కేసీఆర్ వ్యూహం ఫలించిందా...!
వరంగల్ : వరంగల్ వార్ వన్‌సైడ్ కావడానికి కారణమేంటి? అధికారం చేపట్టిన 17 నెలల తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నికల్లో మెజారిటీ ఏమాత్రం తగ్గినా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు విమర్శలు తప్పవు. అలాంటి విమర్శలు మొదలైతే ఆ ప్రభావం త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపైనా పడుతుంది.
రాజకీయంగా ఈ విషయాలు తెలిసిన కేసీఆర్ వరంగల్ ఉపఎన్నిక తొలినుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు స్పష్టమవుతుంది. ఏ చిన్న విషయంలోనూ నిర్లక్ష్యం చూపరాదంటూ నేతలను ఎప్పటికప్పుడు పురమాయించడం భారీ మెజారిటీకి కారణమైందని చెబుతున్నారు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో నేతలు నిర్లక్ష్యం ప్రదర్శించే అవకాశాలుంటాయని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ప్రతిరోజూ కేసీఆర్ నేతలతో మాట్లాడుతూ పురమాయించారు.
నిజానికి ఈ ఉపఎన్నిక విషయంలో ప్రచారం చేయకూడదని తొలుత భావించినప్పటికీ విపక్షాలకు అవకాశం ఇవ్వకూడదన్న భావనతోనే కేసీఆర్ స్వయంగా ప్రచార సభల్లో కూడా పాల్గొన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రోజూవారి పర్యవేక్షణతో పాటు పోలింగ్ రోజున కూడా మండలాల వారిగా ఇంచార్జీలతో మాట్లాడుతూ అవసరమైన సూచనలిచ్చారు. ఆ కారణంగా గత రికార్డును బద్దలు చేస్తూ నాలుగున్న లక్షలకుపైగా భారీ మెజారిటీ సాధ్యమైందని టీఆర్‌ఎస్ నేతలు అంగీకరిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ టీఆర్‌ఎస్ భారీ మెజారిటీ సాధించింది. ఉప ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటాయి.
అయితే ఈసారి ఫలితాల్లో గతంకన్నా మెజారిటీ ఏమాత్రం తగ్గినా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శల దాడి తప్పదు. వాటిని తిప్పికొట్టాలన్న వ్యూహంతో ఉపఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు నుంచే కేసీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంచార్జీ చొప్పున మంత్రులు, ఎంపీలను నియమించారు. వారితో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు.
నియోజకవర్గాల వారిగా నివేదికలు తెప్పించుకుని రోజువారిగా నేతల పురమాయించారు. పోలింగ్ కేంద్రాల వారిగా నివేదికలు తెప్పించుకుంటూ మార్గనిర్ధేశం చేశారు. గత ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఒక్క పాలకుర్తిలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఈసారి పాలకుర్తిలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థికి మెజారిటీ లభించింది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోవడంతో టీఆర్‌ఎస్‌కు మరింత బలాన్నిచ్చింది.