రుణమే బంగారమాయే
- తాజా ప్రకటనతో ఊరట
- తాకట్టులో రూ.284 కోట్లు
- 28,083 మంది రైతులకు ఊరట
- మొత్తంగా రూ.2,984 కోట్ల మాఫీ
- జిల్లాలో 5.05 లక్షల మందికి లబ్ధి
బంగారం తాకట్టు పెట్టిన రైతులకు ఊరట లభించింది. పంట రుణాలతో పాటు బంగారంపై తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటంతో రుణమాఫీ అయోమయానికి తాత్కాలికంగా తెరపడింది. తాజా ప్రకటనతో జిల్లాలో మొత్తం 5.05 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొత్తంగా రూ.2984 కోట్లు మాఫీ కానున్నాయి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కొత్త ప్రభుత్వం కొలువు దీరగానే రుణమాఫీ పథకం గందరగోళానికి తెరలేపింది. కేవలం గత ఏడాది తీసుకున్న పంట రుణాలు మాఫీ చేస్తామని, పాత బకాయిలు పరిగణనలోకి తీసుకోరని, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదంటూ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించటంతో పాటు అదే కోణంలో బ్యాంకర్ల నుంచి సమాచారం కోరింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బెజ్జంకి మండలంలో తన రుణం మాఫీ కావటం లేదనే మానసిక వ్యథతో ఒక రైతు గుండెపోటుతో చనిపోగా.. ఎల్లారెడ్డిపేట మండలంలో మరొక తు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరోవైపు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని, నిర్ణీత గడువు నిర్ణయం సరైంది కాదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఎట్టకేలకు ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి మరింత స్పష్టమైన వివరణ ఇచ్చింది. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలకు సైతం మాఫీ వర్తిస్తుందని, శుక్రవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో జిల్లాలోని బ్యాంకుల్లో బంగారం కుదువపెట్టిన రైతులు సైతం ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు. మొత్తంగా దాదాపు అయిదు లక్షల మందికి రుణమాఫీ వర్తించనుంది. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో 28,083 మంది రైతులు బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. మార్చి 31 వరకు బంగారం తాకట్టుపై తీసుకున్న రుణాల మొత్తం రూ.284 కోట్లు. గత ఏడాది వ్యవధిలోనే బంగారంపై రూ.70 కోట్ల రుణాల పంపిణీ జరిగింది.
తాజా నిర్ణయంతో ఈ రుణాలన్నీ మాఫీ అయ్యే అవకాశముందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని బ్యాంకుల్లో మొత్తం రూ.4,122 కోట్ల రుణాలు రైతుల పేరిట ఉన్నాయి. వీటిలో రూ.2,700 కోట్లు పంట రుణాలు కాగా.. మిగతావి వ్యవసాయ, అనుబంధ టర్మ్ రుణాలు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను సైతం టర్మ్ రుణాలుగానే పరిగణిస్తారు.
టర్మ్ రుణాలకు రుణమాఫీ వర్తించే అవకాశం లేకున్నా... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. మొత్తంగా జిల్లాలో 4,77,663 మంది రైతులు వీటి పరిధిలో పంట రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి రైతుల పేరిట ఉన్న పంట రుణాల మొత్తం రూ.2,700 కోట్లు. వీటితో పాటు బంగారం రుణాలు కలిపి.. మొత్తంగా రూ.2,984 కోట్లు మాఫీ చేసేందుకు సర్కారు నడుం బిగించింది. దీంతో జిల్లాలో మొత్తం 5,05,746 మంది రైతులు లబ్ధి పొందనున్నారు.