జేఎన్టీయూహెచ్ మల్లగుల్లాలు
మార్గదర్శకాల కోసం అధికారుల ఎదురుచూపులు
నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ వ్యవహారంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోపాలున్నాయంటూ.. ఈ ఏడాది 125 ఇంజినీరింగ్, 61 ఫార్మసీ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ గుర్తింపును నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో ఆయా కళాశాలలకు షరతులతో కూడిన అనుమతి లభించినా, తుది తీర్పు వెలువడే వరకు సీట్ల అలాట్‌మెంట్‌ను విత్‌హెల్డ్‌లో పెట్టాలనడమే యాజమాన్యాలకు మింగుడు పడడం లేదు. యూనివర్సిటీ జారీచేసిన నోటీసుల మేరకు దాదాపు అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు లోపాలను సరిదిద్దుకున్నట్టు (డెఫిషియన్సీ కంప్లెయిన్స్ రిపోర్టు)నివేదికలను సమర్పించాయి. అయితే.. ఆయా నివేదికలను పరిశీలించేందుకు మరికొంత సమయం కావాలని కోరడంతో కాలేజీల కథలో మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది. వచ్చే నెల 16వరకు వర్సిటీ అధికారులకు హైకోర్టు గడువిచ్చింది.
నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్లు..
ఇదిలాఉండగా, పీజీఈసెట్ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. షెడ్యూలు ప్రకారం శుక్రవారంలోగా సీట్ల అలాట్‌మెంట్ చేయాల్సి ఉంది. అయితే.. హైకోర్టులో కేసు వాయిదా పడడంతో అధికారులకు ఏంచేయాలో తోచడం లేదు. ప్రస్తుతానికి విత్‌హెల్డ్ ప్రతిపాదనను విరమించుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీల కాలేజీల విషయంలో సమస్యలు లేకున్నా.. జేఎన్‌టీయూహెచ్ కాలేజీల కారణంగా మిగిలిన వర్సిటీ కళాశాలన్నింటిలోనూ సీట్ల భర్తీని నిలిపివే యక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అభ్యర్థుల అయోమయం
పీజీఈసెట్ సీట్ల అలాట్‌మెంట్‌లో ప్రతిష్టంభన నెలకొనడంతో అభ్యర్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఎంటెక్/ ఎం.ఫార్మసీ కోర్సుల్లో సీటు వచ్చేదీ, రానిదీ తేలితే వేరే దారి చూసుకుంటామని అంటున్నారు. నెలలతరబడి వేచి ఉండడంతో ఎంతో నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రైవేటు వర్సిటీల్లో పీజీ కోర్సుల తరగతులు నెలక్రితమే ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం వాతావరణాన్ని బట్టి ఇక్కడ తరగతులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడంలేదంటున్నారు. కాగా, కాలేజీలకు అఫిలియేషన్‌పై వర్సిటీ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఉన్నతవిద్యామండలి కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
అఫిలియేషన్లపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
Published Tue, Sep 23 2014 1:09 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement