నోటుకు ఓటును అమ్మొద్దు: శివాజీ
హైదరాబాద్: ఓటు అనేది జీవితం అని... ఆ జీవితాన్ని డ బ్బు కోసం నాశనం చేసుకోవద్దని ప్రముఖ సినీ నటుడు శివాజీ అన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ఓటుకోసం డబ్బు ఇచ్చేందుకు వస్తే చెప్పుతో కొట్టండని ఆయన పిలుపునిచ్చారు. డబ్బు కోసం మన భవిష్యత్తు, మనపిల్లల, మన ఊరి భవిష్యత్తును నాశనం చేయవద్దన్నారు. నిత్యం తమ సొంత నియోజక వర్గాలను వదిలి హైదరాబాద్‌లో ఉండే రాజకీయ నాయకులు నామినేషన్ వేసిన ప్రస్తుత తరుణంలో ఇక్కడ ఉండగలరా అని ప్రశ్నించారు.
సోమాజీగుడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడారు. తనకు ఓ విద్యార్థి లేఖరాసాడని చెప్పారు. ‘తన సోదరుడు ఓ పెద్దమనిషి వద్ద పనిచేస్తుంటాడని.. ఆ పెద్దమనిషి ఎన్నికలు సమీపిస్తుండడంతో తన ఇంట్లో రూ. 1000, 500, 100 దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడని.. ఆ నోట్లు ఓటర్లకు పంచేందుకేనని గ్రహించిన తన సోదరుడు అక్కడి నుంచి పారిపోయాడని.. ఇంటికి వస్తే తనను చంపుతారని.. అందుకే ఇంటికి రానని అంటున్నాడని’ ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. జనాన్ని మోసం చేసేందుకు నాయకులు మళ్లీ వస్తున్నారని వారి నుంచి ప్రజల్ని కాపాడాలన్న విద్యార్థి ఆవేదనను వివరించారు.
ప్రజలు డబ్బులు తీసుకుని ఓటు వేయకూడదని కోరారు. ఏ రాజకీయ నాయకుడైనా డబ్బులు ఇచ్చేందుకు వస్తే ఫోన్‌లో రికార్డింగ్ చేసి ఈసీకి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ప్రజలకు ఎవరు సేవచేస్తారో వారికే ఓటు వేయాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీన తెలంగాణలో, ఎన్నికలకు రెండు రోజుల ముందు సీమాంధ్రలో డబ్బు తీసుకుని ఓటు వేయకూడదని కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.