* జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్
* జూలై 1 నుంచి తరగతులు, జూలైలోనే స్లైడింగ్‌కు అవకాశం
* ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 15న జరిగే ఎంసెట్‌కు హాజరు కానున్న విద్యార్థులకు ర్యాంకులను ఈ నెల 27న ఇస్తామని ప్రకటించామని, వీలైతే అంతకంటే ముందుగానే ర్యాంకులను ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఎంసెట్ ఏర్పాట్లలో భాగంగా శనివారం మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
జూన్ మొదటి వారంలోనే ప్రవేశాలకు కౌన్సెలింగ్ చేపడతామని, జూన్ 20 నాటికి మొదటి, రెండో దశ కౌన్సెలింగ్‌లను పూర్తి చేసేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జూలై 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో తరగతులను ప్రారంభిస్తామని, అలాగే సీట్లు పొందిన విద్యార్థులు తమ కాలేజీలు, ఆప్షన్లు మార్పు చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామని, జూలై మొదటి వారంలోనే విద్యార్థులకు స్లైడింగ్‌కు అవకాశం కల్పిస్తామన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని వసతులు కల్పించామని, అన్నీ పరిశీలించాకే ఎంసెట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడిం చారు. వేసవి దృష్ట్యా కొన్ని కేంద్రాల్లో తాగునీటి సమస్య ఉన్నందున అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు అర లీటర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేటు కాలేజీల మెడ్‌సెట్ పరీక్షపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని పాపిరెడ్డి తెలిపారు.
సీబీఎస్‌ఈ విద్యార్థులకు పాయింట్ ర్యాంకులు
సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదివే విద్యార్థుల 12వ తరగతి ఫలితాలు.. ఎంసెట్ ర్యాంకులు ఇచ్చేనాటికి అందకపోతే ఆ తర్వాత వారికి పాయింట్ ర్యాంకులు ఇస్తామని ఎంసెట్ కమిటీ ప్రకటించింది. మే 30న సీబీఎస్‌ఈ విద్యార్థుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే అంతకంటే ముందే విద్యార్థుల ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ప్రకటించేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ విద్యార్థుల ఫలితాలు అప్పటికి రావు కాబట్టి వారికి పాయింట్ ర్యాంకులను ఇవ్వాలని నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆ ఫలితాలు వచ్చాక సప్లిమెంటరీ ర్యాంకులను ఇస్తామని కమిటీ వెల్లడించింది.
ఇంజనీరింగ్ కాలేజీలకు గ్రేడింగ్‌లు
వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు గ్రేడింగ్‌లు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యార్ పేర్కొన్నారు. అయితే కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలపైనే ప్రధానంగా దృష్టి సారించామని, కాలేజీల వారీగా వసతులు, ఫ్యాకల్టీ వివరాలన్నీ విద్యార్థులు చూసుకునేలా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 27లోగానే ఎంసెట్ ర్యాంకులు
Published Sun, May 8 2016 4:13 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement