గుంటూరు : పభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సిన సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 600మంది వైద్యులకు చార్జి మెమో జారీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం గుంటూరులో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం (ఏపీజేఎఫ్) నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చార్జిమెమోతోపాటు మూడు ఇంక్రిమెంట్ల కోత విధించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో మిస్‌మ్యాచింగ్ పోస్టులు లేకుండా సరిచేశామని, డిప్యూటేషన్‌లు ప్రభుత్వానికి అవసరమైతే తప్ప వ్యక్తులకు అవసరమైతే ఇవ్వబోమని స్పష్టం చేశారు. బదిలీలపై నూతన పాలసీని రూపొందించామని, త్వరలోనే అమలు చేస్తామన్నారు. అనధికారికంగా విధులకు డుమ్మా కొడితే సహించేది లేదని, గైర్హాజరు ఏడాది కాలం దాటితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. వైద్యులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి విధులకు హాజరుకావాలన్నారు.
నర్సింగ్ హోమ్‌లు పెట్టుకుని ప్రభుత్వ హాస్పిటల్‌కు రాకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు ముగిశాక క్లినిక్‌కు వెళ్లవచ్చని, ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఆరోగ్య మిత్రలను ఏడాదికోసారి అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకుని ఏడాది పూర్తయిన పిదప రెన్యూవల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నవారి కాంట్రాక్టు 2015 డిసెంబర్‌తో ముగిసిందన్నారు. గతంలో మెడికల్ నాలెడ్జి లేకుండా డిగ్రీ అర్హతతో ఆరోగ్య మిత్రల నియామకాలు చేశారని, కనీస పరిజ్ఞానం లేకుండా ఉంటే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్ అర్హత ఉన్న ఆరోగ్యమిత్రలను తిరిగి కొనసాగిస్తామని మంత్రి కామినేని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది నర్సులు, 500 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటున్నామని, వారం రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలకు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులను క్లినికల్ అటాచ్‌మెంట్ కోసమే ఇస్తున్నామని తెలిపారు. ప్రైవేటు కళాశాలలవారు ఒక్క రూపాయి కూడా రోగుల నుంచి వసూలు చేయరని, ఐదేళ్లు క్లినికల్ పీరియడ్ పూర్తికాగానే వైద్య పరికరాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రికి ఇచ్చి వెళ్లిపోతారని వెల్లడించారు. వారి కళాశాలల్లో ప్రభుత్వ కోటా కింద 50 శాతం సీట్లు కూడా వస్తాయని మంత్రి చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం.వంశీకృష్ణ, కోశాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
'ఏపీలో 600 మంది వైద్యులకు చార్జి మెమో'
Published Thu, Jan 21 2016 6:57 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement