సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ హితవు పలికారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు ఏక వచన ప్రయోగం తగదన్నారు. కాంగ్రెస్‌లో ఎందరో నాయకులు తనతో గౌరవంగానే మసలుకుంటున్నారని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒక్క స్థానం కూడా గెలవబోదని సీఎం జోస్యం చెప్పడాన్ని సవాలుగా స్వీకరిస్తున్నామని తెలిపారు.
తాను, కుమార స్వామి కార్యకర్తల సమావేశాల్లో భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చడంపై కూడా సీఎం చులకనగా మాట్లాడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు తెలిసిన వారెవరూ అలా మాట్లాడరని అన్నారు. కావేరి నదీ జలాలు సహా అంతర్ రాష్ట్ర వివాదాలపై జాతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
పక్కనున్న తమిళనాడులో అందుకనే ప్రాంతీయ పార్టీలకు పట్టం కడుతున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాగా పదేళ్ల పాటు కేంద్రంలో నిరాటంకంగా అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ల గురించి ప్రస్తావించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
వ్యక్తిగత దూషణలొద్దు
Published Fri, Mar 28 2014 3:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement