బీజేపీలో విషయమేది.. విషం తప్ప! | GHMC Elections 2020: KTR Special Interview With Sakshi | Sakshi
Sakshi News home page

బీజేపీలో విషయమేది.. విషం తప్ప!

Published Mon, Nov 23 2020 3:14 AM | Last Updated on Mon, Nov 23 2020 10:42 AM

GHMC Elections 2020: KTR Special Interview With Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఎవరైనా మేమిది చేశాం, ఇంకా ఇవి చేస్తామని చెప్పి ఓట్లడుగుతారు. కానీ బీజేపీ దగ్గర విషయం లేదు. ఎందుకంటే వాళ్లు హైదరాబాద్‌కు చేసిందేమీ లేదు. అందుకే విషం చిమ్ముతున్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో నాలుగు ఓట్ల కోసం మతం పేరిట చిచ్చుపెట్టాలని చూస్తున్నారు’ అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు అన్నారు.

‘ఏ ఎన్నిక అయినా ప్రజల మనోగతాన్ని ప్రతిబింబిస్తుంది. 74 లక్షల మంది ఓట్లు వేసే గ్రేటర్‌ ఎన్నిక ప్రజాభిప్రాయానికి ప్రతీక (రిఫరెండం) కాదు అని ఒక రాజకీయ నాయకుడిగా నేను అంటే అది తప్పే. కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముఖ్యమైనవే. అలాగని ఈ ఎన్నికను భూతద్దంలో చూడాల్సిన పనికానీ, విస్మరించాల్సిన అవసరం కానీ లేదు. అన్ని ఎన్నికల మాదిరిగానే గ్రేటర్‌ ఎన్నిక కూడా ప్రజల మనోగతాన్ని ప్రతిబింబిస్తుంది. మేము పనిచేశాం కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు మాకు బలమైన మెజారిటీ ఇస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్‌ పాత్ర అత్యంత కీలకమని చెప్పిన కేటీఆర్‌.. మరో మూడేళ్లలో నాలా అభివృద్ధి పథకాన్ని ప్రాధాన్యంగా తీసుకుని హైదరాబాద్‌ నగర రూపురేఖలు మారుస్తామన్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు పరిసర మున్సి పాలిటీలు, కార్పొరేషన్లను ‘గ్రేటర్‌ హైదరాబాద్‌ అథారిటీ’ పేరిట ఒకే గొడుగు కిందకు తెచ్చే ఆలోచన ఉందన్నారు.    

వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదని, పెయిడ్‌ వర్కర్స్‌ను పెట్టుకుని గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విషం చిమ్ముతోందన్నారు. అభివృద్ది కావాలో... అరాచకం కావాలో హైదరాబాద్‌ ప్రజలు తేల్చుకోవాలన్నారు. గత గ్రేటర్‌ ఎన్నికల్లో సెంచరీ మిస్సయిన టీఆర్‌ఎస్‌.. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో భారీ విజయం సాధిస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.

సాక్షి : రాష్ట్రానికి హైదరాబాద్‌ను ఆర్దిక ఇంజిన్‌ అని చెప్తున్నారు. ఆరేళ్ల పాలనలో ఈ ఇంజిన్‌ను గాడిన పెట్టేందుకు ఎలాంటి ప్రయత్నం చేశారు?
కేటీఆర్ ‌: తెలంగాణకు హైదరాబాద్‌ గుండెకాయ లాంటిది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 45 నుంచి 50శాతం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. రాష్ట్ర పురోగతిలో హైదరాబాద్‌ పాత్ర కీలకం. అధికారం చేపట్టిన కొత్తలో ఉన్న తాగునీరు, విద్యుత్‌ వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రస్ఫుటమైన మార్పు తెచ్చాం. పారిశుధ్యం, చెత్త సేకరణ, రవాణా, డంప్‌ యార్డుల ఆధునికీకరణ, చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ తదితరాల్లో ఎంతో ప్రగతి సాధించాం. పేకాట క్లబ్లులు, గుడుంబా గబ్బు, ఆకతాయిల ఆగడాలు, పోకిరీల పోకడలు లేవు. మత కల్లోలాలు, అనవసరపు అల్లర్లు లేవు. 5 లక్షల సీసీ కెమెరాలు, 4.7 లక్షల ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేశాం. ఆకలేస్తే అన్నపూర్ణ.. సుస్తీ చేస్తే బస్తీ దవాఖానా.. ఇలా మౌళిక వసతుల మీద దృష్టి పెట్టాం. రూ.6వేల కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ, రోడ్ల నిర్వహణకు సీఆర్‌ఎంపీ, రూ.1,800 కోట్లతో లింక్‌ రోడ్లు, మెట్రో రెండో దశకు శ్రీకారం చుట్టడం లాంటివి ఎన్నో చేశాం. 

సాక్షి : రాబోయే ఐదేళ్లలో మీ దృష్టి దేనిపై కేంద్రీకరిస్తారు?
కేటీఆర్‌ : రాష్ట్రంలో మా ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుంది కాబట్టి చెరువులు, కుంటలు, నాలాలు, మూసీ అభివృద్ది చేయడంతో పాటు ఎస్‌ఎన్‌డీపీ ద్వారా మంచి మార్పు తెస్తాం. మానవ తప్పిదాలతో రసాయనాలు, చెత్తా చెదారం కలిసి వరద నీరు, మురుగునీటి కాలువలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. నగరాన్ని అపరిశుభ్రం చేయకుంటే పరిశుభ్రంగా ఉంటుందనే టోక్యో తరహా భావన మన ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది. ఇండోర్‌ తరహాలో ప్రజలు, ఉద్యోగుల్లో మార్పు సాధించేందుకు ప్రయత్నిస్తాం.

సాక్షి : మీరు చెప్తున్న అభివృద్ధి ప్రణాళిక అమలుకు కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి తెస్తారు?
కేటీఆర్‌ : రాష్ట్రమైనా, నగరమైనా అభివృద్ది కోసం అప్పులు తేవాల్సిందే. అయితే ఉత్పాదక రంగం కోసం చేసే అప్పులను పెట్టుబడిగా చూడాలి. ఉదాహరణకు మూసీ ప్రాజెక్టు కోసం రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్లు అప్పు చేస్తే, రూ.6వేల కోట్ల విలువ చేసే భూమి వినియోగంలోకి వస్తుంది. అప్పుల ద్వారా సంపద సృష్టించవచ్చు. ప్రధాని మోదీ ఓ సందర్భంలో ఇచ్చిన సలహా మేరకు మున్సిపల్‌ బాండ్ల ద్వారా రూ.వేయి కోట్లు తెచ్చి ఎస్‌ఆర్‌డీపీ చేపట్టాం. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడే రుణాలు తెస్తున్నాం. 

సాక్షి : ఇటీవలి వరదలు నగరంలో మౌళిక వసతుల లేమిని ఎత్తిచూపాయి. గతంలో అనేక కమిటీలు చేసిన సిఫారసులు ఎందుకు అమలు చేయడం లేదు?
కేటీఆర్ ‌: మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీరు, సాగునీరు, విద్యుత్, సంక్షేమ కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ఇటీవల కురిసిన వరదలు నగరంలోని డ్రైనేజీలు, నాలాలు, చెరువుల్లో లోపాలను ఎత్తిచూపాయి. దశాబ్దాల తరబడి సాగిన అక్రమ నిర్మాణాలు, అధికారుల నిర్లక్ష్యంతో  ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. రాబోయే మూడు నాలుగేళ్లలో నాలా అభివృద్ది పథకాన్ని ప్రాధాన్యంగా తీసుకుని పూర్తి చేస్తాం. నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తాం. నగర శివారు కాలనీల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.3,700 కోట్లు కావాలి. కోర్‌సిటీని కలుపుకుంటే రూ.15వేల కోట్లకు పైగా నిధులు అవసరం. షా కన్సల్టెన్సీ నగరాన్ని పది ఫ్లడ్‌ వాటర్‌ జోన్లుగా విభజించి నివేదిక ఇచ్చింది. వాటిని అధ్యయనం చేసి పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేస్తాం.


కేంద్రానికి బాధ్యత లేదా?
సాక్షి : వరద సాయం మీద గుడిలో ప్రమాణం చేసేదాకి వెళ్లింది బాధితులకు పూర్తిగా అందచేయడంలో ఎక్కడ వైఫల్యం జరిగింది?
కేటీఆర్‌: వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు. మేము 6.5 లక్షల మందికి రూ.650 కోట్లు వరద సాయం వేగంగా అందజేశాం. అక్కడక్కడా లోపాలు ఉండొచ్చు. ఇక్కడ సమస్య వస్తే స్పందించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? జీహెచ్‌ఎంసీలో గెలిస్తే బాధితులకు రూ.25వేలు చొప్పున ఇస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మేము పరిహారం ఇచ్చిన వారి జాబితా మీకు ఇస్తాం. రూ.25 వేలు చొప్పున ఇవ్వండి. మోకాలు అడ్డం పెట్టి పిచ్చి రాజకీయం చేస్తున్నారు. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా తేలేదు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు ఓట్లు అడుగుతారు. హైదరాబాద్‌లో బీజేపీ అభివృద్ధి నమూనా ఏంటో చెప్పాలి. లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ తెస్తారా? అభివృద్ది కావాలో, అరాచకం కావాలో హైదరాబాద్‌ ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. మా నినాదం విశ్వనగరం.. వారి నినాదం విద్వేష నగరం. ఆరేండ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో ఇప్పుడు మతం పేరిట చిచ్చు పెడుతున్నారు. ఓట్లు, నాలుగు సీట్ల కోసం ఇంతగా దిగజారాలా? బీజేపీ మా మీద చార్జిషీట్‌ విడుదల చేసింది. వాళ్ల మీద లక్ష చార్జిషీట్లు వేయాల్సి వస్తుంది. ఒక్కో ఖాతాలో రూ.15 లక్షలు జమ, నల్లధనం ఎక్కడికి పోయాయి? కేంద్ర ప్రభుత్వ దివాళాకోరు విధానాలతో దేశంలో తొలిసారి ఆర్థిక మాంద్యం వచ్చింది. జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. 

సాక్షి: జీహెచ్‌ఎంసీతో పాటు పరిసర మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఆలోచన ఏదైనా ఉందా?
కేటీఆర్‌ : గ్రేటర్‌ లండన్‌ అథారిటీ, గ్రేటర్‌ టోక్యో అథారిటీ తరహాలో పాలనను వికేంద్రీకరించాలనేది నా వ్యక్తిగత ఆలోచన. ముఖ్యమంత్రి, కేబినెట్‌కు నివేదించి... వారు ఆమోదిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ అథారిటీ ఏర్పాటుపై ఆలోచిస్తాం.

సాక్షి: దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి వల్లే గ్రేటర్‌ ఎన్నికలకు త్వరగా వెళ్లారనే విమర్శ మీపై ఉంది. గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూలు కూడా కేవలం 14 రోజుల్లో ముగుస్తుండటంపై మీరేమంటారు?
కేటీఆర్ ‌: జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం మూడు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆరు నెలల ముందే వెళ్లాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓట్లు వేసేది ఈ ప్రజలే. ప్రజస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లేందుకు భయమెందుకు. మా మీద, ప్రజల మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. డిసెంబర్‌ నాలుగున ఓట్ల లెక్కింపుతో అన్నీ తేలుతాయి. ప్రజల ఆశీర్వాదంతో ఈసారి సెంచరీ సాధిస్తాం. 

సాక్షి : ఇతర పార్టీలకంటే ఎన్నికల సన్నద్దతలో మీరు ముందున్నట్లు కనిపించినా చాలా చోట్ల అభ్యర్థులు మార్చేందుకు కారణమేంటి?
కేటీఆర్ ‌: కేవలం టీఆర్‌ఎస్‌లో మాత్రమే 150 మంది అభ్యర్థులను ఒకేచోట కూర్చోబెట్టి బీ ఫారాలు ఇచ్చే పరిస్థితి ఉంది. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో బీజేపీ ఆఫీసులను ఆ పార్టీ కార్యకర్తలే ధ్వంసం చేశారు. మా పార్టీలో క్రమశిక్షణ ఉంది. అసంతృప్తి ఉన్నా సద్దుమణుగుతుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు కొన్ని చోట్ల సిట్టింగ్‌లను మార్చాల్సి వచ్చింది. 

సాక్షి: దుబ్బాక ఉపఎన్నికలో రెండు జాతీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వాన్ని మోహరించినట్లుగానే మీరు కూడా జీహెచ్‌ఎంసీలో మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జిలు నియమించడాన్ని ఎలా సమర్థించుకుంటారు?
కేటీఆర్ ‌: గత గ్రేటర్‌ ఎన్నికల్లో మేం ఇదే రీతిలో మోహరించాం. ఈసారి కూడా అదే పద్దతిలో మా పార్టీ నేతలు పనిచేస్తున్నారు.

దుర్భిణీలో చూడొద్దు
సాక్షి : గతంలో పార్టీ వెంట ఉన్న యువత దూరమవుతున్న భావన కలగడం లేదా?
కేటీఆర్‌ : మీరు దుబ్బాక ఉప ఎన్నికను దుర్భిణీలో చూస్తున్నారు. గతంలో మహబూబ్‌నగర్‌ ఉపఎన్నికలో గెలిచిన బీజేపీ ఆ తర్వాత చతికిలపడింది. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచి... స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. 2014 తర్వాత టీఆర్‌ఎస్‌ గెలిస్తే వార్త కాదు.. ఓడితే వార్త అన్నట్లుగా పరిస్థితి తయారైంది. సంప్రదాయ పద్ధతుల్లోనే కాకుండా... సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నా. అందుబాటులో ఉంటున్నా.

సాక్షి: గతంలో టీఆర్‌ఎస్‌– కాంగ్రెస్‌ నడుమ ఉన్న ఎన్నికల పోరు ఇప్పుడు టీఆర్‌ఎస్‌– బీజేపీ అన్నట్లుగా మారింది. మీరు కాంగ్రెస్‌ను బలహీనపరచడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా?
కేటీఆర్ ‌: మీతో ఉండటం ఇష్టం లేని వారు ఎటుపోతారనేది వారిష్టం. కాంగ్రెస్‌ అంతర్గత బలహీనతను వేరేవాళ్ల మీద రుద్దడం సరికాదు. కాంగ్రెస్‌ మీద నాయకులకు, ప్రజలకు విశ్వాసం పోయిందనే అభిప్రాయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో మేము మొదటి స్థానంలో ఉంటాం, రెండో స్థానంలో ఎవరుంటారో వాళ్లు తేల్చుకోవాలి.

సాక్షి: మీ పార్టీ అసంతృప్త నేతలతో బీజేపీ మంతనాలు జరపడాన్ని ఎలా చూస్తున్నారు?
కేటీఆర్ : ఒక పార్టీ అసంతృప్తవాదులతో ఇంకొకరు మాట్లాడటం సర్వసాధారణం. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. అసంతృప్తిపై ఆలోచించాలి. అప్పుడప్పుడు మార్పులు జరగడం రాజకీయాల్లో సహజం.


సమాజంలో తక్కువ... సోషల్‌మీడియాలో ఎక్కువ
సాక్షి : రాజకీయ విమర్శలు వ్యక్తిగత దూషణ దాకా వెళ్లడాన్ని ఎలా చూస్తారు?
కేటీఆర్‌ : పత్రికలు, ప్రసారసాధనాల్లో దూషించే వారికే ఎక్కువ స్పేస్‌ వస్తోంది. పెయిడ్‌ వర్కర్స్‌ను పెట్టుకుని బీజేపీ సమాజంలో తక్కువ.. సామాజిక మాద్యమాల్లో ఎక్కువ అన్నట్లుగా తయారైంది. ఈ ఎన్నికల్లో విషం చిమ్మకుండా విషయం చెప్పమనండి. ఎంతసేపూ గుడి, మతం.. ఇదేనా?

సాక్షి : ఎంఐఎంతో గ్రేటర్‌ ఎన్నికల్లో పొత్తు ఉందా?
కేటీఆర్ ‌: ఎంఐఎంకు మేయర్‌ పదవి ఇస్తామనడంలో అర్థం ఉండాలి. జీఎస్టీ వంటి వాటిపై కేంద్రంలో బీజేపీకి మేము అంశాల వారీ మద్దతు ఇచ్చినట్లుగానే,  ఎంఐఎం కూడా మాకు కొన్ని అంశాలపై మద్దతు ఇచ్చింది. ఎన్నడైనా మేము ఎన్నికల్లో కలిసి పోటా చేశామా? గతంలో గ్రేటర్‌ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులపై ఐదు చోట్ల గెలిచాం. ఈసారి మరో ఏడు కలుపుకుని పన్నెండు స్థానాల్లో గెలుస్తాం.

సాక్షి : మీరు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్‌ పదవుల భర్తీలో ఆలస్యమెందుకు జరుగుతోంది?
కేటీఆర్ ‌: నామినేటెడ్‌ పదవుల భర్తీలో జాప్యం జరిగిన మాట నిజమే. ఇటీవల ముగ్గురిని ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేశాం. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని పద్మశాలి, నాయీ బ్రాహ్మణులకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తాం. పార్టీ కోసం కష్టపడే వారికి నామినేటెడ్‌ పదవుల ద్వారా గౌరవం, గుర్తింపు ఇస్తాం.

పెద్ద పదవేదీ ఖాళీగా లేదు
సాక్షి : గ్రేటర్‌ ఎన్నికల్లో మీ పార్టీ భారీ విజయం సాధిస్తే మీరు మరో పెద్ద పదవిలోకి వెళ్తారనే ప్రచారం వినిపిస్తోంది?
కేటీఆర్ ‌: పెద్ద పదవులేవీ ఖాళీగా లేవు. నాకున్న బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నా. కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజలు ముందుకు వెళ్తున్నాం. ఆయన నాయకత్వం రాష్ట్రానికి మరో పది పదిహేనేళ్లు అవసరం ఉంది. ఈ విషయంలో చర్చ, ఊహాగానాలు అవసరం లేదు. 

సాక్షి : జీహెచ్‌ఎంసీని పూర్తిగా అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారన్న విమర్శపై మీరేమంటారు?
కేటీఆర్ ‌: ఆరేళ్ల కాలంలో జీహెచ్‌ఎంసీకి ఏమేమి చేశామో మేము ప్రగతి నివేదిక సమర్పించాం.. ఆరున్నరేళ్ల కాలంలో కేంద్రం హైదరాబాద్‌కు ఏమి చేసిందో బీజేపీ చెప్పాలి. అదికాకుండా బురద రాజకీయం చేస్తోంది, విద్వేషాలను రెచ్చగొడుతోంది. వారు ఏమి చేశారో... ఏమి చేస్తారో చెప్పకుండా పనికి మాలిన రాజకీయం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement