మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతున్న చాడ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ విఫలమైందని, ప్రజల్లో కేసీఆర్‌పై నెలకొన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో సైలెంట్ స్వీప్‌గా వస్తోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్య విలువ లు మృగ్యమైపోయాయని, భావప్రకటనా స్వేచ్ఛకు, పౌరహక్కులకు భంగం కలిగిందని ఆరోపించారు. విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష, నియంతృత్వ విధానాల అమలు వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూజేఎఫ్) సోమవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో చాడ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన నిరుద్యోగ యువత కు ఉద్యోగాలు భర్తీచేయకుండా చిన్నచూపు చూశారన్నారు. సీట్ల సర్దుబాటులో జాప్యం జరిగినా కూటమి ఏర్పడ్డాక కాంగ్రెస్‌కు మంచి ఊపు వచ్చిందన్నారు.
ప్రజా ఫ్రంట్‌లో చేరికపై పార్టీదే నిర్ణయం
ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో సీపీఐ చేరికపై పార్టీదే తుది నిర్ణయమని చాడ తెలిపారు. వామపక్ష ఐక్యతను దెబ్బతీసే విధంగా సీపీఎం వ్యవహరించడమే కాకుండా తాము కలిసి రాలేదని ఆపార్టీ ఆరోపిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకోలేమంటోన్న సీపీఎం జాతీయ స్థాయిలో మాత్రం రాహుల్ గాంధీతో వేదిక పంచుకుంటోందని, ఇది దేనికి సంకేతమో ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment