2014లోగా విభజన జరగదు!
సాక్షి, హైదరాబాద్: 2014 లోగా రాష్ట్ర విభజన జరగదని రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లును ప్రవేశపెట్టే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రం రూపొందించిన ముసాయిదా బిల్లును శాసనసభలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తే విభజన బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటుకు పంపరనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర విభజనలో భాగస్వామి కాదల్చుకోకనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనుకోవడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఓ హోటల్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో ఉండవల్లి పాల్గొన్నారు. ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెవుల కృష్ణాంజనేయులు, ఎం.వంశీకృష్ణ, సలహాదారులు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆర్‌ఎం బాషా, కందుల రమేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విభజన నేపథ్యంలో 371 (డి) అధికరణను రద్దు చేయడం అనివార్యమా? కాదా? అనే దానిపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. విభజన ముసాయిదా బిల్లుపైఅసెంబ్లీ అభిప్రాయం తప్పనిసరి. మెజారిటీ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తే రాష్ట్రపతి పాత్ర కీలకమవుతుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఈ నెల 23న రాష్ర్టపతిని తనతోపాటు 40 మంది నాయకులు కలవబోతున్నామన్నారు. రాష్ట్రం విడిపోతే కోస్తాకు వచ్చిన నష్టమేమీ లేద ని, తెలంగాణకే వెయ్యి రెట్ల ఎక్కవ నష్టం జరుగుతుందని ఉండవల్లి అన్నారు. రాయలసీమ ఎడారైపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది. అయినా సీమాంధ్రోళ్లు దోపిడీదారులు అంటే ఒప్పుకునేది లేదన్నారు. కాంగ్రెస్‌కు దత్తపుత్రుడు దొరికినందు వల్లే పార్టీ తమను పట్టించుకోవడం లేదంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యలో స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తనకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన, ఇతర పార్టీల్లో చేరాలనే భావన లేదని, రాజకీయాలను వదిలేసే ప్రసక్తి కూడా లేదని ఉండవల్లి స్పష్టం చేశారు.