ్ తెలిపారు. 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని.. 14న సీట్లు కేటాయించి, 19వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. కాగా 156 ఎంటెక్ కాలేజీల్లో 9,414 సీట్లు అందుబాటులో ఉండగా.. 83 ఎంఫార్మసీ కాలేజీల్లో 3,689 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నెలాఖరులోగా లా ప్రవేశాలు మూడేళ్లు, ఐదేళ్ల న్యాయ విద్యలో (లా) ప్రవేశాల కౌన్సెలింగ్, ప్రవేశాలను ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని లాసెట్ కన్వీనర్ ఎంవీ రంగారావు తెలిపారు. కాలేజీలు, సీట్లకు సంబంధించి బార్ కౌన్సిల్ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందన్నారు. 15న జరిగే సమావేశంలో స్పష్టత వస్తుందని.. తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా 18 న్యాయ కళాశాలలు ఉండగా వాటిలో సుమారు 3 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రేపటి నుంచి ఎడ్‌సెట్... బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రసాద్ వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులంతా కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని.. గతంలో ఇచ్చిన ఆప్షన్లను మార్పుకోవచ్చని తెలిపారు. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకానివారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి వీల్లేదని వెల్లడించారు. 15వ తేదీన సీట్లు కేటాయిస్తామన్నారు. కాగా రాష్ట్రంలోని 184 బీఎడ్ కాలేజీల్లో 15,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో 12,400 సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో 3,100 సీట్లు ఉన్నాయి. -
ఫార్మసీలో మాస్టర్స్.. కేరాఫ్ నైపర్
ఫార్మసీ కోర్సు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. కారణం.. మారుతున్న ప్రజల జీవన శైలి.. వెలుగు చూస్తున్న కొత్త వ్యాధులు.. వీటి నిర్మూలనకు అవసరమైన ఔషధాల తయారీ.. వాటి కోసం చేసే పరిశోధనలు.. ఈ క్రమంలో ఇమిడి ఉన్న ఎన్నో విభాగాలు.. వాటన్నింటిపై నైపుణ్యాలను అందించే కోర్సు.. ఫార్మసీ. ఫార్మసీ కోర్సులను అందించడంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ విద్యాసంస్థ... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్). హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు క్యాంపస్‌ల ద్వారా ఫార్మసీలో ఉన్నత విద్యనందిస్తున్న నైపర్లలో.. ప్రత్యేక ముద్ర వేసుకున్న నైపర్-హైదరాబాద్ క్యాంపస్‌పై ఇన్స్టిట్యూట్ వాచ్... దేశంలో ఫార్మసీ రంగంలో కొత్త ఔషధాల తయారీ.. పరిశోధనల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 1998లో మొహాలీ ప్రధాన కేంద్రంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు రూపకల్పన చేసింది. ఆ తర్వాత క్యాంపస్‌ల విస్తరణలో భాగంగా 2007లో ప్రారంభమైన నైపర్-హైదరాబాద్ అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకుంటోంది. మౌలిక సదుపాయాలు మొదలు.. మెరుగైన పరిశోధనల వరకు అన్ని కోణాల్లో ప్రత్యేకత నిరూపించుకుంటోంది. మాస్టర్స్ కోర్సులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన నైపర్ ప్రధాన ఉద్దేశం.. ఫార్మసీలో ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్ది ఈ రంగానికి అవసరమైన మానవ వనరులను అందించడం. ఈ క్రమంలో నైపర్-హైదరాబాద్‌లో మాస్టర్స్ (పీజీ) స్థాయిలో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. - ఎంఎస్ ఫార్మసీలో మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, రెగ్యులేటరీ టాక్సికాలజీ స్పెషలైజేషన్లు. - అదే విధంగా ఫార్మసీలో టెక్నాలజీ అంశాలను సమ్మిళితం చేస్తూ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ(ప్రాసెస్ కెమిస్ట్రీ) స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ను అందిస్తోంది. - దాంతోపాటు ఫార్మాస్యూటికల్ విభాగాల్లో నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సునూ ఆఫర్ చేస్తోంది. పరిశోధనలకూ ప్రాధాన్యం నైపర్-హైదరాబాద్ క్యాంపస్.. అకడెమిక్ కోర్సులకే పరిమితం కాకుండా.. పరిశోధనలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్ విభాగాల్లో నిరంతర పరిశోధనలు చేస్తోంది. దీనిలో భాగంగా స్పాన్సర్డ్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ ఆధారిత రీసెర్చ్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తోంది. 2009లో ప్రారంభమైన రీసెర్చ్ విభాగంలోని ఫ్యాకల్టీ ఇప్పటివరకు దాదాపు వందకుపైగా అంతర్జాతీయ పబ్లికేషన్స్ ప్రచురించడమే నైపర్-హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ ప్రాధాన్యతకు నిదర్శనం. వీటికి అదనంగా ఈ ఇన్స్టిట్యూట్ సొంతంగా సైంటిఫిక్ జర్నల్ ఆఫ్ నైపర్-హైదరాబాద్ పేరుతో ఫార్మా రంగంలోని తాజా పరిణామాలతోఇన్హౌస్ మ్యాగజైన్‌ను కూడా ప్రచురిస్తోంది. ఇలా అన్ని విధాలుగా విద్యార్థులకు తాజా సమాచారం, సరికొత్త అంశాలపై విసృ్తతమైన అవగాహన కల్పిస్తోంది. టాప్ క్లాస్ లేబొరేటరీ ఫార్మసీ విద్యలో నైపుణ్యం సాధించడంలో కీలక పాత్ర లేబొరేటరీలదే. దీనికి సంబంధించి డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్‌లో అవసరమైన సాంకేతిక సదుపాయాలు కలిగిన ఆధునిక లేబొరేటరీ నైపర్-హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా నెలకొన్న ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్లతో విద్యార్థులు అనుసంధానమయ్యే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులకు క్షేత్ర స్థాయిలోని తాజా పరిణామాలపై అవగాహన కలిగించేలా నిరంతరం జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. క్లాస్ రూం టీచింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. టీచర్- స్టూడెంట్ నిష్పత్తి 1:8 ఉండేలా వ్యవహరిస్తూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన బోధన లభించేందుకు కృషి చేస్తోంది. సగటున 80 శాతం ప్లేస్‌మెంట్స్ సాధారణంగా ఇన్స్టిట్యూట్, కోర్సు ఏదైనా విద్యార్థుల లక్ష్యం.. ఉన్నతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవడం. ఈ విషయంలోనూ నైపర్-హైదరాబాద్ ముందంజలో నిలుస్తోంది. ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా సగటున 80 శాతం మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. అరబిందో ఫార్మా, రెడ్డీ ల్యాబ్స్ వంటి జాతీయ స్థాయి సంస్థలతోపాటు యూఎస్ ఫార్మాకోపియా, పెర్కిన్ ఎల్మర్ వంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కూడా ఏటా నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్గొంటున్నాయి. ప్రవేశం పొందాలంటే నైపర్-హైదరాబాద్‌లోని పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే.. ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నైపర్-మొహాలీ ప్రతి ఏటా నిర్వహించే నైపర్-జేఈఈలో ర్యాంకు సాధించాలి. ఆ తర్వాత నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా నైపర్- క్యాంపస్‌లలో సీట్ల భర్తీ జరుగుతుంది. పీహెచ్డీ ఔత్సాహిక అభ్యర్థులు నైపర్ పీహెచ్డీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్‌లో అర్హత సాధించాలి. వెబ్సైట్: www.niperhyd.ac.in ఫార్మసీ కోర్సులకు చిరునామా ‘‘నైపర్ క్యాంపస్‌లు ఫార్మసీ కోర్సులకు చిరునామాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ క్యాంపస్ వేగంగా విస్తరిస్తోంది. విద్యార్థులకు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు సొంతమయ్యేందుకు నగర పరిసరాల్లో ఏర్పాటైన బల్క్ డ్రగ్ సంస్థలు, ఇతర డ్రగ్ డెవలప్మెంట్ సంస్థలు కూడా దోహదపడుతున్నాయి. అంతేకాకుండా పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఇతర యూనివర్సిటీల్లోని పీజీ ఫార్మసీ కోర్సులతో పోల్చితే నైపర్ కరిక్యులం, బోధన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రాక్టికల్ ఓరియెంటేషన్, రీసెర్చ్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమిచ్చేలా ఉండే కరిక్యులం ద్వారా విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునే సమయానికి ఫార్మసీ రంగంలో పరిపూర్ణత సాధిస్తారు. ఫార్మసీలో నాణ్యమైన మానవ వనరులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడినందున నైపర్‌లో ప్రవేశాలు కూడా జీప్యాట్ కాకుండా నైపర్-జేఈఈలో ర్యాంకు ఆధారంగా జరుగుతాయి’’ - ప్రొఫెసర్ ఎన్.సత్యనారాయణ, రిజిస్ట్రార్, నైపర్-హైదరాబాద్ -
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
-
ఎంసెట్ కౌన్సెలింగ్ రెండో విడతకు నో
-
రెండో విడతకు నో
* ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ * ఏపీ ఉన్నత విద్యామండలి తీరుపై ఆగ్రహం * గడువు పొడిగింపు గతంలోనే ఎందుకు కోరలేదని ప్రశ్న * భారీగా సీట్లు మిగిలిపోయాయని అభ్యర్థించిన మండలి * సీట్లు మిగిలినా అనుమతివ్వబోమన్న కోర్టు.. పిటిషన్ కొట్టివేత సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అడ్మిషన్ల కోసం ఇంతకుముందే గడువు పొడిగించామని, మళ్లీ పెంచాలని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయన్న ఏపీ ఉన్నత విద్యామండలి వాదనను తప్పుబట్టింది. ప్రతిసారీ గడువు పొడిగించలేమని, సీట్లు మిగలడానికి మండలి తీరే కారణమని పేర్కొంటూ.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతివ్వాలంటూ ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ సుధాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ప్రఫుల్ల చంద్రపంత్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత ఏపీ మండలి తరఫున న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ... ‘‘ఏఐసీటీఈ నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం జూలై 31లోపు అడ్మిషన్లు పూర్తిచేసి, ఆగస్టు 1న తరగతులు ప్రారంభించాలి. మిగతా సీట్ల భర్తీని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి, తెలంగాణ ప్రభుత్వం ఏకాభిప్రాయానికి వచ్చిన మీదట.. మీరు ఆగస్టు 31 వరకు గడువు పొడిగించారు. దాని ప్రకారం మేం కౌన్సెలింగ్ నిర్వహించాం. లక్షా 17 వేల సీట్లు భర్తీకాగా.. ఇంకా 65 వేల సీట్లు మిగిలిపోయాయి. వాటి భర్తీ కోసం కౌన్సెలింగ్‌కు అదనపు గడువు ఇవ్వాలని కోరుతున్నాం..’’ అని విన్నవించారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ... ‘‘ఇంతకుముందు మీరు కోరిన తేదీల ప్రకారమే గడువు పొడిగించాం. కానీ అదనపు గడువు కావాలని మీరు ఆరోజు ప్రస్తావించలేదు. ఒకసారి అవకాశం ఇస్తే మళ్లీ మళ్లీ వస్తారా? ఈ రోజు గడువు పొడిగిస్తే మీరు మరో విడత కౌన్సెలింగ్ అంటారు.. ప్రతిసారీ ఇలా గడువు పొడిగించలేం. సీట్లు మిగిలిపోతే మిగలనివ్వండి.. అందుకు మీరే కారణం కదా..’’ అని పేర్కొన్నారు. దీనికి విశ్వనాథన్ బదులిస్తూ.. ‘‘ఆ రోజున కౌన్సెలింగ్ ముగింపు తేదీ ఆగస్టు 31 అని ఇచ్చాం. అయితే తదుపరి అడ్మిషన్ల ప్రక్రియకు మరో 15 రోజుల గడువు ఉంటుంది. ఆ మేరకు ఏఐసీటీఈ నిర్దేశిత షెడ్యూలులో కూడా ఉంది. మేం యాజమాన్యాల తరఫున గానీ ఎవరి తరఫునగానీ మాట్లాడడం లేదు. అడ్మిషన్లు నిర్వహించాల్సిన అథారిటీగా కోర్టును ఆశ్రయించాం..’’ అని పేర్కొన్నారు. కానీ దీనిని న్యాయమూర్తి తప్పుబట్టారు. ‘‘మీరు సూచించిన తేదీల ప్రకారమే అనుమతించాం. మళ్లీ గడువు కోరడం సమంజసం కాదు. సెప్టెంబరు 1నే తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ రోజు 11వ తేదీ. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకెప్పుడు చేస్తారు..?’’ అని ప్రశ్నించారు. అయితే.. పంజాబ్‌లోని కొన్ని కళాశాలల్లో కూడా సీట్లు మిగిలిపోయాయని, సీబీఎస్ఈ ఫలితాల విడుదలలో జాప్యం కారణంగా 6 కళాశాలల్లో 180 సీట్లు మిగిలాయని మరో న్యాయవాది కోర్టు దృష్టికి తేగా... ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో 65 వేల సీట్లు మిగిలిపోయాయని గుర్తుంచుకోవాల’ని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు అనుమతిస్తే ఏఐసీటీఈని సంప్రదించి 15 రోజుల పాటు గడువు కోరుతామని ఏపీ ఉన్నత విద్యామండలి న్యాయవాది అభ్యర్థించగా... న్యాయమూర్తి స్పందిస్తూ ‘మీరు ఏఐసీటీఈకి వెళ్లినా అనుమతివ్వాల్సింది కోర్టే కదా..’ అని స్పష్టం చేశారు. ‘ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మంచి రోజు కోసం ఎదురుచూడండి..’ అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చారు. -
3 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ షురూ సర్టిఫికెట్ల తనిఖీకి మరో నాలుగు రోజుల గడువు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కొత్త షెడ్యూలు అప్పటికి కూడా హాజరుకాకపోతే 12 వరకు అవకాశం నేటి నుంచి సీమాంధ్రలో పనిచేయనున్న 36 కేంద్రాలు సెప్టెంబర్ 17న సీట్ల కేటాయింపు 23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి ఉన్నత విద్యామండలి ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి వచ్చేనెల 3 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17న సీట్ల కేటాయింపు జాబితా వెల్లడి కానుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం శుక్రవారంతో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా.. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో కొన్ని సహాయక కేంద్రాలు పనిచేయలేదు. దీంతో శనివారం నుంచి వచ్చేనెల 3 వరకు నాలుగు రోజులు ప్రత్యేకంగా షెడ్యూలు పొడిగించారు. ఈ కొత్త షెడ్యూలు ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పటివరకు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన వారు ఇప్పుడు హాజరుకావొచ్చు. ఒకవేళ మూడో తేదీలోగా కూడా హాజరుకాలేకపోయిన వారు 12వ తేదీ వరకు కూడా సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించారు. ఈమేరకు ఉన్నత విద్యామండలి శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు సీమాంధ్రలో 37 సహాయక కేంద్రాలు ఉండగా కొన్ని కేంద్రాలు పనిచేయలేదు. శుక్రవారం నుంచి 36 కేంద్రాలు పనిచేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు వెల్లడించారు. అనంతపురం జిల్లా ఎస్కేయూలోని సహాయక కేంద్రం మినహా అన్ని కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సహాయక కేంద్రాలు తెరిచేందుకు అధ్యాపకులు అంగీకరించారని వివరించారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియపై శుక్రవారం రాత్రి మండలిలో చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్ జైన్, మండలి కార్యదర్శి డాక్టర్ సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ పాల్గొన్నారు. మరో 15 వేల మంది హాజరయ్యే అవకాశం.. ఆగస్టు 19 నుంచి శుక్రవారం వరకు జరిగిన సర్టిఫికెట్ల తనిఖీకి మొత్తం 2.17 లక్షలకు గాను 1.22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని, గ తేడాది 1.38 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని చైర్మన్ తెలిపారు. శుక్రవారం సీమాంధ్రలో 35 కేంద్రాలకు గాను 27 కేంద్రాల్లో 5,034 మంది, తెలంగాణలో 22 కేంద్రాల్లో 5,552 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తనిఖీకి హాజరుకావాలని ఇప్పటికే ఒకసారి మొబైల్ ద్వారా సంక్షిప్త సందేశాన్ని పంపించామని, శుక్రవారం రాత్రి మరోసారి పంపించనున్నామని తెలిపారు. మరో 15 వేల మంది విద్యార్థులు హాజరుకావొచ్చని అంచ నా వేస్తున్నట్టు పేర్కొన్నారు. హాజరుకాలేకపోయిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో శనివారం 1 నుంచి 50 వేల వరకు, సెప్టెంబర్ 1న 50 వేల నుంచి లక్ష వరకు, 2వ తేదీన లక్ష నుంచి 1.5 లక్షల వరకు, 3వ తేదీన 1.5 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావొచ్చని వివరించారు. 3వ తేదీ నాటికి కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయిన వారు 4 నుంచి 12లోగా సహాయక కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై, స్క్రాచ్ కార్డు పొంది అక్కడే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఇక ప్రత్యేక కేటగిరీ కింద రిజర్వేషన్ పొందాలనుకునే అభ్యర్థులు (ఎన్సీసీ, సైనికోద్యోగుల పిల్లలు, క్రీడాకారులు, వికలాంగులు తదితర కేటగిరీలవారు) మాత్రం హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. 9న సహాయక కేంద్రాలకు సెలవు విద్యార్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుంచి గానీ, ఎంసెట్ సహాయక కేంద్రం నుంచి గానీ వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 9న మాత్రం వినాయక చవితి పండుగ నేపథ్యంలో సహాయక కేంద్రాలు పనిచేయవు. ఇంటర్నెట్ సెంటర్ నుంచి నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకోవాలనుకుంటే సెప్టెంబర్ 13, 14ల్లో మార్చుకోవచ్చు. 13న 1 నుంచి 1 లక్ష వరకు, 14వ తేదీన 1,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను మార్చుకునే వెసులుబాటును కల్పించారు. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెల్లడిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేరోజు తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడించారు. బీ-కేటగిరీపై నేడు కాలేజీలతో భేటీ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ సమయంలో ఒకే విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సీట్లు పొందినప్పుడు ఎదుర య్యే సమస్యకు పరిష్కారం వెతికేందుకు ఉన్నత విద్యామండలి శనివారం దాదాపు 30 కళాశాలలతో సమావేశం కానుంది. బీ- కేటగిరీ సీట్ల భర్తీని జీవో 66, 67 ఆధారంగా సింగిల్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా భర్తీ చేయాలన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు ప్రకారం ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొత్త నోటిఫికేషన్‌కు మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పుడు ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కాలేజీల్లో సీట్లు పొందితే సీట్లు బ్లాక్ అయిపోయే పరిస్థితి నెలకొంటుందని, ఈ సమస్యపై పిటిషన్‌దారులైన కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పరిష్కారం కనుగొనాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో 30 కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు విద్యామండలి భేటీ కానుంది. కళాశాలల సూచనలు పరిగణనలోకి తీసుకుని తగిన మార్గదర్శకాలు రూపొందిస్తామని మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పేర్కొన్నారు. -
సర్టిఫికెట్ల తనిఖీకి పెరిగిన హాజరు
నేటి నుంచి విశాఖపట్నంలో కొత్త కేంద్రం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా నడుస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నాలుగో రోజు విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరిగింది. సీమాంధ్ర జిల్లాల్లో ఉద్య మం కారణంగా 37 కేంద్రాలకుగానూ 20 కేంద్రాల్లో సర్టిఫికెట్ తనిఖీ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే 17 కేంద్రాల్లో మాత్రం ఈ ప్రక్రియ సజావుగానే సాగుతోంది. ఈ 17 కేంద్రాల్లో గురువారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 4,791 మంది విద్యార్థులు హాజరుకాగా.. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 4,702 మంది హాజరైనట్టు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తెలిపారు. ఎంసెట్ సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియపై గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం. డోబ్రియాల్, సాంకేతిక విద్యా శాఖ సంయుక్త సంచాలకులు మూర్తి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం చైర్మన్ జయప్రకాశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఇప్పటివరకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కాలేదని చెప్పారు. శుక్రవారం నుంచి విశాఖలోని డాక్టర్ వి.ఎస్. కృష్ణ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభమవనుందని వెల్లడించారు. కాకినాడలో శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. -
వెబ్ అప్షన్ల నమోదు తాత్కాలిక వాయిదా
రెండు, మూడు రోజుల్లో రీషెడ్యూల్: ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నేడు (గురువారం) ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురు, శుక్రవారాల్లో 1 నుంచి 40 వేల ర్యాంకు వరకు గల అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 19న ప్రారంభమైన సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియలో 40 వేల ర్యాంకులోపు గల అభ్యర్థులు అందరూ హాజరు కాలేదు. సీమాంధ్ర ప్రాంతంలో 37 హెల్ప్‌లైన్ సెంటర్లకుగాను 17 మాత్రమే నడవడంతో పలువురు అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతారన్న కారణంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశామని, రెండు, మూడు రోజుల్లో రీషెడ్యూల్‌ను ప్రకటిస్తామని అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తెలిపారు. బుధవారం రాత్రి 7 గంటల వరకూ మొత్తం 15 వేల మందికిగాను 9,432 మంది అభ్యర్థులు మాత్రమే సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు హాజరయ్యారు. సీమాంధ్రలో 17 సహాయక కేంద్రాలే పనిచేశాయని, వీటిలో 4,216 మంది హాజరయ్యారని రఘునాథ్ తెలిపారు. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 5,216 మంది హాజరైనట్టు తెలిపారు. తొలి రెండు రోజులతో పోల్చితే మూడో రోజు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు హాజరు పెరిగిందని వివరించారు. హైదరాబాద్‌లో కొత్తగా 4 కేంద్రాలు.. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన అభ్యర్థుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నాలుగు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు అడ్మిషన్ల క్యాంపు అధికారి వెల్లడించారు. నిజాం కళాశాల, సైఫాబాద్ డిగ్రీ కళాశాల, సికింద్రాబాద్‌లోని ఓయూ పీజీ కళాశాల, దోమలగూడలోని ఏవీ కళాశాలలో ఈ కేంద్రాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. మూడో రోజు సర్టిఫికెట్ల తనిఖీకి సీమాంధ్ర జిల్లాల నుంచి తెలంగాణ ప్రాంతంలోని సహాయక కేంద్రాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు తెలిపారు. ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదులో పాల్గొన్నాకే.. సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. సీమాంధ్ర ప్రాంతంలో అధ్యాపకులు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సహకరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. -
ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
కేయూక్యాంపస్/పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో 2013-2014 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కాకతీయ యూనివర్సిటీలోని అడ్మిషన్ల డెరైక్టర్ కార్యాలయంలో, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్ కళాశాలల్లో అధికారులు సరిఫికెట్లను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాలలో 1వ ర్యాంక్ నుంచి 5వేల ర్యాంక్ వరకు, ఆర్ట్స్ కాలేజీలో 5001 నుంచి 10వేల వరకు, కేయూలో 10001 నుంచి 15వేల వరకు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ జి.భద్రునాయక్ పర్యవేక్షణలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమేష్, అధ్యాపకులు వి.శ్రీనివాస్, చొక్కయ్య, డాక్టర్ రమేష్‌కుమార్, డాక్టర్ టి.మనోహర్, డాక్టర్ స్వరూపరాణి, డాక్టర్ జ్యోతి, యాకూబ్ సర్టిఫికెట్లను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాలలో 47 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్క్రాచ్ కార్డు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. వెబ్ కౌన్సెలింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్చార్జి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన కౌన్సెలింగ్‌లో వెంకటనారాయణ, కృష్ణ, శ్రీనివాస్, నరేందర్, అప్పరావు పాల్గొన్నారు. కాగా, ఈనెల 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కొనసాగనుంది. కౌన్సెలింగ్ సందర్భంగా ఆయా కేంద్రాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది.