స్పీకర్ పదవికి వన్నె తేవడమే లక్ష్యం
- అసెంబ్లీ సమావేశాల పొడిగింపు నిర్ణయం ప్రభుత్వానిదే: కోడెల
గుంటూరు : నిష్పక్షపాతంగా వ్యవహరించడం ద్వారా పదవికి వన్నె తేవడమే లక్ష్యమని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరులో ఆదివారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ మీట్ ద ప్రెస్’ కార్యక్రమానికి ఆయన హాజరై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో శాసనసభ సమావేశాల పొడిగింపుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నిరసన తెలుపుతున్నామనిగానీ, వాకౌట్ చేస్తామని గానీ అనకపోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షం సభకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పోలవరం పూర్తికి నాలుగైదేళ్లు పడుతుందని, అందువల్ల ఎత్తిపోతల ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సత్తెనపల్లిలో ఇప్పటికే 22 వేల మరుగుదొడ్లు నిర్మించి రికార్డు సృష్టించామన్నారు. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, ట్రెజరర్ శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.