సమస్యలపై గొంతెత్తుతా | Collection - Final steps to complete | Sakshi
Sakshi News home page

సమస్యలపై గొంతెత్తుతా

Published Fri, Apr 25 2014 3:10 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

సమస్యలపై గొంతెత్తుతా - Sakshi

సమస్యలపై గొంతెత్తుతా

  •      హంద్రీ-నీవా పూర్తి చేసేందుకు చర్యలు
  •      మూడేళ్లుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నా
  •      గల్ఫ్‌లో ఉన్న రాజంపేట వాసుల సమస్యలు తీరుస్తా
  •      వలసలు పోకుండా పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక కృషి
  •      మీట్ ది ప్రెస్‌లో వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి వెల్లడి
  •  సాక్షి, తిరుపతి: రాజంపేట లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిష్టవేసిన ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో వినిపించి, పరిష్కరించేందుకు కృషిచేస్తామని వైఎస్సార్‌సీపీ రాజంపేట లోక్‌సభ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. యువకుడినైన తనకు రాజంపేట నుంచి లోక్‌సభకు పోటీచేసే అవకాశం కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మిథున్‌రెడ్డి గురువారం తిరుపతిలో ఏపీడబ్ల్యూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
         
     రాజంపేట లోక్‌సభకు ఎన్నికైన వెంటనే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు స్థానిక కార్యాలయాలు పెట్టి ప్రజాసమస్యల పై అర్జీలు తీసుకునేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాం.
         
     వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మూడేళ్లుగా రాజంపేట లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పనిచేస్తున్నా.
         
     రాజంపేట నియోజకవర్గంలో ప్రధాన సమస్య నీటి ఎద్దడి. వెయ్యి అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో డ్యామ్‌లు కట్టడం వల్ల తంబళ్లపల్లె, పుంగనూరు, మదనపల్లె తదితర నియోజకవర్గాలకు వర్షపు నీరు రావడం లేదు. ఈ సమస్య శాస్వతంగా పరిష్కారం కావాలంటే హంద్రీనీవా ప్రాజెక్టు రావాలి. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీ.ఎం కాగానే ప్రాజెక్టు పనులు పూర్తి చేయించేందుకు కృషిచేస్తా. గాలేరు-నగరి ప్రాజెక్టునూ పూర్తి చేస్తాం.
         
     రాజంపేట లోక్‌సభ పరిధిలో చాలామంది ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తా. ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడి ప్రవాస భారతీయుల (రాజంపేట వాసులు) సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా.
         
     తంబళ్లపల్లె, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలు కరువు ప్రాంతాలు. హంద్రీ నీవా నీళ్లను చెరువులకు అనుసంధానం చేసి సాగునీరు అందేలా చర్యలు చేపడతాం.
         
     రాజంపేటలో ఇద్దరు కేంద్ర మంత్రులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు, ఇతర పర్యటనల ద్వారా 14 లక్షల మంది ఓటర్లలో ఐదారు లక్షల మందిని ప్రత్యక్షంగా కలిశారు. ఈ రకంగా చూస్తే ఇక్కడ ప్రత్యర్థులు ఎవరూ గట్టిపోటీ ఇచ్చే పరిస్థితిలేదు. ప్రధాన ప్రత్యర్థి అంటే బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పురందేశ్వరినే.
         
     నాకు ఓటు పుంగనూరు నియోజకవర్గంలో ఉంది. రాజంపేట నియోజకవర్గానికి నేను కొత్తకాదు. నేను లోకల్. మా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. మా కుటుంబానికి నియోజకవర్గంతో ఉన్న అనుబంధం, పరిచయాలు కూడా నా గెలుపునకు దోహదం చేస్తాయి.
      

    వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. వలసల నివారణ, మహిళా భద్రత వంటి అంశాలకు ప్రాముఖ్యత ఇ చ్చారు. గ్రామాల్లో పదిమంది కానిస్టేబుళ్లతో మహి ళా పోలీస్టేషన్ ఏర్పాటుచేస్తారు. స్వయం ఉపాధి రు ణాలు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక ప్రకటించారు.
         
     వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తే రాణించలేరు. ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష, సేవా భావం ఉంటేనే రాణిస్తారు.
         
     చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది. పార్టీ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమనకరుణాకర రెడ్డి, ఎన్.అమరనాథరెడ్డిలతో కలిసి పార్టీ నాయకత్వం ఐక్యంగా ముందుకెళ్తోంది.
         
     ఓటమి భయంతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు పోటీ నుంచి విరమించుకున్నారు. గతంలో ఆయన వైఎస్.రాజశేఖర రెడ్డి అండవల్లే అక్కడ గెలుపొందారు.

    వైఎస్సార్ సీపీ జిల్లాలో మైనారిటీలకూ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. జెడ్పీ, మదనపల్లె, పుంగనూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలను మైనారిటీలకు కేటాయించింది.
         
     రాజంపేట లోక్‌సభ పరిధిలో ఫుడ్‌ప్రాసెసింగ్, మ్యాంగో, టమాట పల్ప్, ప్రొసెసింగ్ యూనిట్లు స్థాపించి రైతులను ఆదుకుంటాం. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం.
         
     చిత్తూరు విజయ డెయిరీ తరహాలో కొత్త డెయిరీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement