- సిద్ధరామయ్య వెల్లడి
- విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు
- మోడీకి ఓటమి భయం
- అందుకే రెండు స్థానాల్లో పోటీ
మైసూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల అనంతరం కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు ఆరోపించడంలో వాస్తవం లేదన్నారు. అలాగైతే లోక్‌సభ ఎన్నికలను ఒకే దశలో ఎలా నిర్వహించగలుగుతారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జేడీఎస్‌కు ఉనికే లేదని, బీజేపీలో అవినీతిపరులున్నారని విమర్శించారు. మైసూరులో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం ద్వారా తనకు అప్రతిష్ట తెచ్చేందుకు బీజేపీ, జేడీఎస్‌లు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆరోపించారు.
మోడీకి భయం : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని చెప్పుకుంటున్న ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రెండు చోట్ల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని సీఎం ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ఒక స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలని సవాలు విసిరారు. గుజరాత్‌లో మోడీ అవినీతికి పాల్పడి రూ.కోట్లు వెనకేసుకున్నారని, ఆ ధనాన్ని లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌లో నరమేధానికి పాల్పడిన మోడీని శివునితో పోల్చడం హాస్యాస్పదమన్నారు.