వెబ్‌ ఆప్షన్లు వాయిదా!  | Engineering Web Options May Again Postponed | Sakshi
Sakshi News home page

వెబ్‌ ఆప్షన్లు వాయిదా! 

Published Thu, Jul 4 2019 2:43 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Engineering Web Options May Again Postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి వెబ్‌ ఆప్షన్లను ప్రారంభించాల్సి ఉంది. అయితే అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులను ఖరారు చేశాకే ముందుకెళ్లాలన్న నిర్ణయం నేపథ్యంలో.. 5నుంచి వెబ్‌ ఆప్షన్లను ప్రారంభించాలా? వద్దా? అన్న ఆలోచనల్లో అధికారులున్నారు. విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలంటే కాలేజీ వారీగా వివరాలన్నీ అందుబాటులోకి తేవాల్సి ఉంది. అయితే ఈనెల 5వ తేదీ నాటికి సాధ్యం అవుతుందా? లేదా? అన్నదే అసలు ప్రశ్న. గత వారం వరకు ఫీజులను ఖరారు చేయకపోవడంతో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించి, ఫీజులను ఖరారు చేయాలి.. లేదా యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలన్న ఉత్తర్వులను పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆగమేఘాలపై ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌ను నియమించడం, ఫీజుల ఖరారు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

బుధవారంతో కోర్టును ఆశ్రయించిన 81 కాలే జీల్లో 79 కాలేజీలకు ఏఎఫ్‌ఆర్‌సీ హియరింగ్‌ నిర్వహించి ఫీజులను ఖరారు చేసింది. అంతేకాదు కోర్టుకు వెళ్లని మరో 108 కాలేజీల ఫీజులను ఈనెల 4వ తేదీ నుంచి చేపట్టి రోజుకు 36 కాలేజీల చొప్పున హియరింగ్‌ నిర్వహించి 6వ తేదీనాటికి అన్నింటికి ఫీజులను ఖరారు చేసేందుకు ముందుకు సాగుతోంది. ఆ తరువాత బీ–ఫార్మసీ ఫీజులను కూడా ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫీజులతో వెబ్‌ ఆప్షన్లను ప్రారంభించాలంటే ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇందుకు మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల పాటు వెబ్‌ ఆప్షన్లు వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. లేదా కోర్టును ఆశ్రయించిన కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులపై ఉత్తర్వుల కోసం గురువారం ప్రభుత్వానికి పంపి, మిగతా కాలేజీలు ఎలాగూ ఫీజు రూ.50 వేలకు పైగా ఉంటే 15%, రూ.50 వేల లోపు ఉంటే 20% పెంచేందుకు అంగీకరించిన నేపథ్యంలో వాటిని అమలు చేయాలా? అన్న ఆలోచనల్లో అధికారులున్నారు. దీనిపై గురువారం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
భారీగా ఫీజుల పెరుగుదల 
ఏఎఫ్‌ఆర్‌సీ వివిధ కాలేజీలతో నిర్వహిస్తున్న హియరింగ్‌ సందర్భంగా కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి వచ్చే మూడేళ్లలో అమలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేస్తోంది. ఇప్పటివరకు 79 కాలేజీలకు హియరింగ్‌ నిర్వహించి ఫీజులను ఖరారు చేసింది. ఇందులో కొన్ని ప్రముఖ కాలేజీలున్నాయి. ఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదిత ఫీజుకు ఆయా కాలేజీలు అంగీకరించినట్లు తెలిసింది. శ్రీని«ధి, సీబీఐటీ కాలేజీల ఫీజులను గురువారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొన్ని టాప్‌ కాలేజీల్లో ఫీజులు గతంలో కంటే ఈసారి ఎక్కువగా పెరిగినట్లు తెలిసింది. 
 
విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని కాలేజీల్లో ఫీజుల పరిస్థితి (కొంత మార్పు ఉండవచ్చు) 
కాలేజీ    పాత ఫీజు    కొత్త ఫీజు 
వాసవి    86,000    1,30,000 
వర్ధమాన్‌    1,05,000    1,25,000 
సీవీఆర్‌    90,000    1,15,000 
కేఎంఐటీ    77,000    1,03,000 
సీవీఎస్‌ఆర్‌    93,000    1,20,000   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement