3 నుంచి ఎంసెట్‌ వెబ్ ఆప్షన్లు | EAMCET Web options to open from September 3rd | Sakshi
Sakshi News home page

3 నుంచి ఎంసెట్‌ వెబ్ ఆప్షన్లు

Published Sat, Aug 31 2013 2:38 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

3 నుంచి ఎంసెట్‌ వెబ్ ఆప్షన్లు - Sakshi

3 నుంచి ఎంసెట్‌ వెబ్ ఆప్షన్లు

ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ షురూ
సర్టిఫికెట్ల తనిఖీకి మరో నాలుగు రోజుల గడువు
ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కొత్త షెడ్యూలు
అప్పటికి కూడా హాజరుకాకపోతే 12 వరకు అవకాశం
నేటి నుంచి సీమాంధ్రలో పనిచేయనున్న 36 కేంద్రాలు
సెప్టెంబర్ 17న సీట్ల కేటాయింపు  23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి  
ఉన్నత విద్యామండలి ప్రకటన

 
 సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి వచ్చేనెల 3 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17న సీట్ల కేటాయింపు జాబితా వెల్లడి కానుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం శుక్రవారంతో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా.. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో కొన్ని సహాయక కేంద్రాలు పనిచేయలేదు. దీంతో శనివారం నుంచి వచ్చేనెల 3 వరకు నాలుగు రోజులు ప్రత్యేకంగా షెడ్యూలు పొడిగించారు. ఈ కొత్త షెడ్యూలు ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పటివరకు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన వారు ఇప్పుడు హాజరుకావొచ్చు.
 
 ఒకవేళ మూడో తేదీలోగా కూడా హాజరుకాలేకపోయిన  వారు 12వ తేదీ వరకు కూడా సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించారు. ఈమేరకు ఉన్నత విద్యామండలి శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు సీమాంధ్రలో 37 సహాయక కేంద్రాలు ఉండగా కొన్ని కేంద్రాలు పనిచేయలేదు. శుక్రవారం నుంచి 36 కేంద్రాలు పనిచేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు వెల్లడించారు. అనంతపురం జిల్లా ఎస్కేయూలోని సహాయక కేంద్రం మినహా అన్ని కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సహాయక కేంద్రాలు తెరిచేందుకు అధ్యాపకులు అంగీకరించారని వివరించారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియపై శుక్రవారం రాత్రి మండలిలో చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్ జైన్, మండలి కార్యదర్శి డాక్టర్ సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ పాల్గొన్నారు.
 
 మరో 15 వేల మంది హాజరయ్యే అవకాశం..
 ఆగస్టు 19 నుంచి శుక్రవారం వరకు జరిగిన సర్టిఫికెట్ల తనిఖీకి మొత్తం 2.17 లక్షలకు గాను 1.22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని, గ తేడాది 1.38 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని చైర్మన్ తెలిపారు. శుక్రవారం సీమాంధ్రలో 35 కేంద్రాలకు గాను 27 కేంద్రాల్లో 5,034 మంది, తెలంగాణలో 22 కేంద్రాల్లో 5,552 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తనిఖీకి హాజరుకావాలని ఇప్పటికే ఒకసారి మొబైల్ ద్వారా సంక్షిప్త సందేశాన్ని పంపించామని, శుక్రవారం రాత్రి మరోసారి పంపించనున్నామని తెలిపారు. మరో 15 వేల మంది విద్యార్థులు హాజరుకావొచ్చని అంచ నా వేస్తున్నట్టు పేర్కొన్నారు.
 
  హాజరుకాలేకపోయిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో శనివారం 1 నుంచి 50 వేల వరకు, సెప్టెంబర్ 1న 50 వేల నుంచి లక్ష వరకు, 2వ తేదీన లక్ష నుంచి 1.5 లక్షల వరకు, 3వ తేదీన 1.5 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావొచ్చని వివరించారు. 3వ తేదీ నాటికి కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయిన వారు 4 నుంచి 12లోగా సహాయక కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై, స్క్రాచ్ కార్డు పొంది అక్కడే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఇక ప్రత్యేక కేటగిరీ కింద రిజర్వేషన్ పొందాలనుకునే అభ్యర్థులు (ఎన్‌సీసీ, సైనికోద్యోగుల పిల్లలు, క్రీడాకారులు, వికలాంగులు తదితర కేటగిరీలవారు) మాత్రం హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది.
 
 9న సహాయక కేంద్రాలకు సెలవు
 విద్యార్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుంచి గానీ, ఎంసెట్ సహాయక కేంద్రం నుంచి గానీ వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 9న మాత్రం వినాయక చవితి పండుగ నేపథ్యంలో సహాయక కేంద్రాలు పనిచేయవు. ఇంటర్నెట్ సెంటర్ నుంచి నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకోవాలనుకుంటే సెప్టెంబర్ 13, 14ల్లో మార్చుకోవచ్చు. 13న 1 నుంచి 1 లక్ష వరకు, 14వ తేదీన 1,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను మార్చుకునే వెసులుబాటును కల్పించారు. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెల్లడిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేరోజు తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడించారు.
 
 బీ-కేటగిరీపై నేడు కాలేజీలతో భేటీ
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ సమయంలో ఒకే విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సీట్లు పొందినప్పుడు ఎదుర య్యే సమస్యకు పరిష్కారం వెతికేందుకు ఉన్నత విద్యామండలి శనివారం దాదాపు 30 కళాశాలలతో సమావేశం కానుంది. బీ- కేటగిరీ సీట్ల భర్తీని జీవో 66, 67 ఆధారంగా సింగిల్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా భర్తీ చేయాలన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు ప్రకారం ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొత్త నోటిఫికేషన్‌కు మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడింది.
  ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పుడు ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కాలేజీల్లో సీట్లు పొందితే సీట్లు బ్లాక్ అయిపోయే పరిస్థితి నెలకొంటుందని, ఈ సమస్యపై పిటిషన్‌దారులైన కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పరిష్కారం కనుగొనాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో 30 కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు విద్యామండలి భేటీ కానుంది. కళాశాలల సూచనలు పరిగణనలోకి తీసుకుని తగిన మార్గదర్శకాలు రూపొందిస్తామని మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement