సర్జికల్ స్ట్రైక్స్‌పైనా విమర్శలా.. హవ్వ!
ఒకవైపు పాకిస్థాన్, మరోవైపు చైనా, ఇంకోవైపు బంగ్లాదేశ్.. ఇలా మూడు దేశాలు మన దేశాన్ని ఎంత ఆక్రమించుకుందామా అని చూస్తున్న తరుణంలో భారతసైన్యం వీరోచితంగా చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా కొంతమంది రాజకీయ నాయకులు విమర్శించారని, అది ఏమాత్రం సరికాదని రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన 'మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్స్ ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో జాతీయ భావాన్ని ఉప్పొంగేలా చేశాయని, ఇలాంటి వాటి విషయంలో అనుమానాలు రేకెత్తేలా మాట్లాడటం సరికాదని ఆయన చెప్పారు. వాటిని అందరూ అభినందించాలని, ఈ విషయంలో రాజకీయాలు చేయడం అనవసరమని అన్నారు.
రాజ్యసభలో ప్రవేశించడానికి తనకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని, తాను చిత్తశుద్ధితో, ప్రజాకాంక్షలకు అనుగుణంగా, ప్రజల అంచనాలకు తగినట్లుగా పనిచేయాలన్నదే ఆకాంక్ష అని, తప్పకుండా ఆ పని చేస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు. మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, మన భాష, సంస్కృతి ఎంత గొప్పవంటే.. విదేశాల్లో ఉన్న ప్రజా సంబంధాలతో పోలిస్తే మన గొప్పతనం ఏంటో అర్థమవుతుందన్నారు. మన దేశంలో భిన్న సంస్కృతులు, మతాలు, సామాజికవర్గాలు ఉండొచ్చు గానీ, భిన్నత్వంలో ఏకత్వంతో మన దేశం ముందంజ వేస్తోందని అన్నారు. కానీ కాలక్రమేణా 1980లతో పోల్చుకుంటే ప్రజాస్వామ్య, సామాజిక విలువలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని.. ఇది సహజంగా జరగడంలేదని, సమాజానికి మంచిది కాదని తెలిపారు. దేశంలో ఇప్పుడు పరిస్థితులు విశ్లేషిస్తే.. భాషలవారీగా, మతాల వారీగా, కులాల వారీగా విడిపోయి, స్వప్రయోజనాలను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్న ముఖ్యమైన నాలుగు వ్యవస్థలు సమన్యాయం పాటించి, కులమతాలకు అతీతంగా న్యాయం చేస్తేనే ఈ వ్యవస్థ పదికాలాల పాటు సవ్యంగా కొనసాగుతుందని, కానీ దురదృష్టవశాత్తు వ్యవస్థలన్నీ కులమతాల మయమైపోయాయని ఆయన అన్నారు.
ఎన్నికలు అయిపోయి రెండున్నరేళ్లు అవుతున్న సందర్భంలో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవలని సూచించారు. 2014లో అధికారంలోకి రాకముందు టీడీపీ ఎన్నో హామీలిచ్చింది.. వైఎస్ఆర్‌సీపీకి 44 శాతం, మిగిలిన పార్టీలన్నింటికీ 45 శాతం ఓట్లు వచ్చాయని, వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రాకపోవచ్చు గానీ, ప్రజాబలం ఎంతుందన్నది కూడా ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందా, ప్రజాకాంక్షలకు అనుకూలంగా పనిచేస్తోందా అనేది చూసుకోవాలన్నారు. మీడియా కూడా పార్టీలు, కులాల వారీగా విడిపోయినట్లు కనిపిస్తోందని, చివరకు కొన్ని సంపాదకీయాల్లో కూడా విలువలు పడిపోయి పక్షపాత ధోరణితో రాస్తున్నారని.. ఇలాంటిది జరగకూడదని తెలిపారు.