- ‘మీట్ ది ప్రెస్’లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్
సాక్షి, బెంగళూరు : మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై బీజేపీలోని సభ్యులకే ఏకాభిప్రాయం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ పేర్కొన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు హరిప్రసాద్ సమాధానమిచ్చారు.
బీజేపీ వికాస పురుషుడని చెప్పుకుంటున్న వాజ్‌పేయి, లోహ పురుషుడని చెప్పుకుంటున్న అద్వానీలను ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీ పక్కకు పెట్టేసిందని, ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే నరేంద్రమోడీ పరిస్థితి కూడా అదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్‌లో 2003 వరకు బీజేపీ ఓడిపోతూనే వచ్చిందని, గోద్రా ఘటన తర్వాత మొదటి ఎన్నికలను మతవాదం పేరిట, రెండోసారి గుజరాత్ ఆత్మాభిమానం పేరిట, మూడోసారి అభివృద్ధి పేరు చెప్పుకొని మోడీ గెలిచారని అన్నారు.
రెతుల దగ్గర నుంచి వేల ఎకరాలను బలవ ంతంగా లాక్కొని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచామని చెప్పుకుంటున్న మోడీకి అవినీతి, పాలనాలోపాల గురించి మాట్లాడే నైతికతే లేదని హరిప్రసాద్ విమర్శించారు.