
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేదని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం వేరు కాదని ప్రజలు గుర్తించారన్నారు. కాంగ్రెస్‌ను వెనకేసుకొస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. హైదరాబాద్‌లో గురువారం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దెబ్బతిన్న సంక్షేమాభివృద్ధి, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనే ప్రధానంగా ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళతామని, అలాగే కేంద్రం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం అంశాలను ప్రజలకు వివరిస్తామన్నారు. టీఆర్‌ఎస్ ముసుగులో మజ్లిస్ చేస్తున్న పాలనను బీజేపీ మాత్రమే తిప్పికొట్టగలుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు.
తిరుగులేని శక్తిగా మారుస్తాం...
ఉద్యమాలు, పోరాటాల సంవత్సరంగా 2020ని భావిస్తున్నామని, ఈ ఏడాది బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తామని లక్ష్మణ్ తెలిపారు. చాప కింద నీరులా బీజేపీ దూసుకుపోతుంటే కేసీఆర్, కేటీఆర్‌కు గుబులు పట్టుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ వస్తాయన్నారు. ఎంఐఎం మేలు కోసమే టీఆర్‌ఎస్ పనిచేస్తుందని, అందుకే పౌరసత్వ సవరణ బిల్‌ను కూడా వ్యతిరేకించిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకటి అయినందునే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్న తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కాపాడుకోలేకపోయిందన్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈ నెల 7న మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరుతున్నారని లక్ష్మణ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment