జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
- మీట్ ది ప్రెస్‌లో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం : జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో శనివారం ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం జరిగింది. మంత్రి మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జిల్లాలో ఆయిల్ రిఫైనరీతోపాటు క్రాకర్ అనే సంస్థ ద్వారా పలు పరిశ్రమలు స్థాపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు.
కోస్తా తీరం వెంబడి రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 216వ నంబరు జాతీయ రహదారి విస్తరణకు, మచిలీపట్నం నుంచి రేపల్లె రైలు లింకు మార్గం నిర్మాణానికి ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి కృషి చేస్తానని చెప్పారు. మంగినపూడి బీచ్‌లో తొలి విడతగా రూ.20 లక్షలతో మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. చెన్నై బీచ్‌ల తరహాలో మంగినపూడి బీచ్‌లోనూ పార్కు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
బందరుపోర్టు నిర్మిస్తాం...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బందరుపోర్టు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారని మంత్రి తెలిపారు. బందరు పోర్టు అభివృద్ధి చేస్తే దానికి అనుబంధంగా జిల్లాలో 27 రకాల పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందన్నారు. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కంపెనీని మచిలీపట్నంలోనే విస్తరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బందరు పోర్టును గోగిలేరు ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రశ్నపై ఆయన సమాధానమిస్తూ బందరు పోర్టును బందరులోనే నిర్మిస్తామని తేల్చి చెప్పారు.
బందరులో ఓపెన్ డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉందనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పనులను పూర్తి చేయించేందుకు రూ. 22 కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు. మచిలీపట్నంను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు ఆగస్టు7వ తేదీ నుంచి లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల పేదలకు ఇళ్లస్థలాలుగా ఇచ్చిన భూములు కోర్టు కేసుల్లో ఉండి గృహనిర్మాణం జరగడం లేదన్నారు. దీని నుంచి బయటపడేందుకు జీ+1, జీ+2, జీ+3 తరహా గృహాలు నిర్మించి ఇంటిగ్రేటెడ్ గ్రామాలను అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నామన్నారు.
ప్రకృతి సహకరించాల్సిందే...!
కృష్ణాడెల్టా రైతులకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని జూలై నెలాఖరు నాటికి కూడా నారుమడులు పోసుకోలేని పరిస్థితి ఉందని సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తాగునీటి అవసరాల నిమిత్తం డెల్టాకు నీటిని విడుదల చేశారన్నారు. ఆగస్టు నెలలో ప్రకృతి సహకరించి వర్షాలు కురిస్తే ఎగువ నుంచి సాగునీరు విడుదల అవుతుందని ఆశిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, బందరు మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకటబాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.