ఎలాంటి తెలంగాణ కావాలో తేల్చుకోండి | GHMC Election 2020: KTR Meet The Press Over GHMC Elections Press Club | Sakshi
Sakshi News home page

గల్లీయా.. ఢిల్లీయా?

Published Fri, Nov 20 2020 3:11 AM | Last Updated on Fri, Nov 20 2020 8:31 AM

GHMC Election 2020: KTR Meet The Press Over GHMC Elections Press Club - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘తెలంగాణలో కొందరు విద్వేషపు విత్తనాలు నాటుతూ మత సామరస్యం దెబ్బతీసే విధంగా ప్రయ త్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా మత కలహాలు, బాంబు పేలుళ్ల వంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుంది. తెలంగాణకు ఆర్థిక యంత్రంగా ఉన్న హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విద్వేషంతో నిండిన హైదరాబాద్‌ కావాలో లేక విజ్ఞతతో ఆలోచించే తెలంగాణ కావాలో ప్రజలు తేల్చుకోవాలి.

‘హమారా హైదరాబాద్‌’ అంటూ నగరాన్ని కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము గల్లీ పార్టీ.. వారిది ఢిల్లీ పార్టీ.. ఈ రెండింటిలో ఏది కావాలో ప్రజలు తేల్చుకోవాలి’’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో కేటీఆర్‌ మాట్లాడారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తామనే బీజేపీ నేతల ప్రకటనలపై స్పందిస్తూ అక్కడ కేసీఆర్‌ జాతీయ జెండా ఎగరేస్తారని, తాము మాత్రం బల్దియాపై గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి తాము సవాళ్లు విసరబోమని, విపక్షాలు సవాలు చేస్తే స్పందిస్తామన్నారు. ‘‘గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీని నేనే గెలిపించాలనే భ్రమల్లో లేను. పెద్ద లీడర్‌ను అనుకోవడం లేదు. కేసీఆర్‌ రూపంలో మాకు సమర్థుడైన నాయకుడు ఉన్నారు. నా పొజిషన్‌తో సంతృప్తిగా ఉన్నా. నాకు వేరే ఏమీ అవసరం లేదు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటరే మేయర్‌...
‘‘గ్రేటర్‌ ఎన్నికల్లో మాకు ఎవరితోనూ దోస్తీ లేదు. గత ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేసి పాతబస్తీలోఎంఐఎం అభ్యర్థులపై ఐదు చోట్ల గెలుపొందాం. ఈసారి పాతబస్తీలో పది స్థానాల్లో ఎంఐఎంపై విజయం సాధిస్తాం. మజ్లిస్‌ పార్టీకి మేయర్‌ పదవి ఇస్తామని కొందరు చెబుతున్నారు. మాకేమైనా పిచ్చా.. ఎందుకిస్తాం? గతంలో 99 స్థానాల్లో గెలిచి మేయర్‌ పీఠాన్ని సాధించుకున్నాం. డిసెంబర్‌ 4న టీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా కార్పొరేటర్‌ మేయర్‌ అవుతారు’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

‘దుబ్బాకలో ఓటమి ఒలికిపోయిన పాల లాంటివి. వాటి గురించి ఆలోచించదలుచుకోలేదు. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. గతంలోనూ బీజేపీ మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికలో గెలిచినా మళ్లీ విజయం సాధించలేదు. కానీ టీఆర్‌ఎస్‌ 2014 నుంచి ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. అయినా కొందరు మా అపజయాన్నే వార్తగా పైశాచిక ఆనందం పొందుతున్నారు. మేము ఎవరి బీ–టీం కాదు. అంతర్గత కారణాలతోనే కాంగ్రెస్‌ బలహీనమైంది. గ్రేటర్‌ ఎన్నికల్లో రెండో స్థానంలో ఎవరుంటారో బీజేపీ, కాంగ్రెస్‌ తేల్చుకోవాలి.  మేము మాత్రం ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతూ ప్రచారంలోకి వెళ్తాం. గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. గ్రేటర్‌ మేనిఫెస్టోపై సరైన సమయంలో స్పందిస్తాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

బీజేపీకి తెలిసింది విద్వేషాలు సృష్టించడమే... 
‘‘కేంద్ర ప్రభుత్వ పనితీరు వల్లే లాక్‌డౌన్‌ తర్వాత దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. కేంద్రం ఓ మిథ్య. ఆరేళ్లుగా తెలంగాణ నుంచి రూ. 2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో సమకూరినా రాష్ట్రానికి మాత్రం రూ. 1.40 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. వరదలతో హైదరాబాద్‌ నష్టపోయినా కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు. దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదు. వాళ్లకు తెలిసింది ఒకటే విద్య.. హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్, ఎంఐఎం–టీఆర్‌ఎస్‌ అనే పిచ్చిమాటలతో విద్వేషాలు సృష్టించడం’’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

70 ఏళ్లుగా నాలాలు, చెరువుల ఆక్రమణల వల్లే హైదరాబాద్‌లో వరద నష్టం జరిగింది. వరదల బారిన పడిన కాలనీలకు చెందిన 6 లక్షల మందికి ఇప్పటికే రూ. 650 కోట్ల మేర ఆర్థిక సాయం చేశాం. మరికొందరు అర్హులకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సాయం అందిస్తాం. ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కేంద్రం చేసేదేమీ లేదు. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొనేది సీఎం కేసీఆర్‌ మాత్రమే. స్థిరా>స్థికి పాస్‌బుక్‌ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కోటి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది’’ అని కేటీఆర్‌ తెలిపారు.

పెట్టుబడులకు అయస్కాంతంలా హైదరాబాద్‌..
‘తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న అపోహలను తొలగించి రాష్ట్రం, హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆరే. ఆరేళ్లలో ఎవరితోనూ మేము గిల్లికజ్జాలు పెట్టుకోలేదు. ఆరేళ్లుగా హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది. పెట్టుబడులకు హైదరాబాద్‌ అయస్కాంతంలా మారింది. నిరంతర విద్యుత్, స్వచ్ఛ హైదరాబాద్, శానిటేషన్‌లో హైదరాబాద్‌ దేశానికి రోల్‌ మోడల్‌గా ఉంది. చెత్త నుంచి 63 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాం.

రూ. 1,800 కోట్లతో సమగ్ర రోడ్డు ప్రణాళిక, 8 వేల పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాం. నాలాల ఆక్రమణల తొలగించేలా గ్రేటర్‌ ఎన్నికల తర్వాత సమగ్ర చట్టం తెస్తాం. హైదరాబాద్‌లో గత ఆరేళ్లలో రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశాం. రెండు, మూడు రోజుల్లో నయాపైసాతో సహా లెక్కలు చెప్తాం. మేము చెప్పేది అబద్ధమైతే శిక్షించండి. నిజమైతే ఆశీర్వదించండి’’ అని కేటీఆర్‌ కోరారు. గ్రేటర్‌లో సీఎం ప్రచార సభ షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదన్నారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజమౌళిచారి, సూరజ్, రవికాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement