somajiguda press club
-
జర్నలిస్టులకు వ్యాక్సినేషన్: సీఎంకు ప్రెస్‌క్లబ్ కృతజ్ఞతలు
పంజగుట్ట: రాష్ట్రంలోని అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఈ నెల 28, 29 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి, ప్రధానకార్యదర్శి రాజమౌళిచారిలు స్వాగతించి, కృతజ్ఞతలు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ యూనియన్ కార్యాలయం, ఎంసీహెచ్ఆర్డీ, చార్మినార్ యునానీ ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. చదవండి: Corona Vaccine: సూపర్ స్ప్రెడర్స్‌కు టీకా ఇలా -
ఎలాంటి తెలంగాణ కావాలో తేల్చుకోండి
సాక్షి, హైదరాబాద్ : ‘‘తెలంగాణలో కొందరు విద్వేషపు విత్తనాలు నాటుతూ మత సామరస్యం దెబ్బతీసే విధంగా ప్రయ త్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా మత కలహాలు, బాంబు పేలుళ్ల వంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుంది. తెలంగాణకు ఆర్థిక యంత్రంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విద్వేషంతో నిండిన హైదరాబాద్ కావాలో లేక విజ్ఞతతో ఆలోచించే తెలంగాణ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. ‘హమారా హైదరాబాద్’ అంటూ నగరాన్ని కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము గల్లీ పార్టీ.. వారిది ఢిల్లీ పార్టీ.. ఈ రెండింటిలో ఏది కావాలో ప్రజలు తేల్చుకోవాలి’’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో కేటీఆర్ మాట్లాడారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తామనే బీజేపీ నేతల ప్రకటనలపై స్పందిస్తూ అక్కడ కేసీఆర్ జాతీయ జెండా ఎగరేస్తారని, తాము మాత్రం బల్దియాపై గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తాము సవాళ్లు విసరబోమని, విపక్షాలు సవాలు చేస్తే స్పందిస్తామన్నారు. ‘‘గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని నేనే గెలిపించాలనే భ్రమల్లో లేను. పెద్ద లీడర్‌ను అనుకోవడం లేదు. కేసీఆర్ రూపంలో మాకు సమర్థుడైన నాయకుడు ఉన్నారు. నా పొజిషన్‌తో సంతృప్తిగా ఉన్నా. నాకు వేరే ఏమీ అవసరం లేదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మహిళా కార్పొరేటరే మేయర్... ‘‘గ్రేటర్ ఎన్నికల్లో మాకు ఎవరితోనూ దోస్తీ లేదు. గత ఎన్నికల్లో 150 డివిజన్లలో పోటీ చేసి పాతబస్తీలోఎంఐఎం అభ్యర్థులపై ఐదు చోట్ల గెలుపొందాం. ఈసారి పాతబస్తీలో పది స్థానాల్లో ఎంఐఎంపై విజయం సాధిస్తాం. మజ్లిస్ పార్టీకి మేయర్ పదవి ఇస్తామని కొందరు చెబుతున్నారు. మాకేమైనా పిచ్చా.. ఎందుకిస్తాం? గతంలో 99 స్థానాల్లో గెలిచి మేయర్ పీఠాన్ని సాధించుకున్నాం. డిసెంబర్ 4న టీఆర్ఎస్కు చెందిన మహిళా కార్పొరేటర్ మేయర్ అవుతారు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘దుబ్బాకలో ఓటమి ఒలికిపోయిన పాల లాంటివి. వాటి గురించి ఆలోచించదలుచుకోలేదు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. గతంలోనూ బీజేపీ మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో గెలిచినా మళ్లీ విజయం సాధించలేదు. కానీ టీఆర్ఎస్ 2014 నుంచి ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది. అయినా కొందరు మా అపజయాన్నే వార్తగా పైశాచిక ఆనందం పొందుతున్నారు. మేము ఎవరి బీ–టీం కాదు. అంతర్గత కారణాలతోనే కాంగ్రెస్ బలహీనమైంది. గ్రేటర్ ఎన్నికల్లో రెండో స్థానంలో ఎవరుంటారో బీజేపీ, కాంగ్రెస్ తేల్చుకోవాలి. మేము మాత్రం ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతూ ప్రచారంలోకి వెళ్తాం. గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. గ్రేటర్ మేనిఫెస్టోపై సరైన సమయంలో స్పందిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీకి తెలిసింది విద్వేషాలు సృష్టించడమే... ‘‘కేంద్ర ప్రభుత్వ పనితీరు వల్లే లాక్డౌన్ తర్వాత దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. కేంద్రం ఓ మిథ్య. ఆరేళ్లుగా తెలంగాణ నుంచి రూ. 2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో సమకూరినా రాష్ట్రానికి మాత్రం రూ. 1.40 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. వరదలతో హైదరాబాద్ నష్టపోయినా కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు. దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదు. వాళ్లకు తెలిసింది ఒకటే విద్య.. హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్, ఎంఐఎం–టీఆర్ఎస్ అనే పిచ్చిమాటలతో విద్వేషాలు సృష్టించడం’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. 70 ఏళ్లుగా నాలాలు, చెరువుల ఆక్రమణల వల్లే హైదరాబాద్‌లో వరద నష్టం జరిగింది. వరదల బారిన పడిన కాలనీలకు చెందిన 6 లక్షల మందికి ఇప్పటికే రూ. 650 కోట్ల మేర ఆర్థిక సాయం చేశాం. మరికొందరు అర్హులకు జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సాయం అందిస్తాం. ఎల్ఆర్ఎస్ విషయంలో కేంద్రం చేసేదేమీ లేదు. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకొనేది సీఎం కేసీఆర్ మాత్రమే. స్థిరా>స్థికి పాస్‌బుక్ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కోటి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది’’ అని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులకు అయస్కాంతంలా హైదరాబాద్.. ‘తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న అపోహలను తొలగించి రాష్ట్రం, హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆరే. ఆరేళ్లలో ఎవరితోనూ మేము గిల్లికజ్జాలు పెట్టుకోలేదు. ఆరేళ్లుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. పెట్టుబడులకు హైదరాబాద్ అయస్కాంతంలా మారింది. నిరంతర విద్యుత్, స్వచ్ఛ హైదరాబాద్, శానిటేషన్‌లో హైదరాబాద్ దేశానికి రోల్ మోడల్‌గా ఉంది. చెత్త నుంచి 63 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. రూ. 1,800 కోట్లతో సమగ్ర రోడ్డు ప్రణాళిక, 8 వేల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాం. నాలాల ఆక్రమణల తొలగించేలా గ్రేటర్ ఎన్నికల తర్వాత సమగ్ర చట్టం తెస్తాం. హైదరాబాద్‌లో గత ఆరేళ్లలో రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశాం. రెండు, మూడు రోజుల్లో నయాపైసాతో సహా లెక్కలు చెప్తాం. మేము చెప్పేది అబద్ధమైతే శిక్షించండి. నిజమైతే ఆశీర్వదించండి’’ అని కేటీఆర్ కోరారు. గ్రేటర్లో సీఎం ప్రచార సభ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజమౌళిచారి, సూరజ్, రవికాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పండి: మంత్రి కేటీఆర్
-
నీకు మాత్రం పోలీస్ భద్రత ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటన యావత్తు దేశాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసిందని బీజేపీ మహిళ నాయకురాలు డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ నిర్భయ ఘటన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకురాలు డీకే అరుణ, మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, మహిళ మోర్చా నేతలు హాజరయ్యారు. ఓ వైపు మహిళా సాధికారత కోసం పరుగులు తీస్తుంటే మరోవైపు ఎందరో అమాయక మహిళలు బలైపోతున్నారని ఆందోళన చెందారు. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారని, అన్ని రంగాల్లో వెక్కిలి మాటలు, వెర్రి చేష్టలు ఎక్కువయ్యయన్నారు. సంస్కారం నేర్పని చదువులు ఎందుకని నిలదీశారు. చదువు లేదనో, కులం తక్కువనో, వెనుకబడ్డ వారు అన్న ఉద్దేశ్యంతో ఇలాంటి ఘటనలు చేసిన వారిని పాపం అనకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసింది ఎవరైనా నిందితులకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. కొన్ని రోజులు బాధపడి ఆ తర్వాత తేలిగ్గా తీసుకోవడం సరికాదన్నారు. అలాగే.. దిశ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం, కనీసం పలకరించకపోవడం దారుణమన్నారు. మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని, హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ వ్యాఖ్యలు దారుణమన్నారు. ఇంటికో పోలీస్‌ను పెట్టాలా అని తలసాని అంటున్నారు. నీ ఇంటి చుట్టూ అయితే 100 మంది పోలీసులు ఉండాలా అని ప్రశ్నించారు. అవసరం ఉన్న చోట ఒక్క పోలీసు కూడా ఉండరని విమర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడే తీరిక కూడా కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. ‘నిందితులకు శిక్ష పడాలి అంటే చేయాల్సింది ట్వీట్ కాదు. న్యాయం జరగాలి అంటే సమస్య తీవ్రత వివరించాలి’ అంటూ కేటీఆర్‌ను ఉద్ధేశించి హితవు పలికారు. వరంగల్‌లో జరిగిన న్యాయం చాలా రోజులు గుర్తున్నాయని ఆమె తెలిపారు. చట్టాలు సవరించాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రుల పెంపకంలోనూ మార్పు రావాలని డీకే ఆరుణ సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మహిళ కమిషన్ లేకపోవడం దారుణమని బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి మాట్లాడిన మాటలు సిగ్గుచేటని అన్నారు. చదవండి : ప్రియాంక చిన్న పొరపాటు వల్లే: మహమూద్ అలీ మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం: గీతారెడ్డి -
‘కర్రు కాల్చి వాత పెడతారు జాగ్రత్త..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఎయిర్‌బస్‌పై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదని విమర్శించారు. ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈస్ట్‌మన్ కలర్ సినిమా చూసిస్తున్నారని మండి పడ్డారు. సీఎం ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 1200 మంది ఉద్యోగులే ఉన్నారన్న కేసీఆర్ ప్రకటన రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ చేస్తే.. కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్తామని.. కర్రు కాల్చి వాత పెట్టే సందర్భం వస్తుందని రావుల హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు: తమ్మినేని ఆర్టీసీ సమ్మెకు సీపీఎం పూర్తి మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష సమావేశానికి హాజరైన తమ్మినేని ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌కు పాలేర్లు కాదని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె నూటికి నూరు శాతం జయప్రదమవుతున్న సమ్మె అని స్పష్టం చేశారు. సమ్మెకు మద్దతు తెలపడానికి టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ మాటలు ఆయన అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మండి పడ్డారు. -
‘మా బిడ్డను ఆదుకోండి’
సాక్షి, పంజగుట్ట: కేన్సర్‌తో బాధపడుతున్న తన ఒక్కగానొక్క కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఓ నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఏడేళ్ల వయసులో ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారి ఎముకల కేన్సర్‌తో అవస్థలు పడుతుండడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికే ఉన్న ఒక్క ఎకరం భూమి అమ్మి, అప్పులు చేసి వైద్యం చేయించామని వారు తెలిపారు. వైద్యులు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స చేయాలని చెబుతున్నారని, అందుకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు తమ గోడు వెల్లబోసుకున్నారు. వివరాలు.. తాండూర్లోని బక్నారం గ్రామానికి చెందిన వర్రె రాజేందర్‌రెడ్డి, మల్లేశ్వరి దంపతులు. వీరు బతుకుదెరువు నిమిత్తం పటాన్చెరు పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో నివసిస్తున్నారు. రాజేందర్‌రెడ్డి సెక్యూరిటీ గార్డు కాగా.. మల్లేశ్వరి స్వీపర్‌గా పని చేస్తోంది. వీరికి మదన్‌రెడ్డి (7) కొడుకు ఉన్నాడు. మదన్‌రెడ్డి పుట్టిన సంవత్సరానికే అనారోగ్యం పాలయ్యాడు. స్థానికంగా చికిత్స చేయిస్తూ ఉండడంతో మదన్‌రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. 2016లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించగా బోన్ కేన్సర్ అని తేలింది. చికిత్సకు రూ.30 లక్షలు ఖర్చవుతాయని సిటిజన్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. -
టీఆర్ఎస్ మేనిఫెస్టోకు విలువ లేదు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మాదిగలను చిన్న చూపు చూస్తున్నదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు.బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు ఎవరు వచ్చినా మా నిరసన తెలియజేస్తామని వెల్లడించారు. కేసీఆర్ నిండు సభలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మాదిగ, హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు చనిపోయి 10 నెలలు అయింది.. ఇప్పటి వరకు ఆమె కుటుంబానికి ఇస్తానన్న రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ..‘ కేసీఆర్ అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతా అన్నారు. 10 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకూ ఊసే లేదు. కేసీఆర్ మాటాల మనిషి..చేతల మనిషి కాదు. సామాజిక వర్గాల కోణంలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు. పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలి. మాదిగలు చేసే కులవృత్తుల్లో లెదర్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏంచేయలేదు. చెప్పులు కుట్టే కార్మికులకు పింఛన్ ఇచ్చారా? డప్పులు కొట్టే కార్మికులకు పింఛన్ ఇచ్చారా? కేసీఆర్ ప్రభుత్వంలో అవమానకరంగా భర్తరఫ్ చేసింది ఒక్క మాదిగ సామాజికవర్గానికి చెందిన రాజయ్యనే. రామగుండం మేయర్ మాదిగ కాబట్టే కావాలని అతడిపై అవిశ్వాసం పెట్టారు. మాదిగ సామాజిక వర్గానికి స్థలం లేదు..భవనం లేదు. మాదిగ వర్గంపై వివక్ష చూపెడుతున్నా’రని విమర్శించారు. ‘దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ?. మంత్రివర్గంలో మాదిగలకు నిజమైన ప్రాతినిథ్యం లేదు. టీఆర్ఎస్లో ఉన్న 16 మంది దళిత ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. దళితులకు ఒక శాతం కూడా భూపంపిణీ జరగలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారా? టీఆర్ఎస్ మేనిఫెస్టోకు విలువ లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు స్థానం లేకుండా చేశారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు పోరాడారు. వారిని ప్రభుత్వం గుర్తించడం లేదు. తెలంగాణ మహిళలకు అవమానం మిగిలింది..గౌరవం దక్కలేద’ని టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. నవంబర్ 6న ప్రజాగ్రహ సభ ఉంటుందని, టీఆర్ఎస్, బీజేపీ మినహా అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా మంద కృష్ణ తెలిపారు. -
మాపార్టీ నుంచి పోటీ చేసేవారు సంప్రదించవచ్చు
హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని, అలాగే మా పార్టీ నుంచి పోటీ చేసే వారు సంప్రదించవచ్చునని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. సోమాజీ గూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పుడు మా ముందున్న లక్ష్యం పార్టీని బలోపేతం చేయడమేనని వ్యాఖ్యానించారు. వికాలాంగుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలి.. అలాగే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా పార్టీకి సంబంధించి మహిళా విభాగాన్ని కూడా విస్తరిస్తామని చెప్పారు. గ్రామాలను సస్యశ్యామలం చేయడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. కేరళలో గ్రామ పంచాయతీలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు. జనసమితికి అప్లికేషన్ పెట్టుకోవచ్చునని, సభ్యత్వ నమోదు చేసుకోవచ్చునని, ఆన్లైన్లో కూడా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఉంచుతామని తెలిపారు. తెలంగాణ జన సమితి పార్టీ జిల్లాల ఇంఛార్జుల ఎంపిక జరుగుతోందని, పార్టీ ప్రతీ పల్లెకు చేరాలనే లక్ష్యంగా ఈ ప్రణాళిక ఉంటుందని వివరించారు. -
మీడియాపై దాడికి పాత్రికేయుల ఖండన
హైదరాబాద్: మీడియాపై దాడిని పాత్రికేయ సంఘాలు ఖండించాయి. మీడియాపై దాడిని నిరిసిస్తూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాక్షి దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఐజేయూ నేత దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు టీ న్యూస్ చానెల్‌కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. -
ఇక పిల్లుల వయ్యారాలు
డాగ్ షోస్ ఓకే..! వాటి వయ్యారి నడకలు సిటీకి కొత్తేమీ కాదు. మరి దాదాపు ప్రతి ఇంట్లో కామన్ అయిన పిల్లుల మాటేమిటి! అలా అలా తమ సొగసిరులను ఒలికించి మురిపించేందుకు తమకూ ఓ వేదిక కావాలనుకోవూ! అదే ఆలోచన వచ్చినట్టుంది మార్స్ ఇంటర్నేషనల్, ఇండియన్ క్యాట్ ఫెడరేషన్, వరల్డ్ క్యాట్ ఫెడరేషన్లకు. అందుకే సిటీలో తొలిసారిగా ‘ఇంటర్నేషనల్ క్యాట్ షో ఆఫ్ ఇండియా’ నిర్వహించేందుకు రెడీ అయిపోయాయి ఈ సంస్థలు. ఈ నెల 8 ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ షో వివరాలను ఇండియన్ క్యాట్ ఫెడరేషన్, మార్స్ ప్రతినిధులు నాయర్, ఉమేష్ బుధవారం వెల్లడించారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ... ఇంతకుముందు బెంగళూరు, ముంబైల్లో ఈ పోటీలు జరిగాయన్నారు. సిటీలో ఇదే తొలిసారని, ఆరు విభాగాల్లో పోటీలుంటాయని చెప్పారు. వంద పిల్లులకు మాత్రమే ఈ షోలో పోటీపడే అవకాశం ఉంది. పోటీ రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా విదేశీ పిల్లులను ప్రదర్శించారు. ప్రవేశం ఉచితం. వివరాలకు www.indiancatfederation.org లో సంప్రదించవచ్చు. - పంజగుట్ట -
మాదిగలపై కేసీఆర్ వివక్ష
‘మీట్ ది ప్రెస్’లో మంద కృష్ట మాదిగ ఆరోపణ పంజగుట్ట: ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగ సామాజిక వర్గంపై కక్ష పూనారని, అందుకే రాజయ్యను మంత్రి వర్గం నుంచి బర్త్ చేసి పగ తీర్చుకున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణల వల్ల ఓ మంత్రిని బర్త్రచేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటే కేసీఆర్ ప్రభుత్వంపై కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వెంటనే గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్త్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మంత్రివర్గంలో ఉన్న కేటీఆర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిపై కూడా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మరి వారినెందుకు ఉపేక్షిస్తున్నారని మంద కృష్ణ ప్రశ్నించారు. కేవలం దళితుడైనందుకే రాజయ్యను తొలగించారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మూడుసార్లు పర్యటించి, మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం నిద్రించి, అక్కడి సమస్యలు తెలుసుకుంటూ మంచి పేరు సంపాదిస్తున్న రాజయ్యపై కక్షగట్టే మంత్రి వర్గం నుంచి తొలగించారన్నారు. ఇకపై కేసీఆర్‌ను వెంటాడుతాం, వే టాడుతామని, రాజకీయంగా పగతీర్చుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళకు కూడా కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. సొంత ప్రాంతం వాడే మోసం చేస్తే ఆ ప్రాంతంలోనే పూడ్చేయాలన్న కాళోజీని ఆదర్శంగా తీసుకొని కే సీఆర్‌పై మరో ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు రాజయ్య బర్త్ఫ్, మంత్రి వర్గంలో 50 శాతం మహిళలకు ఇవ్వాలనే డిమాండ్‌తో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. 16 నుంచి ఏప్రిల్ 3 వరకు అన్ని మండల కేంద్రాల్లో దండయాత్ర, ఏప్రిల్ 4న లక్షలాది మందితో ఇందిరాపార్కు నుంచి కేసీఆర్ ఇంటి వరకు దండయాత్ర చేపడతామని చెప్పారు. మార్చి 7న జిల్లా కేంద్రాల్లో, 8న మండల కేంద్రాల్లో ధర్నలు కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రవికాంత్, షాబుద్దీన్, మహేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
చుండూరు తీర్పు రాజ్యాంగ విరుద్ధం: తారకం
సాక్షి, హైదరాబాద్: చుండూరు తీర్పు రాజ్యాంగానికి, చట్టాలకు వ్యతిరేకమని చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం అన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యాయస్థానాలు.. ప్రజలకు జవాబుదారీతనం వహించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తులకు సోమవారం విజ్ఞాపన పత్రాలిచ్చేందుకు వెళ్తే ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా గేట్లు మూయించారన్నారు. ప్రజలంటే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ, అహంకార పూరితంగా వ్యవహరించిన న్యాయువుూర్తుల తీరును పోరాట కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చుండూరు ఘటనలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంత న్యాయ విరుద్ధంగా ఉందో బయట పడుతుందనే న్యాయమూర్తులు విజ్ఞాపన పత్రాన్ని తీసుకోలేదన్నారు. -
నోటుకు ఓటును అమ్మొద్దు: శివాజీ
హైదరాబాద్: ఓటు అనేది జీవితం అని... ఆ జీవితాన్ని డ బ్బు కోసం నాశనం చేసుకోవద్దని ప్రముఖ సినీ నటుడు శివాజీ అన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ఓటుకోసం డబ్బు ఇచ్చేందుకు వస్తే చెప్పుతో కొట్టండని ఆయన పిలుపునిచ్చారు. డబ్బు కోసం మన భవిష్యత్తు, మనపిల్లల, మన ఊరి భవిష్యత్తును నాశనం చేయవద్దన్నారు. నిత్యం తమ సొంత నియోజక వర్గాలను వదిలి హైదరాబాద్‌లో ఉండే రాజకీయ నాయకులు నామినేషన్ వేసిన ప్రస్తుత తరుణంలో ఇక్కడ ఉండగలరా అని ప్రశ్నించారు. సోమాజీగుడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడారు. తనకు ఓ విద్యార్థి లేఖరాసాడని చెప్పారు. ‘తన సోదరుడు ఓ పెద్దమనిషి వద్ద పనిచేస్తుంటాడని.. ఆ పెద్దమనిషి ఎన్నికలు సమీపిస్తుండడంతో తన ఇంట్లో రూ. 1000, 500, 100 దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడని.. ఆ నోట్లు ఓటర్లకు పంచేందుకేనని గ్రహించిన తన సోదరుడు అక్కడి నుంచి పారిపోయాడని.. ఇంటికి వస్తే తనను చంపుతారని.. అందుకే ఇంటికి రానని అంటున్నాడని’ ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. జనాన్ని మోసం చేసేందుకు నాయకులు మళ్లీ వస్తున్నారని వారి నుంచి ప్రజల్ని కాపాడాలన్న విద్యార్థి ఆవేదనను వివరించారు. ప్రజలు డబ్బులు తీసుకుని ఓటు వేయకూడదని కోరారు. ఏ రాజకీయ నాయకుడైనా డబ్బులు ఇచ్చేందుకు వస్తే ఫోన్లో రికార్డింగ్ చేసి ఈసీకి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ప్రజలకు ఎవరు సేవచేస్తారో వారికే ఓటు వేయాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీన తెలంగాణలో, ఎన్నికలకు రెండు రోజుల ముందు సీమాంధ్రలో డబ్బు తీసుకుని ఓటు వేయకూడదని కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
విశాలాంధ్ర మహాసభ ప్రెస్ కాన్ఫరెన్స్ రసాభాస
సాక్షి, హైదరాబాద్: విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో బుధవారమిక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. ఈ సందర్భంగా కొందరు విలేకరులు, మహాసభ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత మహాసభ ప్రతినిధి రవితేజ మాట్లాడుతుండగా కొందరు విలేకరులు ప్రశ్నలేశారు. ప్రసంగం పూర్తయ్యాక జవాబిస్తానని ఆయన చెప్పగా.. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతే విలేకరుల సమావేశం ఎందుకు పెట్టారంటూ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ విశాలాంధ్ర ప్రతినిధులు ప్రసంగాలు కొనసాగించారు. ఈలోగా విశాలాంధ్ర మహాసభకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి గతంలో లిక్కర్ మాఫియా కేసులో ఉన్నాడని కొందరు విలేకరులు వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. ప్రశ్న అడిగిన విలేకరిని విశాలాంధ్ర ప్రతినిధులు మీదే పత్రికో చెప్పాలని అడిగారు. ‘మాది ఏ పత్రికైతే మీకెందుకు.. అడిగిన ప్రశ్నకు జవాబివ్వండి’ అంటూ అదేస్థాయిలో నిలదీయడం.. ఈ క్రమంలో ఆ విలేకరులు, నిర్వాహకుల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకుని ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులను ప్రెస్‌క్లబ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. అంతకుముందు విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, ప్రతినిధి రవితేజలు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సమైక్యత యాత్ర చేపట్టామని, ఇందులోభాగంగా రెండున్నరవేల కిలోమీటర్లు తిరిగామని, లక్షలాది మందిని కలిశామని చెప్పారు. రెండు విడతల యాత్ర విజయవంతమైందని, అయితే మూడోవిడత యాత్ర కొనసాగించేందుకు ప్రభుత్వం సహకరించట్లేదని, అనుమతివ్వట్లేదని ఆక్షేపించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు నకిలీ రాజీనామాలతో ప్రజల్ని మోసగిస్తున్నారని తప్పుపట్టారు. తక్షణం వారు రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు వెంకటేశ్వర్, శ్రీనివాస్‌రెడ్డి, రామజోగయ్య తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి మాట్లాడుతూ.. తమ ఆహ్వానం లేకుండా వచ్చిన విలేకరులే సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని విమర్శించారు.