వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఏపీలోనే
నిర్మాణాలు పూర్తికాకపోయినా
సీఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లు: స్పీకర్ కోడెల
సాక్షి, హైదరాబాద్: శాసనసభా సమావేశాలను సెప్టెంబర్ చివరి వారంలో ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించనున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. గత సమావేశాలనే ఏపీలో నిర్వహించాల్సి ఉందని, కానీ సాధ్యపడలేదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం శాసనసభా ప్రాంగణంలోని అంబేడ్కర్, గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభా, మండలి సమావేశాలు ఏపీలో నిర్వహించేందుకు అవసరమైన పనులు వేగంగా జరగడం లేదన్నారు.
అయినా సరే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్కడే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అనుకున్న దానికన్నా జీడీపీ సాధించామని, ఇంకా సాధించాల్సి ఉందని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలు పెరగాలని, కులమతాలకతీతంగా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి సాధించాలని కోరారు.